IND vs AUS: పేస్‌కు పడిపోయారు

Eenadu icon
By Sports News Desk Published : 01 Nov 2025 02:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
6 min read

రెండో టీ20లో ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓటమి
విజృంభించిన హేజిల్‌వుడ్‌ 
అభిషేక్‌ మెరుపులు వృథా
మెల్‌బోర్న్‌

మబ్బులు పట్టిన చల్లటి వాతావరణం.. బౌన్స్, స్వింగ్‌ అనుకూల పిచ్‌.. టీమ్‌ఇండియా బ్యాటర్లు అసలు ఇష్టపడని పరిస్థితులు ఇవి. ఇలాంటి స్థితిలో విదేశీగడ్డపై గతంలో ఎన్నోసార్లు పేలవ ప్రదర్శన చేసిన భారత జట్టు మరోసారి తేలిపోయింది. కిక్కిరిసిన స్టేడియంలో అభిమానులు ఇండియా.. ఇండియా అంటూ ఉత్సాహపరిచినా బ్యాటర్లు వారిని అలరించలేకపోయారు. అభిషేక్‌శర్మ, హర్షిత్‌రాణా మినహా అంతా విఫలమవడంతో మెల్‌బోర్న్‌లో ఓటమి తప్పలేదు. పోరాటమే లేకుండా రెండో టీ20లో తలొంచింది టీమ్‌ఇండియా.

భారత జట్టుకు పంచ్‌! వర్షంతో రద్దయిన తొలి టీ20లో ఆడిన కాసేపు ఆకట్టుకున్న టీమ్‌ఇండియా.. రెండో టీ20లో తేలిపోయింది. 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ చేతిలో చిత్తయ్యింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హేజిల్‌వుడ్‌ (3/13)తో పాటు బార్ట్‌లెట్‌ (2/39), నాథన్‌ ఎలీస్‌ (2/21) పేస్‌కు కుదేలైంది. శుక్రవారం మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ శర్మ (68; 37 బంతుల్లో 8×4, 2×6) మాత్రమే ఆసీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. హర్షిత్‌ రాణా (35; 33 బంతుల్లో 3×4, 1×6) పోరాడకుంటే స్కోరు వంద కూడా దాటేది కాదు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (46; 26 బంతుల్లో 2×4, 4×6) మెరుపులతో ఆసీస్‌ 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది. ఆదివారం మూడో టీ20 జరుగుతుంది.

హేజిల్‌వుడ్‌ చకచకా: స్టేడియంలో అభిమానులను చూస్తే భారత్‌లో ఆడిన భావన కలిగివుంటుంది టీమ్‌ఇండియాకు. కానీ బ్యాటర్లు అలవాటులేని పేస్, బౌన్సీ పిచ్‌పై తడబడి వికెట్లు అప్పగించుకున్నారు. హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ మొదటి బంతికే అంపైర్‌ ఎల్బీగా ఇచ్చినా.. రివ్యూలో బతికిపోయిన శుభ్‌మన్‌ గిల్‌ (10 బంతుల్లో 5) ఆ తర్వాత ఇబ్బంది పడ్డాడు. ఓ బంతి శుభ్‌మన్‌ హెల్మెట్‌ను బలంగా తాకింది. చక్కని లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసిన హేజిల్‌వుడ్‌ తన రెండో ఓవర్లో గిల్‌ను ఔట్‌ చేశాడు. షాట్‌ ఆడే క్రమంలో మిడాఫ్‌ ఫీల్డర్‌కు చిక్కి అతడు పెవిలియన్‌ చేరాడు. శాంసన్‌ (2) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఎలీస్‌ బౌలింగ్‌లో ఎల్బీగా అతడు ఔటయ్యాడు. 

20 పరుగులకు తొలి వికెట్‌ పడితే.. ఆ తర్వాత కాసేపటికే స్కోరు 49/5గా మారిపోయింది స్కోరుబోర్డు. వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లే పెవిలియన్‌ చేరిపోయారు. ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లో సూర్యకుమార్‌ (1)ను ఓ షార్ట్‌ బంతితో బోల్తాకొట్టించిన హేజిల్‌వుడ్‌.. అదే ఓవర్లో తిలక్‌వర్మ (0)ను వెనక్కి పంపాడు. పేస్‌లో మార్పు చేస్తూ హేజిల్‌వుడ్‌ వేసిన బంతిని తిలక్‌ షాట్‌ కొట్టే ప్రయత్నం చేయగా.. అది ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌కు చిక్కింది. తన తొలి నాలుగు ఓవర్ల స్పెల్‌లో హేజిల్‌వుడ్‌ 15 డాట్‌ బాల్స్‌ వేసి మూడు వికెట్లు తీసి భారత్‌ టాప్‌ఆర్డర్‌ను కూల్చాడు. అక్షర్‌ (7) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ కావడంతో భారత్‌ యాభైలోపే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. వంద పరుగులైనా దాటుతుందా అని అనిపించిన తరుణమది.

అభిషేక్‌ ఒక్కడే: వికెట్లు పడుతున్నా.. ఒత్తిడి ఉన్నా.. అభిషేక్‌ శర్మ నిలిచాడు. సహచరులు ఆడిన పిచ్‌ వేరు.. తాను ఆడుతున్న పిచ్‌ వేరు అన్నట్లు సాగింది అతడి బ్యాటింగ్‌. లేట్‌ కట్‌ షాట్లు, శక్తివంతమైన డ్రైవ్‌లు, పుల్‌ షాట్లతో మెరుపులు మెరిపించిన అభిషేక్‌.. స్కోరుబోర్డును కదిలించాడు. బార్ట్‌లెట్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో క్రీజు వదిలి ముందుకు దూసుకొచ్చి ఆఫ్‌ సైడ్‌ కొట్టిన సిక్సర్‌ హైలైట్‌. ఈ క్రమంలోనే 23 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. వన్డే సిరీస్‌లో బ్యాట్‌తోనూ సత్తా చాటిన హర్షిత్‌ రాణా నుంచి అభిషేక్‌కు చక్కటి సహకారం అందింది. స్టాయినిస్‌ బౌలింగ్‌లో ఓ భారీ సిక్స్‌ బాదిన హర్షిత్‌...బార్ట్‌లెట్‌ ఓవర్లో అలాంటి షాట్‌కే ప్రయత్నించి డేవిడ్‌కు చిక్కాడు. ఆరో వికెట్‌కు అభిషేక్‌-హర్షిత్‌ జంట 56 పరుగులు జత చేసింది.  ఆ తర్వాత మళ్లీ పాత కథే. శివమ్‌ దూబె (4), కుల్‌దీప్‌ (0) నిలవలేకపోయారు. 18వ ఓవర్లో అభిషేక్‌ ఓ సిక్స్, ఫోర్‌ అందుకోవడంతో స్కోరు 120 దాటింది. ఆఖరి వరకు అతడు ఉండివుంటే పోరాడగలిగే స్కోరు నిలిచేదేమో. కానీ 19వ ఓవర్లో అభిషేక్‌తో పాటు బుమ్రా (0) ఔటైపోవడంతో మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 19వ ఓవర్‌ వరకు నిలిచినా అభిషేక్‌ ఎదుర్కొన్న బంతులు 37 మాత్రమే. 

మార్ష్‌ మెరుపులు: స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాను ఆరంభంలో భారత బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. మనోళ్లు తడబడిన పిచ్‌పై స్వేచ్ఛగా ఆడిన ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్, ట్రావిస్‌ హెడ్‌ (28) ఆసీస్‌కు శుభారంభాన్ని అందించారు. బలమైన పుల్‌ షాట్లు, చక్కని డ్రైవ్‌లతో మార్ష్‌ వేగంగా స్కోరు పెంచాడు. హర్షిత్‌ వేసిన నాలుగో ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు బాదాడు. హెడ్‌ కూడా ఉన్నంతసేపు మెరవడంతో ఆసీస్‌ స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఆ జట్టు 4.1 ఓవర్లలోనే 50 పరుగులు అందుకుంది. హెడ్‌ను వరుణ్‌ ఔట్‌ చేసినా.. మార్ష్‌ తగ్గలేదు. కుల్‌దీప్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో సహా 20 పరుగులు రాబట్టిన అతడు చివరి బంతికి ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 8 ఓవర్లకు 82/2. ఇంకా ఆ జట్టు 39 పరుగులు చేస్తే చాలు. అయితే 5 ఓవర్ల వ్యవధిలో 4 వికెట్లు పడ్డాయి. టిమ్‌ డేవిడ్‌ (1)ను వరుణ్‌.. ఇంగ్లిస్‌ (20)ను కుల్‌దీప్‌ ఔట్‌ చేశారు. బుమ్రా (2/26)ఒకే ఓవర్లో ఒవెన్‌ (14), షార్ట్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. కానీ అప్పటికే ఆసీస్‌ విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆ జట్టు మరో 40 బంతులు మిగిలుండగానే గెలిచింది. బంతి మెడకు బలంగా తగలడంతో దుర్మరణం పాలైన ఆసీస్‌ యువ క్రికెటర్‌ బెన్‌ ఆస్టిన్‌కు నివాళిగా రెండు జట్ల క్రికెటర్లు ఈ మ్యాచ్‌లో నల్ల రిబ్బన్లు ధరించి బరిలో దిగారు. 

భారత్‌ ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ (సి) మార్ష్‌ (బి) హేజిల్‌వుడ్‌ 5; అభిషేక్‌ శర్మ ఎల్బీ (బి) ఎలీస్‌ 68; శాంసన్‌ ఎల్బీ (బి) ఎలీస్‌ 2; సూర్యకుమార్‌ (సి) ఇంగ్లిస్‌ (బి) హేజిల్‌వుడ్‌ 1; తిలక్‌వర్మ (సి) ఇంగ్లిస్‌ (బి) హేజిల్‌వుడ్‌ 0; అక్షర్‌ రనౌట్‌ 7; హర్షిత్‌ (సి) డేవిడ్‌ (బి) బార్ట్‌లెట్‌ 35; శివమ్‌ దూబె (సి) ఇంగ్లిస్‌ (బి) బార్ట్‌లెట్‌ 4; కుల్‌దీప్‌ (సి) అబాట్‌ (బి) స్టాయినిస్‌ 0; వరుణ్ నాటౌట్‌ 0; బుమ్రా రనౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (18.4 ఓవర్లలో ఆలౌట్‌) 125

వికెట్ల పతనం: 1-20, 2-23, 3-32, 4-32, 5-49, 6-105, 7-109, 8-110, 9-125; బౌలింగ్‌: హేజిల్‌వుడ్‌ 4-0-13-3; బార్ట్‌లెట్‌ 4-0-39-2; నాథన్‌ ఎలీస్‌ 3.4-0-21-2; స్టాయినిస్‌ 4-0-24-1; ఒవెన్‌ 1-0-13-0; కునెమాన్‌ 2-0-14-0

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: మిచెల్‌ మార్ష్‌ (సి) అభిషేక్‌ (బి) కుల్‌దీప్‌ 46; ట్రావిస్‌ హెడ్‌ (సి) తిలక్‌ (బి) వరుణ్‌ 28; ఇంగ్లిస్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 20; టిమ్‌ డేవిడ్‌ (సి) అండ్‌ (బి) వరుణ్‌ 1; మిచెల్‌ ఒవెన్‌ (సి) శాంసన్‌ (బి) బుమ్రా 14; స్టాయినిస్‌ నాటౌట్‌ 6; షార్ట్‌ (బి) బుమ్రా 0; బార్ట్‌లెట్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (13.2 ఓవర్లలో 6 వికెట్లకు) 126; వికెట్ల పతనం: 1-51, 2-87, 3-90, 4-112, 5-124, 6-124; బౌలింగ్‌: బుమ్రా 4-0-26-2; హర్షిత్‌ రాణా 2-0-27-0; వరుణ్‌ 4-0-23-2; కుల్‌దీప్‌ 3.2-0-45-2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు