Ishan - Shreyas: ఎవరితోనూ బలవంతంగా ఏమీ చేయించలేం: వృద్ధిమాన్ సాహా

ఇషాన్‌ కిషన్, శ్రేయస్‌ వ్యవహారంలో బీసీసీఐ తీసుకున్న చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్‌లను బోర్డు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Updated : 01 Mar 2024 11:15 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెటర్లు ఇషాన్‌ కిషన్, శ్రేయస్‌ అయ్యర్‌కు (Ishan Kishan - Shreyas Iyer) సెంట్రల్ కాంట్రాక్ట్‌లు ఇవ్వకుండా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రంజీల్లో ఆడకపోవడంతోనే వీరిపై వేటు వేసింది. ఈ అంశంపై సీనియర్‌ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ఆ ఇద్దరు క్రికెటర్లు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయంపై బీసీసీఐ స్పందించింది. వారి కాంట్రాక్ట్‌లను రద్దు చేసింది. అయితే, బలవంతంగా వారితో ఆడించలేరు. వారు ఆడాలనుకుంటేనే ఆడతారు’’ అని తెలిపాడు. 

ప్రతి మ్యాచూ కీలకమే..

‘‘క్రికెటర్‌గా ప్రతి మ్యాచ్‌కూ సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. ఫిట్‌గా ఉండి క్లబ్ మ్యాచ్‌లు ఆడినా.. ఒక్కోసారి ఆఫీస్‌ స్థాయిలోనూ ఆడినా.. ప్రతి మ్యాచ్‌ను ఒకేలా చూస్తా. ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచించగలిగితే వారి కెరీర్‌తోపాటు భారత క్రికెట్‌కు మరింత ప్రయోజనం చేకూర్చిన వారవుతారు. దేశవాళీ క్రికెట్‌ ఎంత ముఖ్యమో సర్ఫరాజ్‌ ఖాన్‌ను చూస్తేనే అర్థమవుతుంది. గత నాలుగైదేళ్లుగా డొమిస్టిక్‌లో విపరీతంగా ఆడి పరుగులు సాధించాడు. ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపికై మంచి ప్రదర్శన చేస్తున్నాడు. యువ వికెట్ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ను దేశవాళీ క్రికెట్‌లో పెద్దగా చూడలేదు. ఈ టెస్టు సిరీస్‌లోనూ అతడి ఇన్నింగ్స్ హైలైట్స్‌ను మాత్రమే చూశా. అద్భుతమైన బ్యాటింగ్‌ సత్తా ఉంది. గత టెస్టులో భారత్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. జాతీయ జట్టులో రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉండాలంటే దేశవాళీ క్రికెట్‌దే ముఖ్య భూమిక. అయితే, కొందరు అవకాశాలు ఉన్నప్పటికీ ఆడేందుకు ఇష్టపడటం లేదు. తప్పకుండా ఏదొక ఫార్మాట్‌లో ప్రతి ఒక్కరూ ఆడితేనే ఫామ్‌ అందుకోవడానికి అవకాశం ఉంటుంది’’ అని సాహా వ్యాఖ్యానించాడు. 

ఆటగాళ్లకు గట్టి సందేశం ఇచ్చినట్లైంది: హర్షా భోగ్లే

‘‘సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయం క్రికెటర్లకు గట్టి సందేశం ఇచ్చినట్లే. ఫిట్‌గా ఉండి భారత్‌ తరఫున సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడాలనుకుంటే దేశవాళీలో సత్తా నిరూపించుకొని రావాలి. ఫస్టక్లాస్‌ క్రికెట్‌ స్థాయిని తక్కువ చేయకూడదు. ఒకవేళ పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడదామని భావిస్తే.. దేశవాళీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే టోర్నీల్లో పాల్గొనాలి. శ్రేయస్‌, ఇషాన్‌ అద్భుతమైన ఆటగాళ్లు. అందులో అనుమానం లేదు. వారిద్దరూ భారీగా పరుగులు చేసి మళ్లీ జాతీయ జట్టులోకి రావాలని కోరుకుంటున్నా. గతంలో స్టార్‌ క్రికెటర్లూ ఇదే చేశారు. గంగూలీ. లక్ష్మణ్‌, జడేజా, కుంబ్లే.. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఫామ్‌ను అందుకొన్నవారే. చాహల్‌ కూడా మళ్లీ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని