IND vs PAK: భారత్ - పాక్‌ మ్యాచ్‌.. రీసేల్‌లో ఆ సీట్‌కు రూ.1.46 కోట్లు!

ఐసీసీ వెబ్‌సైట్‌లో టికెట్లను కొనుక్కొని.. సెకండరీ మార్కెట్‌లో రీసేల్‌కు పెడుతుంటారు. తాజాగా భారత్ - పాక్‌ మ్యాచ్‌కు ఇలాగే ఓ టికెట్‌ను కోటిన్నరకు దగ్గరగా పెట్టాడో ఓ వ్యక్తి. 

Published : 08 Jun 2024 16:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా ఎదురుచూసే భారత్ - పాక్‌ మ్యాచ్‌కు న్యూయార్క్‌ సిద్ధమైంది. ఆదివారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) దాయాది పోరు జరగనుంది. ఇప్పటికే ఆ మ్యాచ్‌ టికెట్లు అమ్ముడైన సంగతి తెలిసిందే. అయితే, రీసేల్‌ వెబ్‌సైట్లలో ఒక్క సీట్‌పై ఫ్యాన్స్‌ విపరీతంగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో రీసేల్ మార్క్‌ట్‌లో 1.75 లక్షల డాలర్లు.. అంటే మన రూపాయల్లో దాదాపు రూ. 1.46 కోట్లు. ఇది కేవలం అమ్మే వ్యక్తి కోరుకుంటున్న సొమ్ము మాత్రమే. ఇప్పటివరకు దీనిని ఎవరూ రీసేల్ చేసినట్లు సమాచారం లేదు. సెక్షన్ 252లోని 20వ వరుసలో 30వ సీట్‌కు ఇంత ఖరీదు పెట్టడం గమనార్హం. దీంతో ఆ సీట్‌కు ఎందుకంత రేట్‌ అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరో వెబ్‌సైట్‌లోనూ ఇదే ధరతో టికెట్‌ రేట్‌ను ఆ వ్యక్తే లిస్ట్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. 

ఐసీసీ సైట్‌లో ఇంకా టికెట్లు..

భారత్ - పాక్‌ మ్యాచ్‌ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. అయితే,  న్యూయార్క్‌ వేదిక కావడంతో కొన్ని సీట్లు మిగిలిఉన్నాయని ఐసీసీ వెబ్‌సైట్‌ చూస్తే అర్థమవుతుంది. డైమండ్ క్లబ్ (10వేల డాలర్లు), కబానాస్‌ (3వేల డాలర్లు), కార్నర్ క్లబ్స్ (2,750 డాలర్లు), ప్రీమియమ్ క్లబ్ లాంజ్ (2,500 డాలర్లు), బౌండరీ క్లబ్ (1,500 డాలర్లు) కేటగిరీల్లో కొన్ని సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 

పాక్ జట్టుపై మాజీ కెప్టెన్ తీవ్ర విమర్శలు

యూఎస్‌ఏ చేతిలో పాకిస్థాన్‌ ఓటమి చెందడంతో ఆ జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శలు ఎక్కుపెట్టారు. తాజాగా పాక్‌ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ మాట్లాడుతూ.. ‘‘యూఎస్‌ఏకు పాక్‌ ఎలా వెళ్లిందో అర్థంకావడం లేదు. బాడీ లాంగ్వేజ్‌ కూడా దారుణంగా ఉంది. ఎవరిలోనూ గెలవాలనే ఆకాంక్ష కనిపించలేదు. వీళ్లను చూస్తుంటే మేం చాలా ఏళ్లుగా క్రికెట్‌ ఆడటం లేదేమో అనిపించింది. షహీన్‌కు కొత్త బంతితో యార్కర్‌ వేయడం మాత్రమే తెలిసినట్లుంది. ఒకవేళ బంతి స్వింగ్‌ కాకపోతే అతడి ప్రభావం శూన్యం’’ అని భట్ తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని