Womens world cup Final: అమ్మాయ్.. అదిగో కప్పు!
మహిళల వన్డే ప్రపంచకప్ తుది పోరు నేడే 
దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ
తొలి టైటిల్ కోసం ఇరు జట్ల తహతహ
నవీ ముంబయి 

ఒక్క అడుగే.. దశాబ్దాల నిరీక్షణకు తెరపడడానికి!
ఇంకొక్క అడుగే.. ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం దక్కడానికి!
మరొక్క అడుగే.. మన మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించడానికి!
క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించే దేశం సంబరాల్లో మునిగిపోతుందా.. లేక బాధతో నిట్టూరుస్తుందా.. ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.
సొంతగడ్డపై ప్రపంచకప్ జరుగుతున్నా.. కొన్ని రోజుల ముందు వరకు మన జట్టు కప్పు గెలవడంపై ఎన్నో సందేహాలు! భారత్‌ను ఫేవరెట్‌గా పరిగణించడానికి సంకోచం! కానీ ఏడుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాపై ప్రపంచ రికార్డు ఛేదనతో అంతా మారిపోయింది. ఇప్పుడు మన జట్టే టైటిల్‌కు హాట్ ఫేవరెట్! సొంత మైదానం.. కలిసొచ్చే పరిస్థితులు.. ఓ అద్భుత విజయంతో ఫైనల్ చేరిన ఉత్సాహం.. ప్రధాన క్రికెటర్ల సూపర్ ఫామ్.. అన్నీ కలిసి మన జట్టును ట్రోఫీకి అత్యంత చేరువగా నిలబెట్టాయి. కప్పు కలను నెరవేర్చుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాకపోవచ్చు.
మరి హర్మన్‌ప్రీత్ సేన మరో బలమైన అడుగు వేస్తుందా? అంచనాలకు తగ్గట్లు ఆడి దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచకప్‌నకు తొలి ముద్దు పెడుతుందా?
ఆట ఏదైనా ప్రపంచకప్ అత్యున్నత టోర్నీ. అది అందుకోవడం క్రీడాకారుల కల. కానీ భారత మహిళల క్రికెట్లో ఎవ్వరికీ ఇప్పటిదాకా ఆ కల నెరవేరలేదు. ఇప్పుడు ఓ అద్భుత అవకాశం హర్మన్‌ప్రీత్ సేన ముందు నిలిచింది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ జట్టు.. ఆ ఉత్సాహంలో ఆదివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్‌కు సిద్ధమైంది. ఇప్పటిదాకా రెండుసార్లు ఫైనల్ చేరినా భారత్‌కు కప్పు దక్కలేదు. ఈసారి జట్టుకు పరిస్థితులు ఎంతో అనుకూలంగా కనిపిస్తున్న నేపథ్యంలో అవకాశాన్ని వదలకూడదన్నది అభిమానుల ఆకాంక్ష. దక్షిణాఫ్రికా వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడడం ఇదే తొలిసారి. కాబట్టి ఈ రాత్రి కొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నాం. ఆ కొత్త జట్టు భారతే అయితే దేశంలో సంబరాలకు అంతే ఉండదు.
ఆ రెండుసార్లు..
భారత మహిళలకిది మూడో ప్రపంచకప్ ఫైనల్. 2005లో తొలిసారి తుదిపోరుకు వెళ్లిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో 98 పరుగుల తేడాతో ఓడింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో మొదట ఆసీస్ 4 వికెట్లకు 215 పరుగులు చేయగా.. మిథాలి రాజ్ నేతృత్వంలోని భారత్ 117 పరుగులకే కుప్పకూలింది. 2017లో ట్రోఫీకి అత్యంత చేరువగా వెళ్లిన భారత్.. 9 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది. అప్పుడూ కెప్టెన్ మిథాలినే. 229 పరుగుల ఛేదనలో భారత జట్టు 219 పరుగులకు ఆలౌటైంది.
తుది జట్లు (అంచనా)...
భారత్: స్మృతి, షెఫాలి, జెమీమా, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), దీప్తి, రిచా, అమన్‌జ్యోత్, స్నేహ్/రాధ, శ్రీచరణి, క్రాంతి, రేణుక
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అనెకె బోష్, సున్ లుజ్, మరిజేన్ కాప్, సినాలో జఫ్టా, అనెరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నదైన్ డిక్లెర్క్, ఖకా, ఎంలబా 
వర్షం పడితే..
ముంబయిలో కొన్ని రోజులుగా వర్షం పడుతోంది. ఆదివారం మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పుంది. సాయంత్రం పూట వరుణుడు పలకరించవచ్చు. ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే తర్వాతి రోజు నిర్వహిస్తారు. ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి కొనసాగిస్తారు.
సమష్టిగా కదిలితే..

కష్టపడి సెమీస్‌కు అయితే వచ్చేశారు కానీ.. ఆస్ట్రేలియాను దాటి ఫైనల్‌కు వెళ్లడం అసాధ్యమనే అనుకున్నారంతా. కానీ మనమ్మాయిలు గురువారం అద్భుతమే చేశారు. మేటి కంగారూ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ, ఏకంగా 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేశారు. ఈ విజయం జట్టు విశ్వాసాన్ని ఎంతో పెంచి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఊపులో తమకు అనుకూల పరిస్థితులుండే డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను భారత అమ్మాయిలు ఓడించగలరనే ధీమా అభిమానుల్లో కనిపిస్తోంది. కానీ ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే కష్టమే. లీగ్ దశలో ఆ జట్టుతో తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్‌లో పట్టు వదిలి ఓటమి చవిచూసింది భారత్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల చేతుల్లోనూ ఇలాగే ఓడారు. కానీ సెమీస్‌లో మాత్రం ఆఖరి వరకు పట్టు వదలకుండా పోరాడి నెగ్గారు. ఆ మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్‌పై ఫైనల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫామ్‌తో తంటాలు పడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సరైన సమయంలో జోరందుకుంది. సెమీస్‌లో విఫలమైన స్మృతి మంధాన తుది పోరులో మాత్రం పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిందే. ప్రతీక గాయంతో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని షెఫాలి ఆ మ్యాచ్‌లో ఉపయోగించుకోలేకపోయింది. ఫైనల్లో అయినా ఆమె తనదైన శైలిలో చెలరేగుతుందేమో చూడాలి. మిడిలార్డర్లో దీప్తి, రిచా కీలకం. డీవై పాటిల్ పిచ్ స్పిన్‌కు అనుకూలం. స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడే దక్షిణాఫ్రికాను ఆ అస్త్రంతోనే దెబ్బ తీయాలి. చక్కటి ప్రదర్శన చేస్తున్న తెలుగమ్మాయి శ్రీ చరణి, దీప్తి కీలకం కానున్నారు. స్నేహ్, రాధల్లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కుతుంది. రేణుక, క్రాంతి కొత్త బంతిని పంచుకుంటారు. అమన్‌జ్యోత్ నుంచి జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనను ఆశిస్తోంది. వీళ్లందరూ తమ ప్రతిభకు న్యాయం చేస్తే.. జట్టంతా కలిసికట్టుగా సాగితే.. ప్రపంచకప్ కలను నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు.
మన చరణి మరోసారి..!

పెద్ద స్కోర్లు నమోదవుతున్న మహిళల ప్రపంచకప్‌లో 5 లోపు ఎకానమీ నమోదు చేయడమే కాక.. 13 మందిని ఔట్ చేసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అయిదో స్థానంలో కొనసాగుతోంది తెలుగమ్మాయి శ్రీ చరణి. టోర్నీలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఆమె ఒకరు. ఆస్ట్రేలియా 338 పరుగులు చేసిన సెమీస్‌లోనూ ఆమె 10 ఓవర్లలో 49 పరుగులే ఇచ్చి, 2 కీలక వికెట్లు పడగొట్టింది. మధ్య ఓవర్లలో పరుగులు కట్టడి చేస్తూ, వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను దెబ్బ కొడుతున్న చరణి.. ఆదివారం కూడా ఇలాగే సత్తా చాటాలని జట్టు ఆశిస్తోంది.
ఆమెతోనే అతి పెద్ద ముప్పు
దక్షిణాఫ్రికాలో కొందరు మేటి క్రికెటర్లున్నారు. వారిలో అత్యంత ప్రమాదకరం.. మరిజేన్ కాప్. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఎందులో అయినా తనకు తానే సాటి అనిపిస్తుంది ఈ ఆల్‌రౌండర్. మంచి పేస్‌తో బౌలింగ్ చేసే కాప్.. ఆరంభంలోనే చకచకా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెడుతుంది. ఆమెను కాచుకోవడం భారత ఓపెనర్లకు సవాలే. ఇక మిడిలార్డర్ బ్యాటింగ్‌లోనూ ఆమె ఎంతో కీలకం. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో, పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడడంలో తనది ప్రత్యేక నైపుణ్యం. ప్రస్తుత టోర్నీలో 204 పరుగులు, 12 వికెట్లతో ఆమె సత్తా చాటింది. ఫైనల్లోనూ తనదైన ముద్ర వేయాలని కాప్ చూస్తోంది. ఇక బ్యాటింగ్‌లో జట్టును కెప్టెన్ లారా వోల్వార్ట్ ముందుండి నడిపిస్తోంది. టోర్నీలో ఆమే టాప్‌స్కోరర్. బలమైన ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో 169 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్‌తో ముందే ప్రత్యర్థికి ఓటమిని ఖాయం చేసింది లారా. తన ఓపెనింగ్ భాగస్వామి తజ్మిన్ బ్రిట్స్ సైతం ఫామ్‌లో ఉంది. ఇక ఆల్‌రౌండర్లు నదైన్ డిక్లెర్క్, క్లో ట్రయాన్ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. లీగ్ దశలో భారత్‌ను దెబ్బ కొట్టింది వీళ్లిద్దరే. ముఖ్యంగా డిక్లెర్క్ విధ్వంసాన్ని భారత్ మరిచిపోయి ఉండదు. వీళ్లిద్దరూ బౌలింగ్‌లోనూ కీలకం. స్పిన్నర్ ఎంలబా ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటుతోంది. మధ్య ఓవర్లలో ఆమెను ఎదుర్కోవడం పరీక్షే.
17
ప్రస్తుత ప్రపంచకప్‌లో దీప్తి శర్మ, అనాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా) పడగొట్టిన వికెట్లు. ఫైనల్లో ఒక వికెట్ తీస్తే దీప్తి నంబర్‌వన్ అవుతుంది.
సునిధి ప్రదర్శన..
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ప్రముఖ గాయని సునిధి చౌహాన్ ప్రదర్శన ఇవ్వనుంది. ఆమెతో పాటు 60 మంది నృత్యకారుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కొరియోగ్రాఫర్ సంజయ్ శెట్టి ఓ ప్రత్యేక ఫైర్ వర్క్స్ ప్రదర్శన ఇవ్వనున్నాడు. డ్రోన్ డిస్‌ప్లే, లేజర్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.

ప్రపంచకప్ ఫైనల్ చూడాలని..
భారత్‌లో మహిళల క్రికెట్లో ఎప్పుడూ కనిపించని దృశ్యం. టికెట్ల కోసం అభిమానులు గంటల తరబడి నిరీక్షించారు.. వేల రూపాయలు వెచ్చించి టికెట్ కొనేందుకు సిద్ధమయ్యారు. కానీ చాలామందికి నిరాశే ఎదురైంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ఉన్న డిమాండ్ ఇది. ఆన్‌లైన్‌లో అమ్మకం మొదలైన కాసేపటికే తక్కువ ధర టికెట్లు (రూ.150) ఒక్కటీ మిగల్లేదు. ఆన్‌లైన్‌లో ఎక్కువ ధర టికెట్ల ధరలు రూ.6500తో మొదలయ్యాయి. వీఐపీలకు ఇచ్చే ఒక్కో టికెట్ ధర రూ.లక్షా 30 వేలుగా ఉంది.
ఫైనల్‌కు చేరాయిలా..
భారత్ లీగ్ దశలో
- శ్రీలంకపై 59 పరుగుల విజయం
 - పాకిస్థాన్‌పై 88 పరుగుల విజయం
 - దక్షిణాఫ్రికా చేతిలో 3 వికెట్ల ఓటమి
 - ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల ఓటమి
 - ఇంగ్లాండ్ చేతిలో 4 పరుగుల ఓటమి
 - న్యూజిలాండ్‌పై 53 పరుగుల విజయం
 - బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు
 - సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల విజయం
 
దక్షిణాఫ్రికా లీగ్ దశలో
- ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల ఓటమి
 - న్యూజిలాండ్‌పై 6 వికెట్ల విజయం
 - భారత్‌పై 3 వికెట్ల విజయం
 - బంగ్లాదేశ్‌పై 3 వికెట్ల విజయం
 - శ్రీలంకపై 10 వికెట్ల విజయం
 - పాకిస్థాన్‌పై 150 పరుగుల విజయం
 - ఆస్ట్రేలియా చేతిలో 7 వికెట్ల ఓటమి
 - సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై 125 పరుగుల విజయం
 
పిచ్?
డీవై పాటిల్ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 338 పరుగులు చేయగా.. వన్డేల్లో అతి పెద్ద ఛేదనతో భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇక్కడ స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. రాత్రి మంచు ప్రభావం బౌలర్లకు బంతిపై పట్టు చిక్కడం కష్టం కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనను ఎంచుకునే అవకాశాలు ఎక్కువ.
44
వన్డే ప్రపంచకప్‌లో మరిజేన్ కాప్ (దక్షిణాఫ్రికా) వికెట్లు. టోర్నీ చరిత్రలో ఆమే నంబర్‌వన్ బౌలర్.
భారత్‌తో ఆడిన చివరి మూడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికానే నెగ్గింది.
470
ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ పరుగులు. ఆమెనే టాప్‌స్కోరర్. స్మృతి మంధాన (389) రెండో స్థానంలో ఉంది. ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక ప్రపంచకప్ పరుగులు (1227) సాధించిన బ్యాటర్ కూడా వోల్వార్టే. ఫైనల్లో లారా ఇంకో 40 పరుగులే చేస్తే.. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులతో అలీసా హీలీ (2021లో, 509) నెలకొల్పిన రికార్డు బద్దలవుతుంది.
ఓడిపోతే ఎంత బాధ కలుగుతుందో మాకు తెలుసు. కానీ ఇప్పుడు గెలిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాం. ఆదివారం మాకు ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతుందని ఆశిస్తున్నాం. ఎంతో కష్టపడ్డాం. టోర్నీలో మూడు పరాజయాలు చవిచూసినా మేం నిరాశచెందలేదు. కలసికట్టుగా ఆడాం. ఫైనల్ చేరాం. ఇప్పుడు దేశానికి కప్పు అందించడం కోసం ప్రతి ఒక్కరూ బాగా ఆడాలనుకుంటున్నారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్‌ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్‌దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్‌ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్‌కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్‌ముఖ్.. చెస్ ప్రపంచకప్‌లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


