Indian Women's Team: కొత్త బంగారు లోకం

Eenadu icon
By Sports News Desk Updated : 03 Nov 2025 04:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

ఈనాడు క్రీడావిభాగం

ప్రయాణ ఖర్చుల కోసం చందాలు వేసుకోవడం దగ్గర్నుంచి.. కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందే వరకు! రోడ్డు మీద వెళ్తుంటే ఎవ్వరూ పట్టించుకోని స్థితి నుంచి.. రక్షణ వలయం లేకుండా బయటికి వెళ్లలేని దశ వరకు! ప్రత్యక్ష ప్రసారమే లేని రోజుల నుంచి.. ఓ స్ట్రీమింగ్‌ యాప్‌లో ఒకేసారి 20 కోట్ల మంది మ్యాచ్‌ చూసేవరకు! వందమందైనా జనం లేక వెలవెలబోయిన మైదానాల నుంచి.. ఒక్క సీటూ ఖాళీగా లేని నిండైన స్టేడియాల వరకు! ఉచిత ప్రవేశం ఇచ్చినా చూడని రోజుల నుంచి.. వేల రూపాయల టికెట్ల కోసం జనం ఎగబడడం వరకు! ..చాలా దూరమే ప్రయాణించింది భారత మహిళల క్రికెట్‌. కానీ ఇదంతా ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు! ఈ ప్రయాణంలో ఈ ప్రపంచకప్‌ విజయం అతి పెద్ద మలుపు! ఇకపై చూడబోయేది ఇంకా గొప్ప మార్పు!

2005 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌. భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌. స్టేడియంలో 2 వేల మంది కూడా లేరు. ఆదివారం నాటి భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్‌ మ్యాచ్‌ కోసమని ఒక రోజంతా స్టేడియం దగ్గర నిలబడ్డా టికెట్లు దొరకని పరిస్థితి. ఆన్‌లైన్లోనూ టికెట్‌ ముక్క లేదు. మహిళల క్రికెట్‌ ఎంత మారిందో చెప్పడానికి ఇంతకంటే రుజువేముంది? కానీ మహిళల క్రికెట్‌ ఈ స్థాయికి చేరడానికి చాలా సమయమే పట్టింది.

అక్కడి నుంచే..

అయిదు దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతోంది మహిళల జట్టు. కానీ ఉమెన్‌ క్రికెట్‌  అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లు ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయింది మహిళల క్రికెట్‌. అందుకు ప్రధాన కారణం నిధుల కొరత. నామమాత్రపు మ్యాచ్‌ ఫీజులు.. చాలీచాలని టీఏలు, డీఏలు.. రైల్లో ప్రయాణాలు, ఇరుకు గదుల్లో బస.. ప్రాక్టీస్‌కు సౌకర్యాల లేమి.. ఇలా అనేక ఇబ్బందుల మధ్య మిథాలీ రాజ్‌ సహా చాలామంది క్రికెటర్ల ప్రయాణం చాలా కష్టంగా సాగింది. పెద్దగా ఆదాయం రాకపోగా సొంతంగా చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. విదేశీ మ్యాచ్‌ కోసం మిథాలీ చందాలేసుకుని వెళ్లడం గమనార్హం. కానీ 2006లో బీసీసీఐ గొడుగు కిందికి వచ్చాకే నెమ్మదిగా మార్పు మొదలైంది. మహిళలకు మ్యాచ్‌లు, ఫీజులు పెరిగాయి. వసతులు సమకూరాయి. క్రమంగా వారి ఆట మారింది. ఐపీఎల్‌ తరహాలోనే మహిళల క్రికెట్‌ లీగ్‌ రాకతో మన అమ్మాయిల ఆట మరో స్థాయికి చేరింది. మేటి విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడడం ఎంతో ఉపకరించింది. ఒత్తిడికి గురి కాకుండా, పురుషుల్లాగే బెదురులేని క్రికెట్‌ ఆడడం అలవాటైంది. ప్రస్తుతం పురుషులతో సమానంగా మ్యాచ్‌ ఫీజులు, నజరానాలు అందుకుంటున్నారు అమ్మాయిలు. 

మారిన ఆట, దృక్పథం

పురుషుల క్రికెట్లో వన్డేల్లో 300 స్కోర్లు మామూలైపోయిన రోజుల్లో.. మహిళల క్రికెట్లో 200 దాటడమే కష్టంగా ఉండేది. చిన్న లక్ష్యాలను ఛేదించడానికి కూడా కష్టపడిపోయేవాళ్లు. 2005 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేసింది 215 పరుగులే. అయినా భారత్‌ 98 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఆటతీరు వల్లే అభిమానుల్లో కూడా.. అమ్మాయిల ఆటను ఏం చూస్తాంలే అనే భావనుండేది. మహిళల క్రికెట్‌ బీసీసీఐ కిందికి వచ్చాక కూడా వెంటనే అంతా మారిపోలేదు. ఆటలో దూకుడు పెరగడానికి, మనమ్మాయిలు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవడానికి సమయం పట్టింది. ఎలాంటి బౌలర్లయినా దీటుగా ఎదుర్కొనే, సై అంటే సై అని తలపడే హర్మన్‌ప్రీత్, స్మృతి లాంటి నవతరం క్రికెటర్ల రాకతోనే భారత జట్టు ఆటతీరులో మార్పు వచ్చింది. షెఫాలి, జెమీమా, రిచా లాంటి క్రికెటర్లు కూడా అభిమానుల దృష్టిని తమ వైపు తిప్పుకొన్నారు. 2017 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్నందించిన హర్మన్‌ప్రీత్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ (171 నాటౌట్‌) ఓ సంచలనం. పురుషులకు ఏమాత్రం తీసిపోని కళాత్మక బ్యాటింగ్, విధ్వంసక ఇన్నింగ్స్‌లతో తమకూ ఆకర్షణ శక్తి ఉందని, తాము కూడా వేలాది మందిని స్టేడియాలకు రప్పించగలమని.. టీవీల ముందు కోట్ల మందిని కూర్చోబెట్టగలమని మనమ్మాయిలు రుజువు చేశారు. దీంతో ఒకప్పుడు మహిళల క్రికెట్‌ అంటే అస్సలు పట్టని భారత అభిమానులు.. నెమ్మదిగా స్టేడియాలకు రావడం మొదలైంది. డబ్ల్యూపీఎల్‌ రాకతో గత రెండు మూడేళ్లలో భారత అమ్మాయిల ఆట మరింత మెరుగైంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి ప్రత్యర్థులంటే ముందే జావగారిపోయేది భారత జట్టు. కానీ ఇప్పుడు ఆ జట్లను దీటుగా ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో దాని సొంతగడ్డపై తలపడి వరుసగా టీ20, వన్డే సిరీస్‌లు నెగ్గింది టీమ్‌ఇండియా. ఇక ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్‌ ఆడగా.. అందులో 1-2తో ఓడినప్పటికీ, ఆడిన తీరు మాత్రం అమోఘం. ఓ మ్యాచ్‌లో ఏకంగా 102 పరుగుల తేడాతో నెగ్గింది భారత్‌. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లు మారిన భారత అమ్మాయిల ఆటతీరుకు ఒక సంకేతం. ఇప్పుడు ప్రపంచకప్‌లో మరింత ఉత్తమంగా ఆడి విజేతగా నిలిచింది.

ఇకపై ఇంకో స్థాయికి

పురుషుల క్రికెట్‌ది 140 ఏళ్ల చరిత్ర. అందులో 1983లో కపిల్‌ డెవిల్స్‌ ప్రపంచకప్‌ గెలవడం పెద్ద మలుపు. అక్కడ్నుంచే ప్రపంచ క్రికెట్‌ భారత్‌ చుట్టూ తిరగడం మొదలైంది. దేశంలో క్రికెట్‌కు ఆదరణ అమాంతం పెరిగింది. బీసీసీఐ ప్రపంచంలోనే ధనిక బోర్డుగా ఎదగడంతో మన క్రికెట్‌ రూపురేఖలే మారిపోయాయి. క్రమంగా టీమ్‌ఇండియా ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా ఎదిగింది. ఇప్పుడీ ప్రపంచకప్‌ విజయంతో అమ్మాయిల క్రికెట్‌ మరో స్థాయికి చేరడం ఖాయం. ఇప్పటిదాకా భారత అమ్మాయిలు ఏం సాధించినా.. ప్రపంచకప్‌ విజయంతో వచ్చే ఊపు వేరు. మన అమ్మాయిల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్నింటికీ మించి దేశంలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అమ్మాయిల సంఖ్య, వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. శిక్షణ, సౌకర్యాలూ మరింత మెరుగుపడతాయి. ఇప్పటికే క్రికెట్‌ అంటే అబ్బాయిల ఆట అనే భావన పోయింది. అమ్మాయిల ఆటపై కాస్త చిన్నచూపు కూడా ఇకపై ఉండదు. రెండేళ్ల కిందట మహిళల క్రికెట్‌ లీగ్‌ను మొదలుపెడితే.. అయిదు ఫ్రాంఛైజీలు కలిపి రూ.4700 కోట్ల రేటు పలికాయి. మీడియా హక్కులు రూ.961 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇకపై ఈ లెక్కలు ఇంకా పెద్దవి కావడం.. లీగ్‌లో ఆట, ఆదరణ, ఆదాయం మరో స్థాయికి చేరడం ఖాయం.

Tags :
Published : 03 Nov 2025 03:37 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు