INDw vs AUSw: ఆస్ట్రేలియాపై రికార్డు ఛేదన.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

Eenadu icon
By Sports News Team Updated : 30 Oct 2025 23:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముంబయి: మహిళల వన్డే ప్రపంచకప్‌ (ICC Womens World Cup 2025)లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాకు సెమీస్‌లో షాక్‌ ఇచ్చింది. కంగారూల జట్టుపై టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (127*; 134 బంతుల్లో 14 ఫోర్లు) సెంచరీతో మెరిసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89; 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. జెమీమా, హర్మన్‌ప్రీత్ మూడో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం (156 బంతుల్లో) నెలకొల్పారు.

దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), స్మృతి మంధాన (24), అమన్‌జ్యోత్ కౌర్ (15*), షెఫాలీ వర్మ (10) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్ రెండేసి వికెట్లు పడగొట్టారు. టీమ్‌ఇండియా ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2005, 2017లో ఫైనల్‌కు వెళ్లినా టైటిల్ సాధించలేకపోయింది. నవంబర్‌ 2న ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు విశ్వవిజేతగా నిలవకపోవడంతో ఈ సారి కొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నాం.

ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ లీచ్ ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి సెంచరీ బాదింది. ఎలీస్ పెర్రీ (77; 88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించింది. లీచ్‌ఫీల్డ్, ఎలీస్ పెర్రీ రెండో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం (133 బంతుల్లో) నెలకొల్పారు. ఆష్లీన్ గార్డ్‌నర్ (63; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించింది. బెత్ మూనీ (24), కిమ్ గార్త్ (17), తాహిలా మెక్‌గ్రాత్ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

  • ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అత్యధిక రన్స్‌ ఛేజ్‌ చేసిన జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది. ఇదే టోర్నీలో భారత్‌ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు సృష్టించగా.. ఇప్పుడు దాన్ని టీమ్ఇండియా బ్రేక్ చేసింది.
  • వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్రకు ఈ మ్యాచ్‌తో బ్రేక్ పడింది. వరుసగా 15 విజయాల తర్వాత కంగారూలు ఓటమిని చవిచూశారు.

Tags :
Published : 30 Oct 2025 22:44 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు