Womens World Cup: ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తి: ప్రధాని మోదీ

Eenadu icon
By Sports News Team Updated : 03 Nov 2025 11:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళల ప్రపంచకప్‌ (Womens World Cup)లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడారు. ముంబయి వేదికగా ఉద్విగ్నభరితంగా సాగిన ఫైనల్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. షెఫాలీ వర్మ (87 పరుగులు, 2 వికెట్లు), దీప్తి శర్మ (58 పరుగులు, 5 వికెట్లు) బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ అదరగొట్టి భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించారు. టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ను గెలవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ సహా పలువురు నేతలు ప్రశంసలు కురిపించారు.

దేశమంతా గర్వపడేలా చేశారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

‘‘ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ను నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. వారి అద్భుతమైన నైపుణ్యం,  ప్రదర్శనకు ప్రతిఫలం దక్కింది. భవిష్యత్తులో మహిళల క్రికెట్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. దేశమంతా గర్వపడేలా చేసిన అమ్మాయిలకు నా ప్రశంసలు’’

ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తి: ప్రధాని మోదీ

మహిళ ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఫైనల్‌లో గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో ఆటగాళ్లు ప్రదర్శన చేశారు. టోర్నీ ఆసాంతం ఆటగాళ్లు అసాధారణ సమష్టి కృషి, పట్టుదలను ప్రదర్శించారు. భారత క్రీడాకారులకు అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది. 

‘ఉమెన్‌ ఇన్‌ బ్లూ’ చరిత్ర సృష్టించింది: రాహుల్‌ గాంధీ

ఎంతో గర్వకారణమైన క్షణం ఇది. ‘ఉమెన్‌ ఇన్‌ బ్లూ’ చరిత్ర సృష్టించింది. అద్భుతమైన విజయంతో కోట్లాది హృదయాలను తాకారు. మీ తెగువ, పోరాటం భారత్‌కు కీర్తిని తెచ్చిపెట్టాయి. కోట్లాది అమ్మాయిల్లో ఈ విజయం స్ఫూర్తినిస్తుంది. వారు ధైర్యంగా కలలు కనేలా చేశారు. మీరు కేవలం ట్రోఫీని మాత్రమే పొందలేదు జాతీయ స్ఫూర్తిని రగిల్చారు. 

క్రీడాకారులకు అభినందనలు: ఏపీ సీఎం చంద్రబాబు

మహిళ ప్రపంచకప్‌ సాధించిన క్రీడాకారులకు అభినందనలు. మహిళా క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది. మన బిడ్డలు మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశారు. ఈ విజయం అద్భుతమైన ప్రదర్శన, అవిశ్రాంత దృఢ సంకల్పానికి స్ఫూర్తి. ఈ గెలుపు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుంది. 

దశాబ్దాల కలను భారత మహిళల జట్టు నెరవేర్చుకుంది: సీఎం రేవంత్‌రెడ్డి

భారత మహిళల జట్టుకు హృదయపూర్వక అభినందనలు. దక్షిణాఫ్రికాతో ఉద్విగ్నంగా సాగిన ఫైనల్‌లో భారత అమ్మాయిలు ఎంతో బలం, ధైర్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి టైటిల్‌ నెగ్గారు. భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుత నాయకత్వంతో జట్టును ముందుకు నడిపించింది. దశాబ్దాల కలను భారత మహిళల జట్టు నెరవేర్చుకుంది. ఈ చిరకాల విజయం పట్ల భారత్‌ గర్విస్తోంది. ఫైనల్‌లో భారత ఆటగాళ్ల పోరాటపటిమ ఔత్సాహిక క్రీడాకారులకు ఒక మార్గనిర్దేశం కానుంది. ఇదే ఉత్సాహం, ఐక్యత, ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులో భారత మహిళల జట్టు మరింత ఉన్నతస్థానాలను అధిరోహిస్తుందని ఆశిస్తున్నా.

మన క్రీడాకారులకు సెల్యూట్‌: మంత్రి నారా లోకేశ్‌

ప్రపంచకప్‌ సాధించిన భారత క్రీడాకారులకు అభినందనలు.ఈ గెలుపు రానున్న తరాలకు స్ఫూర్తి. ఏపీకి చెందిన శ్రీచరణి రానున్న రోజుల్లో గొప్ప శిఖరాలకు చేరుకుంటుంది.

Tags :
Published : 03 Nov 2025 01:19 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని