Mohammad Siraj : సిరాజ్‌ మియా.. నీ మాయ అదిరిందయ్యా..!

తన మ్యాజికల్‌ స్పెల్‌తో శ్రీలంకను పేకమేడలా కుప్పకూల్చిన మహమ్మద్‌ సిరాజ్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..

Updated : 18 Sep 2023 14:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : మహమ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj).. ఈ పేరే ఇప్పుడు ఓ సంచలనం. ఆసియా కప్‌(Asia Cup 2023 Final) ఫైనల్‌ మ్యాచ్‌ చూసిన వారెవరైనా.. ఇది ‘భారత్‌ vs శ్రీలంక’(IND vs Srilanka) మ్యాచ్‌ అనరు.. ‘సిరాజ్‌ vs శ్రీలంక’ అంటారు. అంతలా తన మ్యాజికల్‌ స్పెల్‌తో మాయ చేశాడు. బుల్లెట్‌లాంటి బంతులతో ప్రత్యర్థి వికెట్లను సైకిల్‌ స్టాండ్‌లా కూల్చాడు. ఈ హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్‌ దెబ్బకు 50 ఓవర్ల మ్యాచ్‌ కాస్త.. 20 ఓవర్లకు కుదించుకుపోయింది. సిరాజ్‌ సంచలన బౌలింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే..

సిరాజ్‌తో ఏడు ఓవర్లే వేయించడానికి కారణమదే

ఆసియా కప్‌ ఫైనల్‌లో అతడు విసిరే బంతులను కాచుకోలేక.. వికెట్లు సమర్పించుకోవడమే బెటరనుకున్నారేమో.. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు లంక బ్యాట్స్‌మెన్‌. ఈ క్రమంలో ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. తోటి ఆటగాళ్లు ప్రేమగా ‘మియా భాయ్‌’గా పిలుచుకునే సిరాజ్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..

  1. సిరాజ్‌ తండ్రి ఓ ఆటో డ్రైవర్‌ అన్న విషయం తెలిసిందే. అయితే సిరాజ్‌ కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా.. అతడి క్రికెట్‌ కెరీర్‌ కోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు.
  2. సిరాజ్‌ ఆరంభంలో టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ ఆడేవాడు. అతడికి కోచ్‌ కూడా లేడు. తనకు తానే ఆటలో మెళకువలు నేర్చుకున్నాడు. టెన్నిస్‌ బాల్‌తోనే తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు.
  3. ఈ హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ గొప్ప బౌలర్‌ అన్న విషయం తెలిసిందే. అయితే తన కెరీర్‌ను బౌలర్‌గా కాకుండా.. బ్యాట్స్‌మన్‌గా ప్రారంభించడం విశేషం. చార్మినార్‌ క్రికెట్‌ క్లబ్‌ తరఫున బ్యాటర్‌గా బరిలోకి దిగేవాడు. ఆ తర్వాత బౌలర్‌గా మారాడు.
  4. ఇక క్రికెటర్‌గా సిరాజ్‌ తొలి సంపాదన ఎంతో తెలుసా..? రూ.500. తన మావయ్య కెప్టెన్సీలో ఓ క్లబ్‌ మ్యాచ్‌ ఆడాడు. 25 ఓవర్ల ఆటలో.. మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడి ప్రదర్శన మెచ్చిన మావయ్య అతడికి రూ.500 బహూకరించాడు.
  5. 2015-16 రంజీ ట్రోఫీలో.. హైదరాబాద్‌ జట్టు తరఫున 41 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
  6. సిరాజ్‌ను ఐపీఎల్‌ వేలంలో మొదట సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రూ.2.6 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఎక్కువ మొత్తం దక్కించుకున్న అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ డబ్బుతో అతడు తన తల్లిదండ్రుల కోసం ఇల్లు కొన్నాడు.
  7. తండ్రి మరణాన్ని విని తన్నుకొస్తున్న దుఃఖాన్ని తట్టుకుని మరీ 2020 డిసెంబర్‌లో బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌లో జట్టు బౌలింగ్‌ దాడిని కొనసాగించాడు సిరాజ్‌. ఈ సిరీస్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు.. ఫైనల్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
  8. సిడ్నీ టెస్టులో స్థానిక ప్రేక్షకుల నుంచి సిరాజ్‌ జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. అయినా ఏకాగ్రత చెదరకుండా మంచి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని