IPL: ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు..! ఉల్లంఘిస్తే జరిమానా

ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగే రోజు వ్యాఖ్యాతలు, ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్‌ జట్లకు సంబంధించిన సోషల్ మీడియా, కంటెంట్ టీమ్‌లు స్టేడియం నుంచి ఎలాంటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Updated : 15 Apr 2024 18:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగే రోజు ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్టేడియం నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బీసీసీఐ (BCCI) సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ జరిగే రోజు వ్యాఖ్యాతలు, ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్‌ జట్లకు సంబంధించిన సోషల్ మీడియా, కంటెంట్ టీమ్‌లు స్టేడియం నుంచి ఎలాంటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల ఓ మ్యాచ్‌లో వ్యాఖ్యానిస్తున్నప్పుడు మాజీ భారత బ్యాటర్ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని ఐపీఎల్‌ ప్రసార హక్కులు పొందినవారు బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. 

‘‘ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బ్రాడ్‌కాస్టర్లు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారు. కాబట్టి, వ్యాఖ్యాతలు మ్యాచ్ రోజున వీడియోలు లేదా ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. కొంతమంది వ్యాఖ్యాతలు ‘ఇన్‌స్టాగ్రామ్ లైవ్’, మైదానం నుంచి ఫొటో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒక వీడియోకు ఒక మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఐపీఎల్‌ జట్లు కూడా లైవ్ మ్యాచ్‌ల వీడియోలను పోస్ట్ చేయొద్దు. పరిమిత సంఖ్యలో ఫొటోలను, మ్యాచ్‌కు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ను సోషల్‌ మీడియాలో పంచుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లఘించినట్లు తేలితే ఫ్రాంచైజీ జరిమానా విధిస్తాం’’ అని ఓ బీసీసీఐ అధికారి జాతీయ మీడియాతో అన్నారు. 

ఆటగాళ్లు కూడా ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడానికి వీల్లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కొందరు ఆటగాళ్లు ఇటీవల మ్యాచ్ రోజులలో ఫొటోలను పంచుకున్నారని, వాటిని తొలగించాలని సూచించినట్లు బోర్డు అధికారులు చెప్పారు. ఆటగాళ్లు చేసే సోషల్‌ మీడియా పోస్టులపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. తాము పాల్గొన్న లైవ్ గేమ్ వీడియో క్లిప్‌ను షేర్ చేసినందుకు ఓ ఐపీఎల్ టీమ్‌కు రూ.9 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని