Ishan Kishan: తొలి హాఫ్‌ సెంచరీ.. విరాట్ నిర్ణయంతోనే సాధ్యమైంది: ఇషాన్‌ కిషన్

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (WI vs IND) విండీస్‌ పోరాడుతోంది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 365 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం విండీస్ 76/2 స్కోరుతో కొనసాగుతోంది. భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ (57)తోపాటు యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ (52*) వేగంగా హాఫ్ సెంచరీ సాధించాడు.

Updated : 24 Jul 2023 09:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు (WI vs IND) రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా వికెట్ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (52*: 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఇదే అతడి టెస్టు కెరీర్‌ తొలి అర్ధశతకం కావడం విశేషం. విండీస్‌తో మొదటి టెస్టుతోనే సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అడుగు పెట్టిన ఇషాన్‌ కిషన్.. ఆ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయడంతో మరింత సమయం ఆడే అవకాశం రాలేదు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు సాధించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెకండ్‌ డౌన్‌లో వచ్చి దూకుడుగా ఆడి కేవలం 33 బంతుల్లోనే  హాఫ్ సెంచరీ కొట్టాడు. కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో ఒంటిచేత్తో సిక్స్‌ కొట్టి మరీ అర్ధశతకం  పూర్తి చేయడం విశేషం. సెకండ్‌ డౌన్‌లో వచ్చే విరాట్ కోహ్లీకి బదులు ఇషాన్‌ ముందు బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో తన ఇన్నింగ్స్‌పై ఇషాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘టెస్టు కెరీర్‌ను ఇప్పుడిప్పుడే మొదలుపెట్టా. ఈ ఇన్నింగ్స్‌ ఎంతో ప్రత్యేకమైంది. నా నుంచి జట్టుకు ఏం కావాలనే దానిపై పూర్తిగా అవగాహన ఉంది. టీమ్‌లో ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచారు. బ్యాటింగ్‌కు ముందు వరుసలో రావడంపై విరాట్ కోహ్లీ ప్రభావం ఉంది. విండీస్‌ లెఫ్ట్‌ఆర్మ్ బౌలర్‌ బౌలింగ్‌కు వేస్తుండటంతో నన్ను ముందుకు పంపించారు. విరాట్ కోహ్లీ స్వయంగా వచ్చి బ్యాటింగ్‌కు వెళ్లాలని చెప్పాడు. వర్షం తర్వాత 12 ఓవర్లలో 70 -80 పరుగులు చేసి డిక్లేర్డ్‌ చేద్దామని ముందే అనుకున్నాం. విండీస్‌ ముందు కనీసం 370 నుంచి 380 పరుగుల లక్ష్యం ఉంచాలని నిర్ణయించుకున్నాం. దాంతో దూకుడుగా ఆడేశాం. 

రోహిత్‌, ఇషాన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. పట్టుబిగిస్తోన్న టీమ్‌ఇండియా

రిషభ్‌ పంత్‌ ఇలాంటి పరిస్థితుల్లో మరింత దూకుడుగా ఆడేవాడు. మొన్నటి వరకు నేను కూడా ఎన్‌సీఏలో ఉన్నా. రిషభ్‌ కూడా అక్కడే ఉన్నాడు. మా ఇద్దరికి అండర్ - 19 నుంచి పరిచయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలనేదానిపై పంత్‌ ఇచ్చిన సూచనలు బాగా పనిచేశాయి. క్రీజ్‌లో ఉన్నప్పుడు పొజిషన్ ఎలా ఉంటే పరుగులు చేయడం సులువుగా ఉంటుందో చెప్పాడు. అలాగే అక్కడ ఇతర సీనియర్ క్రికెటర్లూ ఉన్నారు. వారితోనూ ముచ్చటించా. ఎల్లవేళలా మద్దతుగా ఉండే నా తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నా. నా కల నెరవేరినట్లుంది. ఇక విండీస్‌తో రెండో టెస్టు ఐదో రోజు ఆట మరింత ఆసక్తికరంగా ఉండనుంది. ఆరంభంలో త్వరగా వికెట్లు తీస్తే విజయం మాదే ’’ అని ఇషాన్‌ కిషన్‌ తెలిపాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని