Ishan Kishan: బాగానే ఆడా.. కానీ నాకైతే సంతోషంగా లేదు: ఇషాన్‌ కిషన్‌

యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టేశాడు. ఆసియా కప్, ప్రపంచకప్‌ టోర్నీల జట్టు రేసులో ముందంజలో ఉన్నాడు. అయితే, మూడో వన్డేలో మంచి ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ సంతోషంగా లేదని ఇషాన్ చెప్పడం గమనార్హం.

Updated : 02 Aug 2023 09:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను (WI vs IND) భారత్‌ సొంతం చేసుకోవడంలో ఇషాన్ కిషన్‌ (Ishan Kishan) కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. తాజాగా మూడో వన్డేలోనూ 77 పరుగులు చేసి శుభారంభం అందించాడు. విండీస్‌ బౌలర్ క్యారీ వేసిన బంతిని ఆడబోయి స్టంపౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అయితే అతడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డు వచ్చింది. ఇలా కీలక ఇన్నింగ్స్‌లను ఆడినప్పటికీ తనకు మాత్రం సంతోషంగా లేదని ఇషాన్‌ కిషన్ వ్యాఖ్యానించాడు. ఫినిషింగ్‌ సరిగ్గా లేకపోవడం వల్ల భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నట్లు పేర్కొన్నాడు.

మ్యాచ్‌కు ముందు విరాట్‌తో మాట్లాడా.. ఆ సూచనలే పాటించా: హార్దిక్‌

‘‘మూడో వన్డేలో నేను ఔటైన విధానం నాకే నచ్చలేదు. క్రీజ్‌లో పాతుకుపోయి మంచి ఇన్నింగ్స్‌ ఆడిన సమయంలో భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యా. క్రీజ్‌లో ఉండి భారీ స్కోర్లు చేయాలని నా సీనియర్లు కూడా చెబుతూ ఉంటారు. అదే విధంగా గత మ్యాచ్‌లో ఏం జరిగిందనేది మరిచిపోయి మళ్లీ ఫ్రెష్‌గా స్టార్ట్‌ చేయడం చాలా ముఖ్యం. ఇక శుభ్‌మన్‌ గిల్ సూపర్బ్‌ ప్లేయర్. బంతిని సరిగ్గా అంచనా వేసి ఆడటంలో దిట్ట. ఇలా చేయడం వల్ల నాకూ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇలాంటి కీలక మ్యాచుల్లో విజయం సాధించడం ఆనందంగా ఉంది. భారీ స్కోరు చేసిన తర్వాత.. ప్రత్యర్థి వికెట్లను త్వరగా తీయాలని ప్రయత్నించి సఫలమయ్యాం. ఇక్కడే (పిచ్‌) నేను చాలా టోర్నీలు ఆడా. బంతి ఎలా స్పందిస్తుందో తెలుసు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. అయితే, దాని గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదు. ప్రస్తుతం రాబోయే టోర్నీలపైనే నా దృష్టంతా ఉంది. ఒకే ఒక్క టోర్నీ మన జీవితాన్ని మార్చేయగలదు’’ అని ఇషాన్ వ్యాఖ్యానించాడు. 

పిచ్‌ చాలా బాగుంది: గిల్

‘‘గత రెండు మ్యాచుల్లో సరిగా ఆడలేకపోయా. ఇలాంటి సమయంలో ఈ ఇన్నింగ్స్‌ చాలా ప్రత్యేకమైంది. ఇంకా భారీ స్కోరు మార్చాల్సిన సమయంలో ఔటై పెవిలియన్‌కు చేరడం నిరాశపర్చినా.. భారత్ విజయం సాధించడంతో ఆనందంగా ఉంది. ట్రినిడాడ్‌ పిచ్‌ చాలా బాగుంది. ఆరంభంలో బంతి చాలా చక్కగా బ్యాట్‌ మీదకు వచ్చింది. అయితే, బాల్ పాతబడిన కొద్దీ బ్యాటింగ్‌ కాస్త కష్టంగా మారింది. వన్డేల్లో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచాలంటే త్వరగా వికెట్లు తీయాలి. మా బౌలర్లు అద్భుతం చేశారు’’ అని గిల్ తెలిపాడు. 

ఆరో భారత బ్యాటర్‌గా ఇషాన్‌

  • వరుసగా మూడు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన ఇషాన్‌ కిషన్.. ఎంఎస్ ధోనీ, అజారుద్దీన్, దిలీప్ వెంగ్‌సర్కార్, శ్రేయస్‌ అయ్యర్, క్రిస్ శ్రీకాంత్, సరసన చేరాడు. మూడు మ్యాచ్‌ల సిరీసుల్లో వరుసగా హాఫ్ సెంచరీలు సాధించిన జాబితాలో ఆరో బ్యాటర్‌గా ఇషాన్‌ రికార్డు సృష్టించాడు.
  • ఒక జట్టుపై అత్యధిక వన్డే సిరీస్‌లను నెగ్గిన జట్టుగానూ భారత్ అవతరించింది. వెస్టిండీస్‌పై 13 సిరీస్‌లను గెలిచింది. అంతకుముందు శ్రీలంకపై భారత్ 10 సిరీస్‌లను కైవసం చేసుకుంది.
  • ఇషాన్ కిషన్ - శుభ్‌మన్‌ గిల్ తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు. విండీస్‌లో భారత్‌కు ఇదే అత్యధిక పార్టనర్‌షిప్‌ కావడం విశేషం. ఇంతకుముందు శిఖర్ ధావన్ - అజింక్య రహానె 132 పరుగులు జోడించారు. 
  • వ్యక్తిగత స్కోరు సెంచరీ లేకుండానే భారత్ జట్టు 350+ స్కోరు చేయడం ఇది రెండోసారి. ఇప్పుడు 351/5 స్కోరు చేసిన భారత్.. 2005లో నాగ్‌పుర్ వేదికగా 350/6 స్కోరు చేసింది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని