Ishan Kishan: నిన్న షమీ.. నేడు ఇషాన్‌.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరం

దక్షిణాఫ్రికా పర్యటనలో (SA vs IND) ఉన్న భారత్‌ ప్రస్తుతం వన్డే సిరీస్‌ ఆడుతోంది. ఇది ముగిశాక సఫారీ జట్టుతో రెండు టెస్టులను ఆడనుంది.

Published : 17 Dec 2023 17:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో (SA vs IND) టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు భారత్‌ మరో కీలక ఆటగాడు దూరమయ్యాడు. ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) కూడా రెండు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉండలేనని బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. దీంతో అతడికి విశ్రాంతినిచ్చిన మేనేజ్‌మెంట్‌ తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు అవకాశం కల్పించింది. ఇషాన్‌ స్థానంలో భరత్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. శనివారమే షమీ ఫిట్‌నెస్‌ నిరూపించుకోలేకపోవడంతో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇషాన్‌ కిషన్ దూరం కావడానికి కారణాలను బీసీసీఐ వెల్లడించలేదు. వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉంటున్నట్లు మాత్రమే పేర్కొంది. 

‘‘దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ కోసం ఎంపిక చేసిన స్క్వాడ్‌ నుంచి విడుదల చేయాలని టీమ్‌ఇండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. దీంతో ఇషాన్‌ను టెస్టు స్క్వాడ్‌ నుంచి తప్పించడం జరిగింది. అతడి స్థానంలో కేఎస్ భరత్‌ను ఎంపిక చేశాం. భరత్‌ త్వరలోనే జట్టుతో చేరతాడు’’ అని బీసీసీఐ ప్రకటన వెలువరించింది. డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు, జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. 

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, రుతురాజ్‌ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్‌ కుమార్‌, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్), ప్రసిధ్‌ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని