Ishan Kishan: ఇంగ్లాండ్‌తో సిరీస్‌కూ ఇషాన్‌ను బీసీసీఐ సంప్రదించిందా..?

టీమ్‌ఇండియా క్రికెటర్ ఇషాన్‌ కిషన్‌ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. ఇటు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయాడు. అటు జాతీయ జట్టులోకి రావడం కష్టంగా మారింది.

Published : 02 Mar 2024 10:17 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్‌ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లను కోల్పోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా ఇషాన్ కిషన్‌ వ్యవహారశైలిపై బీసీసీఐ ఆగ్రహంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కూ పరిగణనలోకి తీసుకోవడానికి ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడంతోనే సెంట్రల్‌ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణంగా క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. గత దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి బయటకొచ్చేసిన ఇషాన్‌.. దుబాయ్‌లో పార్టీకు వెళ్లడం సెలక్టర్లకు నచ్చలేదు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కైనా అందుబాటులో ఉంటాడని భావిస్తే.. దానికీ దూరంగా ఉన్నాడు. మరోవైపు వచ్చే ఐపీఎల్‌ కోసం సిద్ధమవుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశవాళీ క్రికెట్‌ ఆడాలని సూచించినా పెడచెవిన పెట్టి మరీ లీగ్‌ కోసం ప్రాక్టీస్‌ చేసుకోవడం బీసీసీఐకి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. 

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించే సమయంలోనూ ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఎవరైనా సరే జాతీయ జట్టుకు దూరంగా ఉండి.. మళ్లీ రావాలంటే దేశవాళీ క్రికెట్‌ ఆడాలి’’ అని సూచించాడు. కానీ, అ మాటలను ఇషాన్ పట్టించుకోలేదు. అయితే, ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టుల కోసం ఇషాన్‌ సెలక్టర్లు సంప్రదించినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. కానీ, అతడి నుంచి మాత్రం సరైన స్పందన రాలేదని తెలిసింది. ఇంకా సిద్ధంగా లేనట్లు ఇషాన్‌ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో ధ్రువ్ జురెల్‌కు మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది.  అతడు తన రెండో టెస్టులోనే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు.

రంజీ సెమీస్‌లో శ్రేయస్‌ అయ్యర్

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన శ్రేయస్‌ అయ్యర్‌.. మళ్లీ రంజీబాట పట్టాడు. తమిళనాడుతో జరుగుతున్న సెమీస్‌లో అయ్యర్‌ ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శ్రేయస్‌ రాకపై ముంబయి కెప్టెన్ అజింక్య రహానె మాట్లాడుతూ.. ‘‘ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్. ముంబయి జట్టులో అతడి భాగస్వామ్యం కీలకం. అతడికేమీ ప్రత్యేకంగా ప్రోత్సాహం అందివ్వాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్‌లో రాణించి జట్టుకు తోడుగా నిలుస్తాడు’’ అని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని