Jasprit Bumrah: బెంగళూరుపై అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా

ముంబయి బౌలర్‌ జస్‌ప్రీత్ బుమ్రా (Bumrah) తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో పర్పుల్ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు. బెంగళూరుపై ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు.

Published : 12 Apr 2024 14:36 IST

ఇంటర్నెట్ డెస్క్: వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ముంబయి పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Bumrah) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో ఫైఫర్ (5 వికెట్లు) తీయడం అతడికిది రెండోసారి. బెంగళూరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మహిపాల్ లామ్రోర్, సౌరభ్‌ చౌహాన్, విజయ్‌కుమార్ వైశాఖ్‌ వికెట్లను పడగొట్టాడు. ఇలా ఐపీఎల్‌లో ‘5 వికెట్ల’ ప్రదర్శనను రెండు సార్లు చేసిన జేమ్స్ ఫాల్కనర్, జయ్‌దేవ్ ఉనద్కత్, భువనేశ్వర్‌ కుమార్‌ సరసన నిలిచాడు. ఈ క్రమంలో బెంగళూరుపై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కూడా అవతరించాడు. ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి ప్రదర్శన చేయకపోవడం గమనార్హం. అలాగే ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. రవీంద్ర జడేజా, సందీప్ శర్మ చెరో 26 వికెట్లు తీయగా.. ఇప్పుడు బుమ్రా 29 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఐపీఎల్‌లో అతడు మొత్తం 155 వికెట్లు పడగొట్టాడు. దీంతో టాప్ -10 వికెట్‌ టేకర్స్‌ జాబితాలోకి వచ్చాడు. హర్భజన్‌ సింగ్‌ను (150)ను అధిగమించాడు. బెంగళూరుతో మ్యాచ్‌ అనంతరం బుమ్రా తన ప్రదర్శనపై స్పందించాడు. 

టీ20ల్లో బౌలింగ్‌ తేలికేం కాదు..

‘‘మరోసారి నాణ్యమైన ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉంది. ఐదు వికెట్లను తీయాలనే లక్ష్యంతో బరిలోకి దిగలేదు. తొలి 10 ఓవర్లలో పిచ్‌ నుంచి బౌలర్లకు సహకారం లభించింది. దానిని సద్వినియోగం చేసుకోవాలని భావించా. ఈ ఫార్మాట్‌లో బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. వైవిధ్యం ప్రదర్శిస్తేనే బౌలర్లకు ఫలితం అనుకూలంగా వస్తుంది. విభిన్నంగా బంతులను సంధించేందుకు చాలా శ్రమించా. బౌలింగ్‌ అనుకున్నట్లుగా వేసినా.. పిచ్‌ నుంచి సహకారం లేకపోతే బ్యాటర్లు బాదేస్తారు. అలాంటి మ్యాచ్‌ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. సన్నద్ధత అనేది ఎప్పుడూ కీలకమే. నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. యార్కర్ల ద్వారానే వికెట్లు వస్తాయనుకోవటం పొరపాటే. కొన్నిసార్లు అలా వేస్తూనే.. షార్ట్‌ బంతులనూ వేయాలి. 145 కి.మీ వేగంతో బంతులేసినా.. సందర్భాన్ని బట్టి నెమ్మదిగానూ వేయడమూ ముఖ్యమే’’ అని బుమ్రా తెలిపాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • ప్రత్యర్థులు నిర్దేశించిన 190+ స్కోరును ముంబయి లక్ష్య ఛేదన చేయడం ఇది 9వ సారి. ఈ విషయంలో పంజాబ్‌ కింగ్స్‌తో కలిసి ముంబయి అగ్రస్థానంలో కొనసాగుతోంది.
  • ఐపీఎల్‌లో 190+ స్కోరు చేసినా ఓటమిపాలు కావడం బెంగళూరుకిది 11వ సారి కావడం గమనార్హం. 
  • అత్యధిక బంతులు ఉండగానే 190+ స్కోరు టార్గెట్‌ను ఛేదించడం ఇది మూడోసారి. అన్నింట్లోనూ ముంబయి జట్టే కావడం విశేషం. రాజస్థాన్‌పై 2014లో 32 బంతులు, పంజాబ్‌పై 2017లో 27 బంతులు, బెంగళూరుపై ప్రస్తుతం 27 బంతులు మిగిలి ఉండగానే ముంబయి గెలిచింది.
  • వాంఖడేలో ముంబయికి 50వ విజయం. ఐపీఎల్‌లో ఒకే మైదానంలో ఫిఫ్టీకి చేరిన తొలి జట్టుగా ముంబయి నిలిచింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని