Jasprit Bumrah : బుమ్రా వచ్చాడు.. సందళ్లు తెచ్చాడు

రీఎంట్రీలో జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్‌కు కెప్టెన్ కూడా అయిన బుమ్రా.. మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపించాడు.

Updated : 20 Aug 2023 16:12 IST

ప్రపంచకప్ ముంగిట టీమ్ఇండియాకు ఉపశమనం

ఐర్లాండ్‌(Ireland vs India)తో మూడు టీ20ల సిరీస్‌లో టీమ్ ఇండియా(Team India) శుభారంభం చేసింది. తొలి టీ20లో భారత్‌దే విజయం. ఈ సిరీస్‌లో బరిలోకి దిగింది ద్వితీయ శ్రేణి జట్టే అయినప్పటికీ.. ఐర్లాండ్‌ను ఓడించడం పెద్ద విషయమేమీ కాదు. ఇక్కడ విజయం కంటే ఆనందాన్నిచ్చిన విషయం ఇంకోటుంది. అదే.. పునరాగమనంలో జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేయడం. ఈ సిరీస్‌కు కెప్టెన్ కూడా అయిన బుమ్రా.. మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపించడం.. ఏ తడబాటూ లేకుండా బౌలింగ్ చేయడం భారత అభిమానులకు అమితానందాన్నిచ్చింది. ప్రపంచకప్(ODI World cup 2023) ముంగిట టీమ్‌ఇండియాకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది.

రెండు మూడేళ్లు వెనక్కి వెళ్తే.. ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళాల్లో భారత్‌ది ఒకటిగా ఉండేది. విదేశాల్లో కొన్ని అద్భుత టెస్టు విజయాలు నమోదు చేయడమే కాక.. వివిధ ఫార్మాట్లలో భారత్ మేటి జట్లలో ఒకటిగా ఉందంటే అందుక్కారణం.. పదునెక్కిన మన పేస్ విభాగమే కారణం. అప్పుడు భారత పేస్ దళాన్ని ముందుండి నడిపించింది జస్‌ప్రీత్ బుమ్రానే. ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన ఈ బరోడా పేసర్.. అనతి కాలంలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించి మూడు ఫార్మాట్లలో భారత్‌కు కీలక బౌలర్‌గా ఎదిగాడు. షమి, ఇషాంత్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ లాంటి సీనియర్లు జట్టులో ఉన్నప్పటికీ.. పేస్ దళపతిగా వ్యవహరించింది బుమ్రానే. ఐతే ఎలాంటి పేస్ బౌలర్‌‌నైనా కెరీర్లో ఏదో ఒక దశలో గాయాల సమస్య వేధించడం మామూలే. బుమ్రా కూడా అందుకు మినహాయింపు కాలేదు. రెండేళ్ల నుంచి అతణ్ని ఆ ఇబ్బందులు వెంటాడుతున్నాయి. వెన్ను గాయమే కాక వేరే ఫిట్‌నెస్ సమస్యలతో సతమతం అవుతున్నాడు. అందుకే ఈ రెండేళ్లలో చాలా తక్కువ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. చివరగా 2022 సెప్టెంబరులో అతను అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత 327 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడే ఐర్లాండ్‌తో టీ20 ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే బాల్‌బిర్నీని బౌల్డ్ చేసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అదే ఓవర్లో టకర్‌ను కూడా ఔట్ చేశాడు. రీఎంట్రీలో బుమ్రా తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీయడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో బుమ్రా ప్రదర్శన ఆకట్టుకుంది. మునుపటితో పోలిస్తే రనప్, వేగం తగ్గించినప్పటికీ.. బౌలింగ్‌లో మంచి లయ కనిపించింది. అతను పూర్తి ఫిట్‌నెస్‌తో, ఉత్సాహంగా కనిపించడం భారత్‌కు గొప్ప ఉపశమనాన్నిచ్చేదే. సిరీస్‌లో మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ బుమ్రా ఇదే నిలకడను చూపిస్తే ఆ తర్వాత ఆసియా కప్‌‌లో కూడా ఆడొచ్చు. ప్రపంచకప్‌కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం కావచ్చు.

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోలో రింకు సింగ్‌పై ప్రశ్న..

అందుకే ఆలస్యం

బుమ్రా గత ఏడాది మొత్తంలో ఆడింది 5 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు మాత్రమే. వెన్నుగాయం అతణ్ని గత ఏడాది తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. నిరుడు ఐపీఎల్‌ తర్వాత గాయానికి చికిత్స చేయించుకుని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ఉండి కోలుకున్న తర్వాత భారత జట్టులోకి పునరామగనం చేసినా.. కొన్ని మ్యాచ్‌లకే గాయం తిరగబెట్టింది. కీలకమైన టీ20 ప్రపంచకప్ ముంగిట బుమ్రా‌కు మళ్లీ ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తి ఆటకు దూరం కావడం టీమ్‌ఇండియాకు పెద్ద షాక్. దీంతో ఒక్కసారిగా బౌలింగ్ బలహీన పడిపోయింది. చాన్నాళ్లుగా టీ20లు ఆడని షమి, భువనేశ్వర్‌ లాంటి సీనియర్ల మీద ఆధారపడాల్సి వచ్చింది. బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో ఎన్‌సీఏ వైద్య బృందం, ఫిజియోల పర్యవేక్షణ మీద అనేక సందేహాలు తలెత్తాయి. అందుకే ఈసారి పునరాగమనానికి బుమ్రా చాలా సమయమే తీసుకున్నాడు. కొంచెం కోలుకోగానే ఫిట్‌నెస్ సాధించేసినట్లు భావించకుండా.. సుదీర్ఘ సమయం ఎన్‌సీఏలో గడిపాడు. గాయాలు తిరగబెట్టకుండా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ మీదే చాలా నెలలు పని చేశారు వైద్యులు. శరీరం కోలుకున్నాక మ్యాచ్ ఫిట్‌నెస్ మీద దృష్టిసారించారు. ఆ తర్వాత బౌలింగ్ సాధన మొదలైంది. రెండు నెలలుగా ఎన్‌సీఏలో బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ సాగుతోంది. అతను పూర్తి లయ అందుకున్న తర్వాతే బీసీసీఐకి సమాచారం అందించి ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ సిరీస్‌ను బుమ్రా ఫిట్‌నెస్, ఫామ్‌ను పరీక్షించడానికి ఒక వేదికగా భావించారు. తొలి టీ20లో బుమ్రా మంచి మార్కులతో పాసయ్యాడు. ఇక మిగతా మ్యాచ్‌ల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.

జహీర్ పాత్ర పోషించాలి

సొంతగడ్డపై అక్టోబరు 5న మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. రెండు వన్డే ప్రపంచకప్‌లు, నాలుగు టీ20 ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు రిక్తహస్తమే మిగిలింది. ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని సాధించినా ప్రపంచకప్ గెలిస్తేనే విలువ. ఈసారి సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌ను అయినా గెలవాలని భారత జట్టు ఆశిస్తోంది. అభిమానుల అంచనాల గురించైతే చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ మధ్య బౌలింగ్ బాగా బలహీనపడటం భారత్‌ను కలవరపెడుతోంది. సిరాజ్ మినహా నమ్మదగ్గ పేసర్ కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో బుమ్రా పునరాగమనాన్ని భారత్ బలంగా కోరుకుంటోంది. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించి లయ అందుకుంటే బౌలింగ్ విభాగం ఆటోమేటిగ్గా బలోపేతమవుతుంది. 2011లో జహీర్ ఖాన్ ఎలా అయితే పేస్ విభాగాన్ని ముందుండి నడిపించి ప్రపంచకప్ విజయంలో కీలకంగా మారాడో.. బుమ్రా కూడా అలాంటి పాత్రనే పోషించగలడని భారత్ ఆశిస్తోంది. మరి జస్‌ప్రీత్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమేర నిలబెడతాడో చూడాలి.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని