Jemimah - Harmanpreet: ఆసీస్‌పై శతకాల మోత.. చరిత్రలో నిలిచే ఇన్నింగ్స్‌లు!

Eenadu icon
By Sports News Team Updated : 31 Oct 2025 10:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

బలవంతుడిని బలంతోనే కాదు.. బుద్ధితోనూ కొడితేనే విజయం వరిస్తుంది. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ సరిగ్గా అదే చేసింది. ఒక్కో పరుగు జోడిస్తూ గెలుపు రుచి చూసింది. ఆస్ట్రేలియాను సెమీస్‌లో ఓడించి ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. అప్పుడు హర్మన్‌ ప్రీత్‌ కౌర్ ఆ బాధ్యత తీసుకోగా.. ఈసారి జెమీమా రోడ్రిగ్స్‌ చివరివరకూ ఉండి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ రెండు ఇన్నింగ్స్‌లు చరిత్రను సృష్టించినవే. 

అప్పుడు అలా..

  • అది 2017 వన్డే ప్రపంచ కప్‌. భారత జట్టుకు సీనియర్‌ హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్‌. ఆమె సారథి. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్ (Harmanpreet Kaur) కూడా ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన క్రికెటర్. ఇక స్మృతి మంధాన, దీప్తి శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి నాలుగేళ్లు కూడా కాలేదు. కానీ, ఆ టోర్నీలో భారత్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. మూడో స్థానంతో సెమీస్‌కు చేరుకుంది. అక్కడ ఆస్ట్రేలియా ఎదురైంది.
  • ఓపెనర్లు స్మృతి మంధాన, పూనమ్ రౌత్ త్వరగానే పెవిలియన్‌కు చేరారు. సారథి మిథాలీ భారీ ఇన్నింగ్స్‌ ఆడలేదు. అప్పుడు క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హర్మన్‌ (115 బంతుల్లో 171*) ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా విరుచుకుపడింది. హరికేన్‌ కపిల్‌దేవ్‌లా విజృంభించింది. దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తిలతో కలిసి మంచి భాగస్వామ్యాలను నమోదు చేసి భారత్‌కు అద్భుత స్కోరును అందించింది.
  • తొలి 25 ఓవర్ల ఆటను చూసిన వారెవరూ భారత్ 281 పరుగులు చేస్తుందని ఊహించి ఉండరు. అయితే, మ్యాచ్‌ 50 ఓవర్లు కాదు సుమా.. 42 ఓవర్ల ఆటే. వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించారు. ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయంటే ఆ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
  • అంటే, ఆఖరి 17 ఓవర్లలో భారత్ 180 పరుగులు చేసిందంటే దానికి కారణం హర్మన్‌. క్రికెట్ పుస్తకంలోని అన్ని షాట్లను ప్రయోగించింది. లాంగాఫ్‌ మీదుగా బౌండరీని దాటించడం ఆమెకెంతో ఇష్టం. మైదానం నలువైపులా షాట్లతో అలరించింది. ఇక బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్ ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. 

ఇప్పుడు జెమీమాతో కలిసి..

2025.. సేమ్‌ ప్రత్యర్థి. ఈసారి అజేయంగా సెమీస్‌కు చేరుకున్న ఆసీస్‌ను ఓడించడం కష్టమని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు కూడా అదే అనుకొన్నారు. స్కోరు బోర్డుపై 339 పరుగుల లక్ష్యం ఉందనగానే.. కొంతమంది టీవీలు కట్టేసిన వారూ లేకపోలేదేమో. ఓపెనర్లు 60 పరుగుల్లోపే పెవిలియన్‌కు చేరారు. అప్పుడు కూడా ఇంకొందరు తమ సెటప్ బాక్స్‌లను ఆపేసి ఉంటారు. కానీ, జెమీమా రోడ్రిగ్స్‌ - హర్మన్‌ ప్రీత్ కౌర్ జోడీ ఒక్కో పరుగును జోడిస్తూ వెళ్లారు. దాదాపు 156 బంతుల్లో 167 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) కాస్త డల్‌ అయినప్పుడు హర్మన్‌ దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలోనే 89 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరింది. కానీ, చివరివరకూ పట్టుదల ప్రదర్శించిన జెమీమా (127*) మాత్రం వికెట్ ఇవ్వను.. విజయం వదలను అన్నట్లుగా ఆడింది. మధ్యలో మూడుసార్లు జీవదానం లభించడంతో సద్వినియోగం చేసుకుంది. ఆమె ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్‌ లేకపోవడం గమనార్హం. మొత్తం 14 ఫోర్లను బాదిన జెమీమా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. మ్యాచ్‌ అనంతరం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న తీరు ప్రతిఒక్కరినీ కదిలించింది. 

ఆస్ట్రేలియా బలమైన టీమ్‌ మాత్రమే కాదు.. నాకౌట్‌లో తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దానికి ఉదాహరణ ప్రస్తుతం వన్డే వరల్డ్‌ కప్‌. బంతిని ఏమాత్రం వదలకూడదనే పట్టుదల చూసి మిగతా టీమ్‌లు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, కీలక సమయాల్లో క్యాచ్‌లు డ్రాప్‌ చేయడంతో ఓటమి తప్పలేదు. దానిని సద్వినియోగం చేసుకున్న భారత్‌ అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

- ఇంటర్నెట్ డెస్క్‌


Tags :
Published : 31 Oct 2025 09:49 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు