Womens World Cup: ఇంకా కలలోనే ఉన్నామా: జెమీమా-మంధాన కప్‌ ఫొటోలు వైరల్‌

Eenadu icon
By Sports News Team Updated : 03 Nov 2025 10:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్: దేశాన్ని సంబరాల్లో ముంచెత్తుతూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. దేశానికి కప్ అందించిన ఆనందంలో టీమిండియా మునిగితేలుతోంది. కప్‌ (World Cup Trophy)ను పక్కనపెట్టుకొని అమ్మాయిలు కలలు కంటున్నారు. మాటల్లో వర్ణించలేని వారి సంతోషాన్ని ఫొటోల రూపంలో సోషల్ మీడియా వేదికగా వ్యక్తంచేశారు.

ఆదివారం రాత్రి ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియంలో హర్మన్ సేన దక్షిణాఫ్రికాను చిత్తుచేసి ఛాంపియన్‌గా అవతరించింది. దక్షిణాఫ్రికాను 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ చేసి, వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. చరిత్ర సృష్టిస్తూ సొంతం చేసుకున్న ట్రోఫీని అమ్మాయిల జట్టు వదల్లేకపోతోంది. తాము బస చేసిన హోటల్‌లో బెడ్‌పై పక్కనే కప్‌ను పెట్టుకొని దిగిన ఫొటోలను జెమీమా రోడ్రిగ్స్‌ షేర్ చేసింది. తనకు, భారత వైస్‌ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు మధ్యలో కప్‌ ఉన్న చిత్రాన్ని షేర్ చేసి.. ‘గుడ్‌ మార్నింగ్ వరల్డ్‌’ అని రాసుకొచ్చింది. మరో చిత్రంలో వారితోపాటు రాధాయాదవ్, అరుంధతి రెడ్డి కూడా ఉన్నారు. ‘మేం ఇప్పటికీ కలలోనే ఉన్నామా’ అని అంటూ రోడ్రిగ్స్‌ పట్టలేని ఆనందాన్ని వ్యక్తంచేసింది. 

వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఆసీస్‌పై భారత్‌ అద్భుత విజయం సాధించడంలో జెమీమాది కీలక పాత్ర. ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ మరో 9 బంతులు మిగిలిఉండగానే విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్‌ 127 పరుగులతో అజేయంగా నిలిచింది. ఫైనల్లో 24 పరుగులు చేసింది. ఆమె ప్రపంచకప్‌ విజయంపై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి బంతికి ప్రాణంపెట్టి ఆడాం. తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు. కానీ మేం మాత్రం వంద శాతం పోరాడాం. ఇలాంటి ఒక మ్యాజిక్ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు’’ అని వెల్లడించింది.


Tags :
Published : 03 Nov 2025 10:18 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు