Kieron Pollard: హార్దిక్‌ను గేలిచేసింది చాలు.. అలాంటి మాటలతో విసిగిపోయా: కీరన్‌ పొలార్డ్‌

ముంబయి మ్యాచ్‌ ఓడినా.. గెలిచినా హార్దిక్‌ పాండ్యపై ట్రోలింగ్‌ మాత్రం ఆగడం లేదు. తాజాగా చెన్నై చేతిలో పరాజయం తర్వాత అది మరికాస్త ఎక్కువైంది.

Updated : 15 Apr 2024 12:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నై చేతిలో ముంబయి ఓడిపోవడంతో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్‌ పాండ్యపై (Hardik Pandya) మళ్లీ విమర్శలు వెల్లువెత్తాయి. అతడి కెప్టెన్సీని ట్రోల్‌ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ సాధించినా.. మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం కరవైంది. అంతకుముందు బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేదని పాండ్యను విమర్శించారు. ఇలాంటి పరిణామాలపై ముంబయి బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి సమయంలో పాండ్యకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపాడు. 

‘‘ఇలాంటి విమర్శలు, కామెంట్లు పాండ్య ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపిస్తాయని అనుకోవడం లేదు. అతడు ప్రతి చిన్న విషయానికి కుంగిపోయే రకం కాదు. జట్టుపరంగా మేమంతా అతడికి అండగా నిలుస్తాం. క్రికెట్‌లో టీమ్‌గా రాణిస్తేనే విజయావకాశాలు మెరుగుపడతాయి. వ్యక్తిగతంగా ఎవరు ఎంత కష్ట పడుతున్నారనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. పాండ్య తన నైపుణ్యాలను పెంచుకొనేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. ఇప్పుడు హార్దిక్‌పై వస్తున్న విమర్శలను చూసి నేను విసిగిపోయా. వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇప్పుడు ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. మరికొన్ని వారాల్లో టీమ్‌ఇండియాకు ఆడతాడు. అప్పుడు బాగా ఆడాలని వారే కోరుకుంటారు. ప్రతిసారి ప్రోత్సహించేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ, చిన్న విషయాలపై దెప్పి పొడవడం మంచిది కాదు. భారత జట్టులోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడు. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో రాణించగల సత్తా ఉంది. తప్పకుండా అతడు జట్టుకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అనడంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో అతడికి మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలుస్తారనే నమ్మకంతో ఉన్నా’’ అని పొలార్డ్ వ్యాఖ్యానించాడు. 

పాండ్య 100 శాతం ఫిట్‌గా లేడు: గిల్‌క్రిస్ట్‌

‘‘హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీలో సానుకూలాంశం ఏంటంటే.. సారథిగా జట్టును ముందుండి నడిపించాలి. అందుకోసం క్లిష్టమైన సమయాల్లో బౌలింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉంటానని అతడు నిరూపించాడు. అయితే, అతడి ఫిట్‌నెస్‌ను చూస్తుంటే వందశాతం లేదనిపిస్తోంది. బౌలింగ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నట్లున్నాడు. బంతిపై నియంత్రణ కోల్పోతున్నాడు’’ అని గిల్ క్రిస్ట్ తెలిపాడు. 

పాండ్య నవ్వు వెనుక.. : పీటర్సెన్ 

‘‘హార్దిక్‌ తన బౌలర్లను వినియోగించుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. వ్యక్తిగతంగానూ ప్రదర్శన ఉత్తమంగా లేదు. మరోవైపు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నాడు. ఇవి అతడిపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. టాస్‌కు ముందు పాండ్య నవ్వడం కూడా బాగోలేదు. చాలా సంతోషంగా ఉన్నానని అందరికీ చూపించుకొనే ప్రయత్నంలా ఉంది. అతడేమీ హ్యాపీగా లేడు. ఆ తర్వాత మ్యాచ్‌లో ధోనీ వరుసగా సిక్స్‌లు కొట్టడంతో పాండ్య మరింత హేళనకు గురయ్యాడు. భారత ప్లేయర్‌గా అతడికి ఇలాంటివి జరగడం సరికాదు’’ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సెన్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని