Sunil Narine: ఐపీఎల్‌ చరిత్రలో తొలి ఆటగాడిగా సునీల్ నరైన్ ఘనత

ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసిన కోల్‌కతా విజేతగా నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సునీల్ నరైన్ ఆకట్టుకున్నాడు.

Published : 27 May 2024 14:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఛాంపియన్‌గా నిలవడంలో సునీల్ నరైన్ (Sunil Narine) కీలక పాత్ర పోషించాడు. బ్యాటర్‌గా 488 పరుగులు.. బౌలర్‌గా 17 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఓపెనర్‌గా దూకుడైన ఆటతీరుతో నరైన్ ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. అత్యుత్తమ స్ట్రైక్‌రేట్‌తో (180.74) పరుగులు రాబట్టాడు. ఫైనల్‌లోనూ 4 ఓవర్ల కోటాలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా (MVP) నిలిచాడు. ఇదే సమయంలో ఐపీఎల్‌ చరిత్రలోనే మరో ఘనతను సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. మూడు సీజన్లలో ఈ అవార్డును అందుకున్న మొదటి ఆటగాడు నరైన్ కావడం విశేషం. 

2012లో.. 

సునీల్ నరైన్ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన సీజన్‌ ఇదే. 2012 సీజన్‌లో 15 మ్యాచుల్లో 24 వికెట్లు తీశాడు. మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థులను హడలెత్తించాడు. దీంతో ఆ ఎడిషన్ ‘అత్యంత విలువైన ఆటగాడు’ (MVP) అవార్డును సొంతం చేసుకున్నాడు. 

2018లో..

తొలిసారి ఎంవీపీ అవార్డును (2012లో) దక్కించుకున్నప్పుడు నరైన్ కేవలం బౌలింగ్‌కే పరిమితమయ్యాడు. అదే 2018 నాటికి బ్యాటింగ్‌లోనూ విలువైన పరుగులు చేసిన అతడు.. బౌలింగ్‌లోనూ రాణించి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ఇచ్చాడు. మొత్తం 357 పరుగులు చేసిన అతడు 17 వికెట్లను పడగొట్టాడు.

గంభీర్‌ను పైకి ఎత్తిన నరైన్

మ్యాచ్‌లో ఓడినా.. గెలిచినా ఒకటే భావోద్వేగం ప్రదర్శించే ఆటగాడు సునీల్ నరైన్. ఫైనల్‌ జరిగిన రోజే అతడి బర్త్‌డే (మే 26న). కేకేఆర్‌ సరైన గిఫ్ట్‌తో నరైన్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. తనలోని ఆల్‌రౌండ్‌ సత్తాను మరోసారి అందరికీ పరిచయం చేయడంలో మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) పాత్ర ఉందని ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం గంభీర్‌ను ఎత్తుకొని తన ఆనందాన్ని పంచుకున్నాడు. గంభీర్‌ కూడా నరైన్‌ను పైకి ఎత్తడం విశేషం. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని