ఐపీఎల్‌ 2024: పోరాడి ఓడిన హైదరాబాద్‌.. కోల్‌కతా బోణీ

ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా బోణీ చేసింది. హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 4 పరుగుల తేడాతో నెగ్గింది. 

Updated : 24 Mar 2024 00:11 IST

కోల్‌కతా: ఐపీఎల్‌ 2024లో భాగంగా తన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ పోరాడి ఓడింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 పరుగుల తేడాతో నెగ్గింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. 145 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశలో సాగుతున్న తరుణంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (63: 29 బంతుల్లో 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (32: 21 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌), అభిషేక్‌ శర్మ (32: 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశారు.  కోల్‌కతా బౌలర్లలో హర్షిత్‌  రాణా మూడు, రస్సెల్‌ 2 వికెట్లు తీయగా, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

మలుపుతిప్పిన క్లాసెన్‌.. ఆఖరి ఓవర్లో హైడ్రామా

209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ ఓపెనర్లు తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలో 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ తరుణంలో తొలివికెట్‌గా హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ ఔటయ్యాడు. 71 పరుగుల వద్ద మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన రాహుల్‌ త్రిపాఠి (20), మార్‌క్రమ్‌ (18) జోడి ఇన్నింగ్స్‌ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయితే 107 పరుగుల వద్ద మార్‌క్రమ్‌, 111 పరుగుల వద్ద త్రిపాఠి స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దీంతో హైదరాబాద్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో అబ్దుల్‌ సమద్‌ (15), షాబాజ్‌ అహ్మద్‌ సహకారంతో సహకారంతో క్లాసెన్‌ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో చివరి రెండు ఓవర్లలో హైదరాబాద్‌ లక్ష్యం 39 పరుగులుగా ఉంది. 19 ఓవర్లో క్లాసెన్‌ మూడు, షాబాజ్‌ ఒక సిక్స్‌ కొట్టడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో విజయ సమీకరణం 13 పరుగుల కాగా, తొలి బంతికి క్లాసెన్‌ సిక్స్‌ కొట్టడంతో హైదరాబాద్‌ విజయం ఖాయమనుకున్నారు. తర్వాత బంతికి సింగిల్‌ వచ్చింది. మూడో బంతికి షాబాజ్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ మరింత తారా స్థాయికి వెళ్లింది. తర్వాత వచ్చిన జాన్‌సెన్‌ సింగిల్‌ తీసి క్లాసెన్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. అయితే భారీ షాట్‌ ఆడే క్రమంలో క్లాసెన్‌ ఔటయ్యాడు. ఇక చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా కమిన్స్‌ ఒక్క పరుగు చేయలేకపోయాడు. దీంతో మ్యాచ్‌ కోల్‌కతా వశమైంది.        

రస్సెల్‌ విశ్వరూపం..  

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. తొలుత సాల్ట్‌ (54: 40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా, చివర్లలో రస్సెల్‌ (64*: 25 బంతుల్లో 7 సిక్స్‌లు, 3 ఫోర్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. రమణ్‌దీప్‌ సింగ్‌ (35), రింకూ సింగ్‌ (23) విలువైన పరుగులు చేశారు. కోల్‌కతా చివరి ఐదు ఓవర్లలో 103 పరుగులు రాబట్టడం విశేషం. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ మూడు వికెట్లు పడగొట్టగా, మార్కండే రెండు వికెట్లు తీశాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని