Kolkata vs Hyderabad: హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన కోల్‌కతా

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కోల్‌కతా ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఆజట్టు 8 వికెట్ల తేడాతో నెగ్గింది.  

Updated : 21 May 2024 23:48 IST

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-17 సీజన్‌లో తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతాను ఓడించి నేరుగా ఫైనల్‌కు వెళ్దామనుకున్న సన్‌రైజర్స్‌కు గట్టి షాక్ తగిలింది. లీగ్ దశలో భారీ స్కోర్లతో రెచ్చిపోయిన హైదరాబాద్‌ బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో తేలిపోవడంతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌పై కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత కేకేఆర్ బౌలర్ల ధాటికి హైదరాబాద్‌ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్. 160 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా రెండు వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్ (23), సునీల్ నరైన్ (21) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. వెంకటేశ్‌ అయ్యర్ (51*; 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (58*; 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ శతకాలు బాదారు. ట్రావిస్‌ హెడ్ బౌలింగ్‌లో శ్రేయస్ వరుసగా 6, 4, 6, 6 బాదేసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోవడంతో జట్టుకు విజయాన్ని అందించాడు. బుధవారం రాజస్థాన్‌, బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌ జరగనుంది. ఈ పోరులో విజేతగా నిలిచిన జట్టుతో శుక్రవారం క్వాలిఫయర్‌-2లో హైదరాబాద్‌ తలపడనుంది.  

ఆరంభం నుంచే వరుస షాక్‌లు.. చివర్లో కమిన్స్ మెరుపులు

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు ఆరంభం నుంచే వరుస షాక్‌లు తగిలాయి. జట్టు పరుగుల ఖాతా తెరవకుండానే ట్రావిస్ (0) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో రెండో బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ శర్మ (3)ను వైభవ్‌ అరోరా వెనక్కి పంపాడు. కాసేపటికే  నితీశ్‌ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0)లను స్టార్క్ ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. దీంతో 39/4 స్కోరుతో సన్‌రైజర్స్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో హెన్రిచ్‌ క్లాసెన్ (32; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి త్రిపాఠి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ దూకుడుగా ఆడటంతో 10 ఓవర్లకు 92/4 స్కోరుతో నిలిచింది. దూకుడుగా ఆడుతున్న క్లాసెన్‌ను వరుణ్‌ చక్రవర్తి ఔట్‌ చేయడంతో సన్‌రైజర్స్ మళ్లీ కష్టాల్లో పడింది. క్లాసెన్.. రింకు సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కొద్దిసేపటికే అబ్దుల్ సమద్ (16)తో సమన్వయలోపం జరగడంతో త్రిపాఠి రనౌటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సన్వీర్ సింగ్‌ డకౌట్‌ అయ్యాడు. నరైన్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సమద్, భువనేశ్వర్‌ వరుస ఓవర్లలో ఔటయ్యారు. 126 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన దశలో కమిన్స్ (30; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో హైదరాబాద్‌ పోరాడే స్కోరు సాధించగలిగింది. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని