Kuldeep Yadav: డీఆర్‌ఎస్‌పై అప్పుడే రిషభ్‌ పంత్‌ మాట వింటా: కుల్‌దీప్‌

గాయం నుంచి కోలుకుని వచ్చిన కుల్‌దీప్‌ తన సత్తా చాటాడు. లఖ్‌నవూపై మూడు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును అందుకున్నాడు.

Updated : 13 Apr 2024 13:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: లఖ్‌నవూపై దిల్లీ విజయం సాధించడంలో కుల్‌దీప్‌ యాదవ్ కీలక పాత్ర (3/20) పోషించాడు. డేంజరస్ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్, స్టాయినిస్‌, నికోలస్‌ పూరన్‌ను ఔట్ చేశాడు. దిల్లీ తలపడిన ఆరు మ్యాచుల్లో మూడింట్లోనే కుల్‌దీప్‌ (Kuldeep Yadav) ఆడాడు. ఇప్పటి వరకు ఆరు వికెట్లు తీశాడు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చాక అదరగొట్టాడు. మ్యాచ్‌ అనంతరం తన ఫిట్‌నెస్‌, బౌలింగ్‌పై స్పందించాడు.

‘‘తొలి మ్యాచ్‌లో గాయపడ్డా. ఆ తర్వాత జట్టు మిడిల్‌ ఓవర్లలో ఇబ్బంది పడటం చూశా. నేను మళ్లీ ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి రావడానికి ప్రధాన కారణం ప్యాట్రిక్‌. రన్‌రేట్‌ నియంత్రించడానికి వికెట్లు పడగొట్టడం అత్యవసరం. నా ప్రణాళిక ప్రకారం బౌలింగ్‌ చేశా. నికోలస్‌ పూరన్‌కు గతంలోనూ బౌలింగ్ వేసిన అనుభవం ఉంది. ఫస్ట్ బంతికే అతడిని బౌల్డ్‌ చేయడం మరిచిపోలేను. నా నైపుణ్యాలపై నాకు నమ్మకం ఉంది. డీఆర్‌ఎస్ కాల్‌ విషయంలో 50/50 ఛాన్స్‌ ఉంటే తీసుకునేందుకు మొగ్గు చూపుతా. 40/60 ఉంటే మాత్రం రిషభ్‌ పంత్‌ చెప్పింది వింటా. బౌలర్‌గా అవసరమైనప్పుడు డీఆర్‌ఎస్‌ తీసుకోవాలి. రెండు రివ్వ్యూల్లో ఒకటి నాకోసం ఎప్పుడూ ఉంటుంది’’ అని కుల్‌దీప్‌ తెలిపాడు. కేఎల్ రాహుల్ వికెట్‌ ఇలా డీఆర్‌ఎస్‌ తీసుకోవడంతోనే దక్కింది.

ఎక్కువగా కంగారు పడలేదు: జేక్ ఫ్రేజర్

తొలి మ్యాచ్‌లోనే జేక్‌ ఫ్రేజర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తన ఇన్నింగ్స్‌పై మాట్లాడుతూ.. ‘‘గత ఐదు మ్యాచుల్లో బెంచ్‌పైనే ఉన్నా. ఎప్పుడు అవకాశం వస్తుందా? అని ఎదురుచూశా. బ్యాటింగ్‌ చేసేటప్పుడు మరీ ఎక్కువగా కంగారు పడలేదు. బంతి బ్యాట్‌ మిడిల్‌ అయ్యేలా మాత్రమే చూసుకున్నా. గత ఏడాదిగా నా శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కింది. ఆఫ్‌సైడ్‌ హిట్టింగ్‌ చేయడానికి ఇష్టపడతా. ఐపీఎల్ గురించి చాలా విన్నా. ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవించా. భారత్‌ రావడం అద్భుతంగా అనిపిస్తోంది’’ అని ఫ్రేజర్‌ తెలిపాడు.

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • ఐపీఎల్‌లో దిల్లీ తరఫున అరంగేట్రం చేసిన బ్యాటర్లలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ జేక్ ఫ్రేజర్. ఈ మ్యాచ్‌లో అతడు 55 పరుగులు చేశాడు. అంతకుముందు గౌతమ్‌ గంభీర్ (2008లో) రాజస్థాన్‌పై 58 రన్స్ చేశాడు.
  • ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌ల్లో వన్‌డౌన్‌లో వచ్చి (మూడో స్థానం) ఎక్కవ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌ కూడా ఫ్రేజరే. 2008లో చెన్నై ఆటగాడు మైక్‌ హస్సీ (116) పంజాబ్‌పై శతకం చేశాడు. 
  • 2023 నుంచి లక్ష్య ఛేదనలో దిల్లీకిది మూడో విజయమే. మొత్తం 13 మ్యాచుల్లో పదింట్లో ఓటమిపాలైంది.
  • ఐపీఎల్‌లో లఖ్‌నవూపై 160+ స్కోరు టార్గెట్‌ను ఛేదించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అన్నింట్లోనూ లఖ్‌నవూనే గెలిచేది. ఇప్పుడు దిల్లీ ఆ రికార్డును చెరిపేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని