Virat Kohli: కష్టకాలంలో విరాట్‌కు అదృష్టం కలిసి రాలేదు.. : గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫామ్‌ లేమితో గతంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడికి కొన్ని విషయాల్లో అదృష్టం కూడా కలిసి రాలేదని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) అన్నాడు.

Published : 06 Jun 2023 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(WTC Final) కోసం టీమ్‌ఇండియా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారైన టైటిల్‌ గెలిచి.. భారత్‌కు ఐసీసీ ట్రోఫీ కరవును తీర్చాలని ఆశిస్తున్నారు. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మహాసమరం(India vs Australia)లో పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఆటపైనే అందరి దృష్టి నెలకొంది. మార్చిలో ఆస్ట్రేలియాపై కోహ్లీ తన 29వ సెంచరీ బాది.. టెస్టుల్లో శతకం కోసం 1205 రోజుల నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్‌పై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశాడు.

2019 నుంచి ఫామ్‌ లేమితో తీవ్ర ఇబ్బందులు పడ్డ కోహ్లీ(Virat Kohli).. 2022 ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీతో తిరిగి గాడిలో పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. టీ20 వరల్డ్‌కప్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు. కోహ్లీ ప్రదర్శనను మెచ్చిన గావస్కర్‌.. కష్టకాలంలో అతడికి అదృష్టం కలిసిరాలేదని పేర్కొన్నాడు.

‘ప్రతి ఆటగాడి విషయంలో బ్యాడ్‌ ఫామ్‌ అనేది సాధారణమే. ఆ తర్వాత కోహ్లీ మంచి ఇన్నింగ్స్‌లు ఆడటం ప్రారంభించాడు. ఇక్కడో విషయం గమనిస్తే.. అతడు ఫామ్‌ అందుకున్న తొలినాళ్లలో కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతులు.. స్టంప్‌ను తాకలేదు. క్యాచ్‌లు డ్రాపయ్యాయి లేదా ఫీల్డర్‌కు కాస్త దూరంలో పడ్డాయి. ఇలాంటి చిన్నపాటి లక్‌.. ప్రతి ఆటగాడికి అవసరమే. అయితే.. కష్టకాలంలో అతడికి లభించని ఈ అదృష్టాన్ని.. ఇప్పుడతడు తిరిగి పొందాడు’ అని గావస్కర్‌ వివరించాడు.

విరాట్‌ అద్భుతమైన టెంపర్‌మెంట్‌ కలిగి ఉన్నాడని, అతడి పరుగుల దాహం తీరనిదని ప్రశంసించాడు. టెక్నికల్‌గా కూడా ఎంతో బాగా ఆడతున్నాడని.. అతడు తిరిగి ఫామ్‌లోకి రావడం తనను ఆశ్చర్యానికి గురిచేయలేదని సన్నీ పేర్కొన్నాడు.

ఇక ఆస్ట్రేలియాతో టెస్టులు అంటే.. విరాట్‌ అదరగొట్టేస్తాడు. ఇప్పటి వరకూ ఆసీస్‌పై 24 టెస్టులు ఆడిన కోహ్లీ.. 48.26 సరాసరితో మొత్తం 1979 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు, ఐదు అర్ద శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 186. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి.. కోహ్లీ మొత్తం 92 మ్యాచ్‌లు  ఆడగా.. 50.97 సగటుతో 4,945 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 24 అర్ద శతకాలు ఉన్నాయి. అందుకే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఈ పరుగుల వీరుడు కీలకంగా మారుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని