MS Dhoni: ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్‌.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్‌నవూ స్టార్‌ వైఫ్

సొంత మైదానంలో లఖ్‌నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్‌ వీరవిహారం.

Updated : 20 Apr 2024 10:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ బదులు ధోనీ ప్రీమియర్‌ లీగ్‌ అని మార్చాలేమో.. ఎందుకంటే ‘కెప్టెన్ కూల్’ కోసం ప్రతి స్టేడియం పసుపుమయంగా మారిపోతోంది. తాజాగా ఏకనా స్టేడియం వేదికగా లఖ్‌నవూతో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోయినా అభిమానులు మాత్రం పెద్దగా నిరాశకు గురి కాలేదు. దానికి కారణం ఎంఎస్ ధోనీ (MS Dhoni). చివర్లో బ్యాటింగ్‌కు వస్తున్న అతడు మరోసారి ఫ్యాన్స్‌ను అలరించాడు. అతడు క్రీజ్‌లోకి వస్తుంటే మైదానమంతా హోరెత్తిపోయింది. అంతా ధోనీ నామస్మరణే. ఆ క్రేజ్‌ను ప్రత్యక్షంగా చూసిన లఖ్‌నవూ స్టార్‌ ఆటగాడు క్వింటన్ డికాక్ భార్య సాషా ఆశ్చర్యానికి గురైంది. తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర పోస్టు పెట్టింది. 

‘‘ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు.. నా స్మార్ట్‌ వాచ్‌లో నమోదైన దృశ్యమిది. హోరెత్తిన నినాదాలతో శబ్దాల స్థాయి 95 డెసిబల్స్‌కు చేరింది. ఇలాగే ఓ పది నిమిషాలు కొనసాగితే తాత్కాలికంగా వినికిడి కోల్పోతాం’’ అని సాషా పేర్కొంది. దాంతోపాటు ఆ ఫొటోను షేర్ చేసింది. ధోనీ మైదానంలోకి వస్తుంటే.. ఈ శబ్దస్థాయి ఒక్కోసారి 125కుపైగా నమోదవుతున్నట్లు టీవీ తెరలపై కనిపిస్తోంది. లఖ్‌నవూ మ్యాచ్‌లో 18వ ఓవర్‌ చివరి బంతికి ధోనీ క్రీజ్‌లోకి వచ్చాడు. కేవలం 9 బంతుల్లోనే 28 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాబట్టాడు. అతడు దూకుడుగా ఆడటంతో చెన్నై 176/6 స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలోనే 180 పరుగులు చేసి విజయం సాధించింది.

ధోనీ ఐపీఎల్‌ 20వ ఓవర్‌లో ఇప్పటి వరకు 313 బంతులను ఎదుర్కొన్నాడు. మొత్తం 772 పరుగులు చేయడం విశేషం. ఇందులో 53 ఫోర్లు, 65 సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో 16 బంతుల్లోనే 57 రన్స్‌ కొట్టాడు. స్ట్రైక్‌రేట్ 356.25 కావడం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు