T20 World Cup: ఆ బౌండరీ ఇచ్చి ఉంటే.. దక్షిణాఫ్రికా-బంగ్లా మ్యాచ్‌లో DRS వివాదం

T20 World Cup: దక్షిణాఫ్రికా-బంగ్లా మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ నిర్ణయం వివాదాస్పదమైంది. అంపైర్‌ పొరబాటు కారణంగా ఈ మ్యాచ్‌ బంగ్లా నాలుగు పరుగులు కోల్పోయిందని, అదే మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Updated : 11 Jun 2024 12:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024)లో బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్‌ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో  స్వల్ప స్కోరును కాపాడుకున్న సఫారీ జట్టు.. బంగ్లాదేశ్‌పై కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఇందులో (BAN vs SA) ఓ డీఆర్‌ఎస్‌ నిర్ణయం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. దాని కారణంగా బంగ్లా ఓ బౌండరీని కోల్పోగా.. సరిగ్గా ఆ నాలుగు పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాకు విజయం దక్కడం గమనార్హం. అసలేం జరిగిందంటే..

సోమవారం నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా (South Africa) 113 పరుగులే చేయగలిగింది. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ ఒక దశలో బలంగానే కన్పించింది. చివరి నాలుగు ఓవర్లలో ఆ జట్టుకు 27 పరుగులు అవసరమయ్యాయి. 17వ ఓవర్‌లో సఫారీ బౌలర్‌ బార్ట్‌మన్‌ వేసిన రెండో బంతి బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా ప్యాడ్లను తాకి స్టంప్స్‌ వెనుక నుంచి బౌండరీ వెళ్లింది.

సఫారీ జట్టుకు ఎల్బీకి అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో బంగ్లా డీఆర్‌ఎస్‌ (DRS)కు వెళ్లడంతో నాటౌట్‌ అని తేలింది. అయితే, అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నప్పటికీ అప్పటికే ఆ బంతిని డెడ్‌బాల్‌ (Dead Ball)గా పరిగణించడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్‌ (Bangladesh) స్కోరుకు ఆ బౌండరీని కలపలేదు. సరిగ్గా ఇదే నాలుగు పరుగుల తేడాతో ఆ జట్టు ఓడిపోవడంతో ఇప్పుడు ఈ డీఆర్‌ఎస్‌ నిర్ణయం నెట్టింట చర్చనీయాంశమైంది.

దక్షిణాఫ్రికా బతికిపోయింది.. 4 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం

ఐసీసీ రూల్స్‌ ఏం చెబుతున్నాయి..

ఐసీసీ (ICC Rules) రూల్‌బుక్‌లోని 3.7.1 ప్రకారం.. డీఆర్‌ఎస్‌ తర్వాత ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ ఇచ్చిన ఔట్‌.. నాటౌట్‌గా మారినప్పటికీ మొదట తీసుకున్న డెడ్‌బాల్‌ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నాటౌట్‌ అని తేలితే బ్యాటింగ్‌ చేసే జట్టుకు వికెట్‌ మిగులుతుంది కానీ.. ఆ డెలివరీతో వచ్చే పరుగులేమీ వారికి రావు. ఒకవేళ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ నిర్ణయం తీసుకుంటే ఆ పరుగులు లాభిస్తాయి.

ఇక, 3.7.2 ప్రకారం.. ఒరిజినల్‌ నిర్ణయం నాటౌట్‌గా ఉండి.. డీఆర్‌ఎస్‌లో ఔట్‌ అని వస్తే.. అప్పుడు బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు. ఒకవేళ అప్పటికే బ్యాటర్‌ పరుగులు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకోరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు