T20 WC 2024: టీమ్‌ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!

టీ20 ప్రపంచ కప్‌ కోసం టీమ్‌ఇండియాకు ఎంపికైన ఆటగాళ్లు త్వరలోనే అమెరికాలో అడుగు పెట్టనున్నారు. అందరూ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా వెళ్లే అవకాశం ఉంది.

Published : 18 May 2024 16:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ సందడి ముగియగానే మరో మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధం కానుంది. జూన్ 2 నుంచి యూఎస్ఏ - విండీస్‌ వేదికగా టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. ఇప్పటికే అర్హత సాధించిన అన్ని దేశాలు తమ టీమ్‌లను ప్రకటించాయి. భారత్‌ కూడా రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన టీమ్‌ను వెల్లడించింది. యూఎస్ఏ వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు కొంతమందిని ముందే పంపిద్దామని బీసీసీఐ భావించింది. ఐపీఎల్‌లో లీగ్‌ స్టేజ్‌ 19వ తేదీతో ముగుస్తుంది. నాకౌట్‌కు క్వాలిఫై కాని జట్లలోని ఆటగాళ్లు ఎవరైతే భారత జట్టుకు ఎంపికై ఉంటారో వారిని మే 21న పంపించాలని తొలుత మేనేజ్‌మెంట్ భావించింది. అయితే, మళ్లీ తన ప్రణాళికలను మార్చుకుంది.

ఐపీఎల్ 17వ సీజన్‌లో తొలి క్వాలిఫయర్‌ మే 22న, ఎలిమినేటర్‌ మ్యాచ్‌ మే 24న జరుగుతాయి. దీంతో తొలి బ్యాచ్‌ మే 25న అమెరికాకు పయనం కానుందని వార్తలు వస్తున్నాయి. ‘‘కెప్టెన్ రోహిత్, హార్దిక్‌ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్ పటేల్‌తో పాటు కొందరు సహాయక సిబ్బంది మే 25న స్వదేశాన్ని విడిచి అక్కడికి వెళ్లిపోతారు. తొలుత వచ్చే మంగళవారం అనుకున్నప్పటికీ.. కేవలం ఒక్క వార్మప్‌ మ్యాచ్‌ మాత్రమే భారత్‌ ఆడనుంది. అదికూడా బంగ్లాదేశ్‌తో (జూన్ 1) తలపడనుంది. దీంతో మరికొద్ది రోజులు ఇంట్లో గడిపేందుకు అవకాశం కల్పించాం’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 

వారంతా అప్పుడే.. 

మే 26న ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దానికి ఒక్కరోజు ముందే తొలి బ్యాచ్‌ వెళ్తుంది. వారు కాకుండా భారత జట్టుకు ఎంపికైన మిగతా ఆటగాళ్లంతా మే 27న యూఎస్‌ విమానం ఎక్కుతారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తన తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత జూన్ 9న దాయాది దేశం పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడనుంది. జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో టీమ్‌ఇండియా గ్రూప్‌ స్టేజ్‌లో తలపడనుంది. మూడు మ్యాచులను న్యూయార్క్‌లో, ఒక మ్యాచ్‌ ఫ్లోరిడా వేదికగా జరగనుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్, బుమ్రా, సిరాజ్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు