MS Dhoni: దిల్లీపై ధోనీ వీర బాదుడు.. చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌కు బ్రెట్‌లీ విజ్ఞప్తి

చాలా రోజుల తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఎంఎస్ ధోనీ.. దూకుడుగా ఆడటంతో మళ్లీ ‘ఫినిషర్‌’ను గుర్తుకుతెచ్చాడు. 

Updated : 03 Apr 2024 15:14 IST

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు సంవత్సరం తర్వాత ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ పవర్‌ను చూశాం. వైజాగ్‌ వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. చెన్నై ఓడిపోయినప్పటికీ ధోనీ ఆట అభిమానులను అలరించింది. కేవలం వికెట్‌ కీపింగ్‌కే పరిమితమై వస్తున్న ధోనీ తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్‌ చేయలేదు. ఈక్రమంలో ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఆసీస్‌ మాజీ క్రికెటర్లు బ్రెట్‌ లీ, షేన్ వాట్సన్ కీలక సూచనలు చేశారు. గురువారం ఉప్పల్‌ వేదికగా హైదరాబాద్‌తో చెన్నై తలపడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.

‘‘దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆటను చూశాక.. దూకుడు ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. బ్యాటింగ్‌లో మరింత ఆటను చూడాలని ఉంది. అందుకే, అతడు ఆర్డర్‌లో ముందుకురావాలి. ఇప్పటికీ ధోనీ బ్రెయిన్‌ షార్ప్‌గా పని చేస్తోంది. కాబట్టి, చెన్నై ఫ్రాంచైజీని ముందుకు తీసుకురావాలి. కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఇదే విజ్ఞప్తి చేస్తున్నా’’ అని బ్రెట్‌లీ వ్యాఖ్యానించాడు. ‘‘అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ధోనీ నుంచి అభిమానులుగా మేం కోరుకున్నదిదే. తీవ్ర ఒత్తిడిలోనూ బౌలర్లపై దాడి చేయడంతో అతని సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది. అతడి కెరీర్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌లెన్నో చూశాం. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కొట్టిన ప్రతి షాట్ సూపర్‌’’ అని షేన్ వాట్సన్ తెలిపాడు. 

హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముస్తఫిజర్‌ దూరం

చెన్నై జట్టుకు చిన్న షాక్‌. మంచి ఫామ్‌లో ఉన్న పేసర్‌ ముస్తఫిజర్‌ రహ్మాన్‌ ఉప్పల్‌ వేదికగా గురువారం జరగనున్న మ్యాచ్‌కు దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతడు స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు. చెన్నై తరఫున తొలిసారి ఐపీఎల్‌ సీజన్‌లో ఆడుతున్న అతడు మూడు మ్యాచుల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతడి వద్దే పర్పుల్‌ క్యాప్‌ ఉంది. వచ్చే టీ20 ప్రపంచ కప్‌ యూఎస్‌ఏ - విండీస్‌ వేదికలుగా జరగనున్న విషయం తెలిసిందే. దీంతో యూఎస్‌ఏ వీసా పనుల నిమిత్తం ముస్తఫిజర్ బంగ్లాదేశ్‌కు వెళ్లినట్లు సమాచారం. పాస్‌పోర్టు, వీసా సమస్య పరిష్కారం కాగానే మళ్లీ చెన్నై జట్టుతోపాటు చేరే అవకాశముంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని