Pakistan: ‘ఆ ప్లేయర్స్‌ క్యాన్సర్‌ లాంటోళ్లు’.. వారుంటే పాక్‌ గెలవదు: మాజీ చీఫ్‌ సెలెక్టర్

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం పాకిస్థాన్ మాజీ చీఫ్ సెలెక్టర్ మహ్మద్‌ వసీం తమ జట్టులోని ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 12 Jun 2024 11:24 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2024లో ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. 120 పరుగుల లక్ష్య ఛేదనలో తొలుత గెలిచేలా కనిపించిన పాక్‌.. భారత బౌలర్లు పుంజుకోవడంతో వేగంగా పరుగులు చేయలేక వెనకబడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమి అనంతరం పాకిస్థాన్ మాజీ చీఫ్ సెలెక్టర్ మహ్మద్‌ వసీం తమ జట్టులోని ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్న పాక్‌ బౌలింగ్ ఆల్‌రౌండర్, స్పిన్నర్ ఇమాద్‌ వసీం మోకాలి గాయాన్ని దాచిపెడుతున్నాడని మాజీ చీఫ్ సెలెక్టర్ ఆరోపించాడు. పక్కటెముక గాయం కారణంగా అమెరికాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు ఇమాద్‌ వసీం పేర్కొన్నాడు. అయితే ఇది ఫేక్‌ అని, అతడు కొన్నాళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడని మహ్మద్‌ వసీం వ్యాఖ్యానించాడు. 

‘‘పక్కటెముకకు గాయం కారణంగా అమెరికాతో మ్యాచ్‌లో ఇమాద్ వసీం ఆడలేదని వార్తలొచ్చాయి. కానీ, అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. గత కొన్నేళ్లుగా ఈ విషయాన్ని దాచిపెడుతున్నాడు. ఆజం ఖాన్ ఫిట్‌గా లేడు.  గత ఐదేళ్లుగా ఇదే సమస్యతో బాధ పడుతున్నాడు. ఈ కారణంగానే అతడిని జట్టు నుంచి తప్పించారు. నేను కూడా నా పదవీకాలంలో ఇమాద్‌ వసీంను తొలగించాను. దీంతో అతడు ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టాడు. ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించను గానీ, కొంతమంది ప్లేయర్స్‌ జట్టును క్యాన్సర్‌లా పట్టిపీడిస్తున్నారని పాక్‌ కోచ్‌లు నలుగురు నమ్ముతున్నారు. వాళ్లు జట్టులో ఉంటే పాక్‌ విజయం సాధించదు. ఆ ఆటగాళ్లను తప్పించడానికి నేను ప్రయత్నించా. కానీ, మేనేజ్‌మెంట్ వారిని తిరిగి జట్టులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది’’ అని పాక్‌ మాజీ సెలెక్టర్ వ్యాఖ్యానించాడు. 

ఈ టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. యూఎస్‌ఏ, భారత్‌ చేతిలో ఓడింది ఆ జట్టు. గ్రూప్‌ దశలో ఇంకా ఐర్లాండ్, కెనడాతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో నెగ్గినా పాక్‌ సూపర్‌-8 అర్హత సాధిస్తుందని కచ్చితంగా చెప్పలేం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని