Shooting In Asian Games: భారత బంగారు గని షూటింగ్‌.. టీనేజర్ల పతకాల పంట

ఆసియా క్రీడలు (Asian Games) ఆరంభం అయిన నాటి నుంచి షూటర్ల జోరు మాములుగా లేదు. పెద్దగా అనుభవం లేని టీనేజీ షూటర్లు అదరగొట్టేస్తున్నారు.

Published : 30 Sep 2023 17:03 IST

ఒలింపిక్స్‌ అయినా.. ఆసియా క్రీడలైనా.. కామన్వెల్త్‌ అయినా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ అయినా కొన్నేళ్లుగా భారత్‌ స్థిరంగా పతకాలు తెస్తున్న ఏకైక ఆట ఏంటంటే గుర్తొచ్చేది షూటింగ్‌. ఏ ముహూర్తాన అభినవ్‌ బింద్రా 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ఈ ఆటలో స్వర్ణాన్ని గెలిచి చరిత్ర సృష్టించాడో అప్పటి నుంచి షూటింగ్‌లో భారత్‌ ఒక్కసారిగా ఎదిగిపోయింది. ఒకరి వెంట ఒకరు ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. తాజాగా ఆసియా క్రీడల్లో భారత షూటర్ల ప్రదర్శనే ఇందుకు నిదర్శనం.

టీనేజర్లు అదగొట్టేస్తున్నారు

ఆసియా క్రీడలు ఆరంభం అయిన నాటి నుంచి షూటర్ల జోరు మాములుగా లేదు. పెద్దగా అనుభవం లేని టీనేజీ షూటర్లు అదరగొట్టేస్తున్నారు. ప్రపంచ రికార్డు ప్రదర్శనలతో పతకాలు కొల్లగొట్టేస్తున్నారు. పోటీల ఆరో రోజు నాటికి భారత్‌ సాధించిన పతకాల్లో సగం పతకాలు షూటర్లే గెలిచారు. వాళ్లు నెగ్గిన 18 పతకాల్లో 6 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. ఇషా సింగ్, పాలక్, మనుబాకర్, రమిత జిందాల్, రుద్రాంక్ష్ పటేల్, పాలక్‌ లాంటి షూటర్లు పతకాల హోరు కొనసాగిస్తున్నారు.

Palak Gulia: సరదాగా మొదలుపెట్టి.. షూటింగ్‌లో స్వర్ణం నెగ్గి

మన అమ్మాయి ఇషా

ముఖ్యంగా భారత షూటర్లలో తెలంగాణ అమ్మాయి ఇషాసింగ్‌ జోరు మాములుగా లేదు. ఆమె ఏకంగా నాలుగు పతకాలు ఖాతాలో వేసుకుంది. 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం గెలిచిన ఆమె.. ఇదే ఈవెంట్‌ వ్యక్తిగత విభాగంలో రజతంతో మెరిసింది. ఆ తర్వాత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో రజతాలు గెలిచింది. గతంలోనూ ప్రపంచ కప్‌లో అదిరే ప్రదర్శన చేసిన ఇషా.. ఇక ఒలింపిక్సే లక్ష్యంగా పెట్టుకుంది.

వాళ్లు కూడా..

10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో రమిత, రుద్రాంక్ష్ పటేల్, దివ్యాంశ్‌ పన్వర్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ లాంటి షూటర్లు పతకాల పంట పండించారు. పోటీల ఆరో రోజుకు భారత్‌కు 32 పతకాలు లభిస్తే అందులో షూటర్లు 6 స్వర్ణాలతో సహా 18 పతకాలు అందించడం విశేషం. ఇందులో ఇషాసింగ్, ఐశ్వరీ ప్రతాప్‌సింగ్‌ కోటానే ఎనిమిది పతకాలు ఉన్నాయి. వీళ్లిద్దరూ చెరో నాలుగు పతకాలు సాధించారు. వ్యక్తిగత విభాగాల్లో పాలక్‌ గులియా (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌), ఇషాసింగ్‌ (25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌), అనన్‌జీత్‌ సింగ్‌ (పురుషుల స్కీట్‌), ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ (50 మీటర్ల రైఫిల్‌ త్రిపొజిషన్స్, 10 మీ ఎయిర్‌ రైఫిల్, ), రమిత జిందాల్‌ (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), అశి చౌస్కీ (50 మీటర్ల రైఫిల్‌ త్రిపొజిషన్స్‌) పతకాలు సొంతం చేసుకున్నారు. 2018 జకార్త ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో 2 స్వర్ణాలతో సహా 9 పతకాలే గెలిచిన భారత్‌.. ఈసారి స్థాయిని బాగా పెంచుకుంది. జకార్త ప్రదర్శనను ఎప్పుడో దాటేసింది.

మిషన్‌ పారిస్‌

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆశలు రేపుతోంది. ముఖ్యంగా యువ ఇషాసింగ్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ ఆశాకిరణాలుగా కనిపిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారీ ఆశలతోనే వెళ్లిన షూటర్లు రిక్త హస్తాలతో తిరిగి వచ్చారు. కానీ ఈసారి మనవాళ్ల జోరు చూస్తే కచ్చితంగా పతకాలు తెచ్చేలాగే ఉన్నారు. మనుబాకర్‌ ఆసియా క్రీడల్లో పెద్దగా రాణించకపోయినా గత ఒలింపిక్స్‌ నేర్పిన పాఠాలతో ఆమె సత్తా చాటే ఛాన్స్‌ ఉంది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని