Palak Gulia: సరదాగా మొదలుపెట్టి.. షూటింగ్‌లో స్వర్ణం నెగ్గి

పాఠశాలలో ఉన్నప్పుడు ఏదో సరదా కోసం షూటింగ్‌ నేర్చుకునేది పాలక్‌.  సమయం దొరికినప్పుడు రేంజ్‌కి వెళ్లి గన్‌ పట్టుకునేది. కానీ కరోనా మహమ్మారితో ఇంటి దగ్గరే ఉండాల్సి రావడంతో షూటింగ్‌ గురించి ఆమె ఆలోచన మారింది. ఆ ఆటను ప్రొఫెషనల్‌గా తీసుకోవాలని నిర్ణయించుకుంది.

Published : 30 Sep 2023 11:53 IST

పాలక్‌ గులియా.. ఆసియా క్రీడల్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ స్వర్ణం కైవసం చేసుందీ 17 అమ్మాయి. బొద్దుగా ఉండే ఈ అమ్మాయిని చూస్తే ఎవరూ షూటర్‌ అనుకోరు. ఏదైనా కుస్తీకి వచ్చిందా అన్నట్లు ఉంటుంది. కానీ బరిలో దిగితే కానీ తెలియదు పాలక్‌ సత్తా! అసలు పాలక్‌ గన్‌ పట్టడమే యాదృచ్ఛికంగా జరిగింది. 

పాఠశాలలో ఉన్నప్పుడు ఏదో సరదా కోసం షూటింగ్‌ నేర్చుకునేది పాలక్‌. సమయం దొరికినప్పుడు రేంజ్‌కి వెళ్లి గన్‌ పట్టుకునేది. కానీ కరోనా మహమ్మారితో ఇంటి దగ్గరే ఉండాల్సి రావడంతో షూటింగ్‌ గురించి ఆమె ఆలోచన మారింది. ఆ ఆటను ప్రొఫెషనల్‌గా తీసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆమె పడిన కష్టమే ఇప్పుడు ఆసియా క్రీడల్లో పసిడి రూపంలో ఫలితాన్ని ఇచ్చింది. హరియాణాలోని జజ్జర్‌కు చెందిన పాలక్‌కు ఆరంభం నుంచి చదువు మీదే ధ్యాస. కుటుంబంలో క్రీడాకారులు ఉన్నా ఆమెకు ఆటలపై దృష్టి లేదు. ఒకవేళ ఆడాల్సి వస్తే ఒక్కోసారి అథ్లెటిక్స్‌.. ఇంకొన్నిసార్లు స్విమ్మింగ్‌.. లేకపోతే షూటింగ్‌ ఇలా ఒక గోల్‌ అంటూ లేకుండా ఆడేది.

Roshibina Devi: భయాలను వెనక్కినెట్టి.. పతకం పట్టి..

కరోనా బ్రేక్‌లో

పాఠశాలలోనే రేంజ్‌ ఉండడంతో నెమ్మదిగా పాలక్‌ షూటింగ్‌ వైపు మళ్లింది. తండ్రి జోగిందర్‌ గులియా ప్రోత్సాహంతో కరోనా తర్వాత షూటింగ్‌పై ఇంకా శ్రద్ధ పెట్టింది. అలా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆమె.. గతేడాది కైరోలో జరిగిన షాట్‌గన్‌ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్లో రజతం సాధించింది. ఈ ఆగస్టులో ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడినా రాణించలేకపోయిన ఈ టీనేజర్‌.. ఆసియా క్రీడల్లో మాత్రం గురి తప్పలేదు. 

ఆసియా క్రీడల రికార్డు బద్దలు

బరిలో దిగింది తొలి ఆసియాక్రీడలే అయినా పాలక్‌కు అదురూ బెదురూ లేదు. అంత ఒత్తిడిలోనూ ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయింది. మహిళల 10 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్లో వేరే భారత స్టార్లు సత్తా చాటుతారనుకుంటే ఏ అంచనాలూ లేని పాలక్‌ పసిడి ఎగరేసుకుపోయింది. ఈ క్రమంలో ఫైనల్లో 242.1 పాయింట్లతో ఆసియా క్రీడల్లో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ పోటీలకు ముందు పాలక్‌ పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చింది. పోటీల వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి.. ఒత్తిడికి శరీరం ఎలా స్పందిస్తుందో గుర్తించి తప్పులు సరిదిద్దేలా చేసే ‘వార్‌ రూమ్‌ సిమ్యులేషన్‌ శిక్షణ’ పాలక్‌కు బాగా ఉపయోగపడింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో పసిడి ఆమె సొంతమైంది.

ఒలింపిక్స్‌ పతకమే లక్ష్యం

అత్యంత పోటీ ఉండే ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించడంతో పాలక్‌పై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ అమ్మాయి లక్ష్యం పారిస్‌ ఒలింపిక్సే. ఈ క్రీడలకు అర్హత సాధించి ఆపై పతకం గెలవాలని ఆమె పట్టుదలగా ఉంది. అయితే ఆమెకు అందంత సులభం కాకపోవచ్చు. పాలక్‌ ఆడే ఈవెంట్లో టాప్‌ భారత షూటర్లు ఆమెకు పోటీగా ఉన్నారు. అయితే ఆసియా క్రీడల్లో చూపిన స్థిరత్వాన్ని మున్ముందు ప్రదర్శిస్తే పాలక్‌ను ఒలింపిక్‌ పతక విజేతగా చూడొచ్చు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని