MS Dhoni in Asia Cup: ఆసియా కప్‌ అంటే ధోనీ గుర్తుకొస్తాడు.. ఎందుకంటే..?

అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఐసీసీ టోర్నీల్లోనే కాకుండా.. ఆసియా కప్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. జట్టుకు అత్యధిక విజయాలందించిన సారథిగా నిలిచిపోయాడు.

Updated : 31 Aug 2023 12:43 IST

ప్రత్యర్థుల ఊహాలకు అందనిరీతిలో వ్యూహాలు పన్నడంలో దిట్ట. ‘కెప్టెన్‌ కూల్‌’ అంటూ సహచరులు ఆప్యాయంగా పిలుచుకునే సారథి. భారత్‌కు వన్డే, టీ20, ఛాంపియన్స్‌ ట్రోఫీలను అందించిన ఏకైక నాయకుడు. ఇక IPLలోనూ అతడి నాయకత్వంలోనే సీఎస్‌కే ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన సంగతిని విస్మరించలేం. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా.. అతడే ఎంఎస్ ధోనీ. భారత క్రికెట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయాడు. అతడి పేరు వింటే ఠక్కున ఐసీసీ ట్రోఫీలు గుర్తుకొస్తాయి. అయితే, ఆసియా కప్‌ (Asia Cup)లోనూ తన నాయకత్వ పటిమతో భారత్‌ను ఉన్నత స్థాయికి చేర్చాడు. మరి ధోనీ సాధించిన రికార్డులు, ఘనతలు ఏంటో తెలుసుకుందాం..

ఏమిటీ యోయో?.. భారత క్రికెట్లో మళ్లీ ఫిట్‌నెస్‌ పరీక్షపై చర్చ

తొలుత 2004లో అంతర్జాతీయ కెరీర్‌లోకి అడుగు పెట్టిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) మూడేళ్లకు సారథి కావడం విశేషం. తొలిసారి కెప్టెన్‌గా 2007 టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) నుంచి బాధ్యతలు చేపట్టాడని అని తెలుసు కదా.. సరైన వికెట్‌ కీపర్‌ లేని లోటును తీర్చాడు. అదే సమయంలో పొట్టి వరల్డ్‌ కప్‌ను (2007లో) అందించడంతో 2008లో జరిగిన ఆసియా కప్‌లోనూ భారత్‌కు సారథిగా ధోనీ వ్యవహరించే అవకాశం వచ్చింది. ధోనీకి డిప్యూటీగా యువరాజ్‌ సింగ్‌ వ్యవహరించాడు. ధోనీ కెప్టెన్సీలో తొలిసారి ఆసియా కప్‌ బరిలోకి దిగిన టీమ్‌ఇండియా రన్నరప్‌గా నిలిచింది. వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈ టోర్నీలో ధోనీ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ వచ్చి మరీ ఆరు మ్యాచుల్లో 109 సగటుతో 327 పరుగులు చేశాడు. 

ఛాంపియన్‌గా భారత్‌

టీమ్‌ఇండియా రన్నరప్‌గా నిలిచిన 2008 ఆసియా కప్‌ తర్వాత మళ్లీ రెండేళ్లకు మినీ టోర్నీ వచ్చేసింది. ఈసారి కూడా ధోనీనే సారథి. అతడి నాయకత్వంలో భారత్ ఫైనల్‌ సహా నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ప్రతి మ్యాచ్‌లనూ ధోనీ విలువైన పరుగులు సాధించాడు. ఆసియా కప్ 2010 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి తొలిసారి ధోనీ నాయకత్వంలో ఛాంపియన్‌గా నిలిచింది. ధోనీ సారథ్యంలోని భారత్ 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన ఉత్సాహంతోనే బరిలోకి దిగి మరీ విజేతగా నిలవడం విశేషం. ధోనీ అన్ని మ్యాచులు కలిపి 173 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో వచ్చి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.

కలిసిరాని అదృష్టం..

ఆసియా కప్ 2012లో భారత్‌కు షాక్‌ తగిలింది. శ్రీలంక, పాకిస్థాన్‌పై అద్భుత విజయాలను నమోదు చేసిన టీమ్‌ఇండియాకు బంగ్లాదేశ్‌ చేతిలో పరాభవం తప్పలేదు. దీంతో ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. బంగ్లాతో సరిసమానంగా పాయింట్లను పంచుకున్నప్పటికీ.. లీగ్‌ స్టేజ్‌లో ఆ జటుపై ఓడిపోవడంతో దురదృష్టవశాత్తూ భారత్ ఇంటిముఖం పట్టింది. ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్‌ చేతిలో మాత్రం ఓటమి తప్పలేదు. అయితే, చివరి వరకు పోరాడిన బంగ్లా కేవలం రెండు పరుగుల తేడాతో ఓడింది. ఈ ఆసియా కప్‌లో భారత్ మూడు మ్యాచుల్లో ఆడింది. ధోనీ ప్రదర్శన కూడా ఏమంత గొప్పగా లేదు. అయితే, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ 183 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌తో పాక్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఒకే ఒక్క మ్యాచ్‌కు సారథిగా..

వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ 2018 ఎడిషన్‌లో భారత్‌ రోహిత్ శర్మ నాయకత్వంలో బరిలోకి దిగింది. విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో ధోనీకి బదులు రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. అయితే, ఆ టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ధోనీకి వచ్చింది. రోహిత్‌ గాయపడటం వల్ల అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌కు ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, ఆ మ్యాచ్‌ టై కావడం విశేషం. తన కెప్టెన్సీ కెరీర్‌లో ఆసియా కప్‌ టోర్నీకి సంబంధించి మొత్తం 14 మ్యాచుల్లో నాయకత్వం వహించాడు. ఇందులో తొమ్మిది విజయాలు, 4 ఓటములు, ఒక్కటి టైగా ముగిశాయి. ఆసియా కెప్టెన్లలో అత్యధిక విజయాలను నమోదు చేసిన సారథిగా ఎంఎస్ ధోనీ పేరు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.

మరో ఘనత..

ఇప్పటి వరకు ఆసియా కప్‌ చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే టీ20 ఫార్మాట్‌లో టోర్నీలు జరిగాయి. గతేడాది శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ధోనీ నాయకత్వంలోని భారత్‌ 2016లోనే ఛాంపియన్‌గా అవతరించింది. మొత్తం ఐదు మ్యాచుల్లోనూ గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోవడం విశేషం. అప్పటికే ఐసీసీ ట్రోఫీలు అయిన టీ20, వన్డే వరల్డ్‌ కప్‌లతోపాటు ఛాంపియన్స్‌ ట్రోపీని గెలిచిన ధోనీ.. వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆసియా కప్‌లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు. ఇలాంటి ఘనతను మరెవరూ భవిష్యత్తులోనూ సాధించే అవకాశాలు చాలా తక్కువే. 

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని