Yo-Yo Test: ఏమిటీ యోయో?.. భారత క్రికెట్లో మళ్లీ ఫిట్‌నెస్‌ పరీక్షపై చర్చ

ఆటగాళ్లు పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధిస్తేనే మైదానంలో చురుగ్గా కదలగలరు. మరి వారు ఎంత ఫిట్‌గా ఉన్నారని తెలుసుకోవాలంటే పరీక్ష పెట్టాలి కదా.. అలాంటిదే యో-యో (Yo Yo Test) టెస్టు. ఇప్పుడు మళ్లీ ఆటగాళ్లకు బీసీసీఐ నిర్వహిస్తోంది.

Updated : 27 Aug 2023 14:45 IST

యోయో.. అప్పట్లో భారత క్రికెట్లో ఈ మాట బాగా పాపులర్‌. కానీ మధ్యలో దాని ఊసే అంతా మరిచిపోయారు. ఇప్పుడు మళ్లీ యోయో ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఆసియా కప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లకు ఇటీవలే యోయో పరీక్షలు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ ఫిట్‌నెస్‌ పరీక్షలో ఆటగాళ్లు సాధించిన స్కోర్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏమిటీ యోయో?

అంతర్జాతీయ క్రికెట్లో ఉండే పోటీ ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో తలపడాలంటే కేవలం నైపుణ్యం, ఫామ్‌ మాత్రమే సరిపోదు. అత్యున్నత స్థాయి ఫిట్‌నెస్‌ ఉండాల్సిందే అన్నది భారత క్రికెట్‌ జట్టును నడిపించే మేనేజ్మెంట్‌ ఉద్దేశం. అందుకే అయిదేళ్ల కిందట యోయో ఫిట్‌నెస్‌ పరీక్షను ప్రవేశ పెట్టి.. ప్రతి ఆటగాడూ అందులో పాసవడం తప్పనిసరి చేశారు. దీనికి శ్రీకారం చుట్టింది ఒకప్పటి స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసు. భారత క్రికెట్లో అత్యున్నత ఫిట్‌నెస్‌ ప్రమాణాలను నెలకొల్పిన విరాట్‌ కోహ్లి టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఉండటంతో యోయోకు సులువుగానే ఆమోద ముద్ర పడింది.

అప్పటి కోచ్‌ రవిశాస్త్రి కూడా దీనికి మద్దతుగా నిలిచాడు. 2018 నుంచి మూడేళ్ల పాటు యోయోలో పాస్‌ కావడం భారత ఆటగాళ్లకు తప్పనసరిగా ఉండేది. అత్యుత్తమ ఫిట్‌నెస్‌ ఉంటే తప్ప యోయోను అధిగమించడం సాధ్యం కాదు. యువరాజ్‌ సింగ్, సురేశ్‌ రైనా లాంటి సీనియర్లే కాదు.. వాషింగ్టన్‌ సుందర్, పృథ్వీ షా లాంటి జూనియర్లు సైతం ఈ పరీక్షను అధిగమించలేక ఇబ్బంది పడ్డారు. కోహ్లి కెప్టెన్‌గా ఉన్నంత కాలం ఈ పరీక్షను కఠినంగా అమలు చేశారు.

Virat Kohli Fitness: ఇదే విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ మంత్రం!

అయితే అతను ఒక్కో ఫార్మాట్లో కెప్టెన్సీకి దూరం కావడం, అదే సమయంలో కరోనా ప్రభావంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ప్రమాణాలు తగ్గడంతో యోయో మీద పూర్తిగా దృష్టిపెట్టే పరిస్థితి లేకపోయింది. కెప్టెన్‌తో పాటు జట్టు కోచింగ్‌ సిబ్బంది కూడా మారడంతో క్రమంగా యోయోను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మళ్లీ యోయోకు ప్రాధాన్యం ఏర్పడింది. వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తుండటంతో ఆసియా కప్‌ ముంగిట జట్టు సభ్యులకు యోయోను తప్పనిసరి చేశారు. గతంలో అర్హత మార్కు 16.1గా ఉండేది. ఇప్పుడది 16.5కు పెరిగింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో శుభ్‌మన్‌ గిల్‌ 18.5 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచినట్లు వార్తలు వచ్చాయి. తాను 17.2 స్కోరు సాధించినట్లు స్వయంగా కోహ్లినే వెల్లడించాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా పరీక్షలో పాల్గొన్న మిగతా ఆటగాళ్లంతా అర్హత మార్కును దాటారు.

ఎలా జరుగుతుంది?

యోయోకు ఆద్యుడు డెన్మార్క్‌కు చెందిన సాకర్‌ సైకాలజిస్ట్‌ జెన్స్‌ బాంగ్స్‌బో. ఈ ఫిట్‌నెస్‌ పర్క్షీను రూపొందించింది అతనే. సాకర్‌లో పాపులర్‌ అయ్యాక క్రికెట్లోకి కూడా దీన్ని తీసుకొచ్చారు. పరుగెత్తే వేగాన్ని పెంచుతూ ఆటగాళ్ల సహన శక్తిని అంచనా వేయడమే దీని ప్రధాన ఉద్దేశం. పరీక్షలో భాగంగా బీప్‌ (శబ్దం), బీప్‌కు మధ్య కొద్దిపాటి విరామంలో సగటున గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల వరకు పరుగెత్తాల్సి ఉంటుంది. యోయో పరీక్షలో రెండు స్థాయిలుంటాయి. మొదటిది తక్కువ శ్రమ పడే ఆటగాళ్ల కోసం.. రెండోది నిపుణుల కోసం. పరీక్షలో భాగంగా 20 మీటర్ల దూరంలో ఇటు అటు కోణాలను ఉంచుతారు. వాటి మధ్య పరుగెత్తాలి. ఒక్కో పరుగుకు మూడు బీప్‌లు ఉంటాయి. మొదటి బీప్‌ వచ్చినపుడు ఆటగాడు పరుగు ఆరంభించాలి.

రెండోసారి శబ్దం వచ్చేసరికి ఆటగాడు అవతలి వైపున్న కోచ్‌ను చేరుకోవాలి. మూడో బీప్‌ సమయానికి ఆరంభ స్థానానికి చేరాలి. రెండో బీప్‌ వచ్చేసరికి అవతలి వైపు వెళ్లలేకపోతే మూడో బీప్‌ సమయానికి లక్ష్యానికి చేరాలి. లేదంటే తొలి హెచ్చరిక జారీ చేస్తారు. అలా మూడు హెచ్చరికలు అందుకుంటే ఆటగాడు పరీక్షలో విఫలమైనట్లే. ప్రతి నిమిషానికీ బీప్‌ వచ్చే సమయాన్ని తగ్గిస్తూ వెళ్తారు. ఒక షటిల్‌ 40 మీటర్లు కాగా.. ఆటగాళ్లు పూర్తి చేసిన షటిళ్ల ఆధారంగా స్కోరును లెక్కిస్తారు. ఒక్కో షటిల్‌ మధ్య 5-10 సెకన్ల విరామం లభిస్తుంది. బీప్‌ను ఎవరూ నియంత్రించలేరు. పరీక్ష కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా జరుగుతుంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని