MS Dhoni: ధోనీ దూకుడు.. 2022 తర్వాత మళ్లీ ఇప్పుడే..

దిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ సిక్సర్లను అలవోకగా కొడుతూ యంగ్‌ ధోనీని గుర్తు చేశాడు.

Published : 01 Apr 2024 18:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : మహేంద్ర సింగ్‌ ధోనీ.. క్రికెట్‌లో అతడి పేరే ఓ సంచలనం. మైదానంలో కనిపిస్తే చాలు అభిమానులకు పండగే. అలాంటి ధోనీ ఈ సీజన్‌లో చెన్నై జట్టులో రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం దక్కలేదు. దీంతో నిరాశ చెందిన అభిమానులకు మూడో మ్యాచ్‌లో బ్యాట్‌తో కనువిందు చేశాడు. భారీ సిక్సర్లను అలవోకగా బాదుతూ యంగ్‌ ధోనీని గుర్తుచేశాడు. మ్యాచ్‌ ఓడిపోయినప్పటికీ అతడి ఆటతీరు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

2022 తర్వాత ఇప్పుడే..

8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ధోనీ గత సీజన్‌లో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టినప్పటికీ.. వ్యక్తిగతంగా పెద్దస్కోర్లు లేవు. 2023వ సీజన్‌లో అతడు మొత్తం చేసింది 104 పరుగులే. 12 ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఇందులో అత్యధిక స్కోరు 32. అంతకుముందు సీజన్‌(2022)లో దూకుడుగా ఆడాడు. మొత్తం 232 పరుగులు చేశాడు. ఆ తర్వాత.. ఈ సీజన్‌ ఆరంభంలోనే అదరగొట్టాడు. కెప్టెన్‌ బాధ్యతలు వదిలేసిన ధోనీ.. ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే 231 స్ట్రైక్‌ రేట్‌తో భారీ హిట్టింగ్‌ చేశాడు. 16 బంతుల్లోనే మూడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 37 పరుగులు రాబట్టాడు. జట్టు ఓడిపోయినప్పటికీ ఓటమి అంతరాన్ని తగ్గించాడు.

కీపింగ్‌లోనూ అద్భుతాలు..

ధోనీ అటు కీపింగ్‌లోనూ అద్భుతాలు చేస్తూ మునుపటి దూకుడును ప్రదర్శిస్తున్నాడు. దిల్లీతో మ్యాచ్‌లో పృథ్వీషాను ఔట్‌ చేయడం ద్వారా టీ20 ఫార్మాట్‌లో 300 డిస్‌మిస్సల్స్‌ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 274 డిస్‌మిస్సల్స్‌తో ఆ తర్వాతి స్థానంలో పాక్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని