MS Dhoni: ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా

ఎప్పుడూ కూల్‌గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్‌ రైనా ఇటీవల బయటపెట్టాడు. 

Published : 23 Apr 2024 18:08 IST

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni), సురేశ్ రైనా (Suresh Raina) మంచి మిత్రులని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైనా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా చెన్నై మ్యాచ్‌లకు హాజరవుతుంటాడు. అప్పుడప్పుడు మైదానంలో సీఎస్కే ఆటగాళ్లతో ముచ్చటిస్తుంటాడు. ఎప్పుడూ కూల్‌గా కనిపించే ధోనీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని రైనా ఇటీవల బయటపెట్టాడు. 2014 ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో చెన్నై 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ధోనీ (42*; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివరివరకు క్రీజులో ఉన్నా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆ హృదయ విదారకమైన ఓటమి తర్వాత ధోనీ చాలా కోపంగా కనిపించాడని, తాను ఎప్పుడూ అతడిని అంత కోపంగా చూడలేదని రైనా గుర్తు చేసుకున్నాడు. 

‘‘ధోనీకి అంత కోపం రావడం నేనెప్పుడూ చూడలేదు. ఆ మ్యాచ్ తర్వాత అతడు దానిని బయటపెట్టాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్యాడ్‌లు, హెల్మెట్‌ని విసిరేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామని చిరాకుపడ్డాడు. చావో, రేవో అయిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆగ్రహానికి లోనయ్యాడు. మ్యాచ్‌ గెలిచిఉంటే ఆ ఏడాది కూడా మేమే టైటిల్‌ సాధించేవాళ్లం’’ అని సురేశ్‌ రైనా వివరించాడు. పంజాబ్‌తో క్వాలిఫయర్‌-2లో రైనా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదాడు. తొలుత పంజాబ్ 226/6 స్కోరు చేయగా.. చెన్నై 202/7కు పరిమితమైంది. 2021 తర్వాత రైనా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తి అభిమానులను అలరిస్తున్నాడు. 


వారికి ఎక్కువగా కోచింగ్ అవసరం లేదు: బ్రావో

 

చెన్నై బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో ఆ జట్టు పేసర్లు మతిశా పతిరన, ముస్తాఫిజుర్ రెహ్మన్‌లపై ప్రశంసలు కురిపించాడు. వారితో కలిసి పనిచేసే అవకాశం దక్కడంతో సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఈ ఇద్దరు పేసర్లకు ఎక్కువ కోచింగ్ అవసరం లేదని, వారు సహజ ప్రతిభావంతులని బ్రావో వివరించాడు. ‘‘పతిరన చాలా ప్రత్యేకమైనవాడు. నేను అతడిని ‘బేబీ మలింగ’ అని పిలుస్తాను. ‘బేబీ గోట్ (గ్రేట్ ఆఫ్‌ ది ఆల్‌టైమ్‌) అని కూడా పిలుస్తాను. అతడిలో సహజ నైపుణ్యం, సామర్థ్యం ఉన్నాయి. కావున ఎక్కువ కోచింగ్ అవసరం లేదు. ముస్తాఫిజుర్ కూడా వెరీవెరీ స్పెషల్. అతనికి ప్రత్యేకమైన యాక్షన్ ఉంది. ప్రపంచంలో అత్యుత్తమంగా స్లో బాల్స్‌ వేసే బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు’’ అని డ్వేన్ బ్రావో పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని