Mumbai Indians: వరుసగా 12వ సారి.. ముంబయి తొలి మ్యాచ్‌ల చరిత్ర ఎలా ఉందంటే..?

ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై ఓటమిపాలైంది. ఇలా ఓటమితో సీజన్‌ను ప్రారంభించడం  ఆ జట్టుకు కొత్తేమీ కాదు.

Updated : 25 Mar 2024 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పటిలాగే ఈ ఐపీఎల్‌ (IPL) సీజన్‌ను ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) మరోసారి ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలవడం ఆ జట్టుకు కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా ఆ జట్టు  2012వ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది. చెన్నైపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత 12 సీజన్లలో ఒక్కసారి కూడా గెలవలేదంటే.. ఆ జట్టు తొలి మ్యాచ్‌ చరిత్ర ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబయి ఇండియన్స్‌ చేజార్చుకుంది. ఆదివారం చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై ఆ జట్టు 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ముంబయి ఆడిన తొలి మ్యాచ్‌ల ఫలితాలను పరిశీలిస్తే..

IPL 2024: హోస్ట్‌ టీమే విన్నర్‌.. ‘ఫస్ట్‌’ బెస్ట్‌ వీరే!

గెలిచింది నాలుగుసార్లే..

ప్రస్తుతం ఐపీఎల్‌ 17వ సీజన్‌ కొనసాగుతోంది.  ఇప్పటివరకూ ఆడిన తొలి మ్యాచ్‌ల్లో ముంబయి ఇండియన్స్‌ గెలిచింది కేవలం నాలుగు సార్లే. 2008లో జరిగిన ఐపీఎల్‌ తొలి సీజన్‌లో ముంబయి తన తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై ఓటమి పాలైంది. ఆ తర్వాత 2009 నుంచి 2012 వరకు వరుసగా నాలుగు సీజన్లలో తొలి మ్యాచ్‌ల్లో ముంబయి విజయాలను నమోదు చేసింది. ఆ తర్వాత గెలిచింది లేదు

తొలి మ్యాచ్‌ ఓడినా.. టైటిల్‌ గెలిచింది..

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబయి ఒకటి. ఐదుసార్లు టైటిల్‌ గెలిచి అత్యధికంగా ట్రోఫీలు నెగ్గిన జట్టుగా రికార్డు సృష్టించింది. గత సీజన్‌లో ఈ రికార్డును ఎంఎస్‌ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు సమం చేసింది. ఇక ముంబయి టైటిల్‌ గెలిచిన సీజన్లను గమనిస్తే.. తొలి మ్యాచ్‌ల్లో ఓడిన సీజన్లలోనే విజేతగా నిలవడం విశేషం. 2013, 2015, 2017, 2019, 2020ల్లో ముంబయి ట్రోఫీలను గెలుచుకుంది. ఈ సీజన్ల తొలి మ్యాచ్‌ల్లో ముంబయి ప్రత్యర్థుల చేతుల్లో దాదాపు ఘోరంగా ఓటమిపాలవడం గమనార్హం.

గొప్పగా లేని ముంబయి ఆట..

తొలి మ్యాచ్‌లో గెలుపు అనేది ఏ జట్టుకైనా ఉత్సాహాన్నిస్తుందని అంటుంటారు. కానీ.. ముంబయి విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంది. అయితే.. ముంబయి ట్రాక్‌ రికార్డు గత కొన్నేళ్లుగా అంత గొప్పగా ఏమీ లేదు. చివరిసారిగా విజేతగా నిలిచిన 2020 అనంతరం ఆ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. 2021వ సీజన్‌లో ఆ జట్టు ప్లేఆఫ్సే చేరలేదు. 2022లోనైతే పాయింట్ల పట్టికలో అట్టడగు స్థానంలో నిలిస్తే.. గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌ వరకూ వచ్చి వెనుదిరిగింది.

ఇక ముంబయికి ఐదుసార్లు టైటిల్‌ అందించింది రోహిత్‌ శర్మనే. అతడిని కాదని ఈసారి కొత్త సారథి హార్దిక్‌ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. వీరి మధ్య సమన్వయం అంతగా లేదని మొదటి మ్యాచ్‌ను చూస్తేనే అర్థమవుతోంది. మరి హార్దిక్‌ మిగతా మ్యాచ్‌ల్లో జట్టును ఏవిధంగా నడిపిస్తాడో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని