Lucknow Vs Punjab: ఆ డెలివరీని మరిచిపోలేను.. తొలి వికెట్‌ ఎప్పటికీ ప్రత్యేకమే: మయాంక్‌ యాదవ్

లఖ్‌నవూ యువ బౌలర్ మయాంక్ యాదవ్ అద్భుత ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బంతిని విసిరిన బౌలర్‌గా అవతరించాడు.

Updated : 31 Mar 2024 10:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దూకుడుగా ఆడుతున్న పంజాబ్‌ బ్యాటర్లకు అడ్డుకట్ట వేసి మరీ మయాంక్‌ యాదవ్ లఖ్‌నవూ వైపు మ్యాచ్‌ను మలుపు తిప్పేశాడు. ఐపీఎల్ 17వ సీజన్‌లో తమ జట్టు బోణీ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 27 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక వేగంతో బంతిని (155.8 కి.మీ) విసిరిన బౌలర్‌గానూ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా తన డెబ్యూ మ్యాచ్‌పై మయాంక్ స్పందించాడు. 

‘‘ఇంతకుమించిన అద్భుతమైన అరంగేట్రం ఉంటుందని అనుకోవడం లేదు. మ్యాచ్‌కు ముందు కాస్త ఆందోళన పడ్డా. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకొని బంతులు సంధించాలనే ప్రణాళికకు కట్టుబడ్డా. మధ్యలో స్లో బంతులు కూడా వేయాలకున్నా. కానీ, వేగవంతమైన బాల్స్‌ వేయడానికే మొగ్గు చూపా. ఫాస్టెస్ట్‌ బంతిని విసరడం జీవితంలో మరిచిపోలేను. కెరీర్‌లో తొలి వికెట్‌ ఎప్పటికీ ప్రత్యేకమే. డేంజరస్‌ బ్యాటర్ బెయిర్‌ స్టోను ఔట్ చేయడం ఆనందంగా ఉంది. నా యువ క్రికెటర్‌కు ఇదొక సూపర్‌ డెబ్యూ. కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఒకవేళ ఏమైనా గాయాలు అయితే ఇబ్బంది పడే అవకాశమూ ఉంటుంది. అందుకే కెరీర్‌ ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఊహించలేం. వాటన్నింటినీ అధిగమించి సాధించేందుకు ప్రయత్నిస్తా. ఈ ప్రపంచంలో ఇష్టపడే ఒకే ఒక్క ఫాస్ట్‌ బౌలర్‌ డేల్ స్టెయిన్‌’’ అని మయాంక్‌ తెలిపాడు. 

మయాంక్‌ వల్లే ఈ విజయం: పూరన్

‘‘మేం టోర్నీలో బోణీ కొట్టగలిగాం. ప్రతి విషయంపై సమష్టిగా చర్చించుకుని నిర్ణయాలు తీసుకున్నాం. మంచి కాంబినేషన్‌తో బరిలోకి దిగాలనుకున్నాం. ప్రత్యర్థికి మంచి లక్ష్యమే నిర్దేశించాం. కానీ, శిఖర్ ధావన్ - బెయిర్‌ స్టో అద్భుతంగా ఆడారు. ఒక దశలో మ్యాచ్‌ పోతుందేమో అనిపించింది. కానీ, యువ బౌలర్ మయాంక్ స్పెల్‌తో మ్యాచ్‌ మా వైపు తిరిగింది. సరైన సమయంలో వికెట్లు తీయడంతో గెలిచాం. మయాంక్ హీరో. తానెంత మంచి బౌలర్‌ననే విషయాన్ని ప్రపంచానికి చూపించాడు. ఇదంతా ఐపీఎల్‌ వల్లే. ఇంతకంటే మంచి ప్లాట్‌ఫామ్‌ యువ ఆటగాళ్లకు దొరకదు’’ అని లఖ్‌నవూ కెప్టెన్ నికోలస్‌ పూరన్ అన్నాడు.

మమ్మల్ని అదే దెబ్బ కొట్టింది: శిఖర్ ధావన్‌

‘‘లివింగ్‌ స్టోన్‌ గాయపడటం మా జట్టుకు ఇబ్బందిగా మారింది. రెండో డౌన్‌లో బ్యాటింగ్‌కు రావాల్సిన అతడు కాస్త ఆలస్యం వచ్చాడు. మేం ఇన్నింగ్స్‌ను బాగానే ఆరంభించాం. అయితే, మయాంక్‌ పేస్‌తో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అద్భుతంగా బౌన్సర్లు, యార్కర్లు సంధించాడు. క్యాచ్‌ డ్రాప్ చేయడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మా ఓటమిపై విశ్లేషించుకుంటాం.’’ అని పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని