IPL 2024: ఓవర్‌లో రెండు బౌన్సర్లు.. కొత్త నిబంధనలతో సరికొత్తగా ఐపీఎల్‌

ఐపీఎల్ 17వ సీజన్‌ను (IPL 2024) మరింత రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. మార్చి 22 నుంచి సీఎస్కే, ఆర్సీబీ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ ఎడిషన్‌ ప్రారంభం కానుంది. 

Published : 21 Mar 2024 19:48 IST

ఐపీఎల్‌ (IPL).. అంటే చాలు అభిమానుల్లో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది. గత 16 ఏళ్లుగా గొప్ప వినోదాన్ని అందిస్తున్న ఈ టీ20 లీగ్‌.. 2024లో సరికొత్తగా ముస్తాబైంది. కొత్తగా వచ్చిన కొన్ని నిబంధనలతో ఈ టోర్నీ అభిమానులకు కొత్త అనుభూతిని కూడా ఇవ్వబోతోంది. గతేడాది ప్రయోగాత్మకంగా పరిశీలించిన రూల్స్‌ కూడా ఈసారీ కొనసాగనున్నాయి.

ఇక నుంచి రెండు సంధించే అవకాశం..

సాధారణంగా టీ20 క్రికెట్లో బౌలర్‌ ఒక ఓవర్లో ఒకే బౌన్సర్‌ వేసే అవకాశం ఉంటుంది. కానీ తాజాగా ఐపీఎల్‌లో ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేయడానికి అనుమతి ఉంది. దీంతో ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో ఈ రెండు బౌన్సర్ల నిబంధన బాగా ఉపయోగపడనుంది. 2023-2024 సయ్యద్‌ ముస్తాక్‌అలీ టోర్నీలో ఈ విధానాన్ని విజయవంతంగా పరీక్షించారు. దీంతో ఐపీఎల్‌లోనూ ఈసారి ఈ నిబంధనలు ఉపయోగించబోతున్నారు. మరి ఈ కొత్త రూల్‌ను బౌలర్లు తమకు ఎంత అనుకూలంగా మార్చుకుంటారో చూడాలి. అంతేకాక స్టంపింగ్‌ చేసిన సమయంలో క్యాచ్‌ను కూడా పరిశీలించే నిబంధనను కూడా 2024 ఐపీఎల్‌లో బీసీసీఐ కొనసాగించనుంది. ఆఖరి ఓవర్లలో ఫలితాలు తేలే మ్యాచ్‌ల్లో ఈ రూల్‌ బౌలర్లకు వరంగా మారుతుందని అనుకుంటున్నారు. దీనివల్ల బ్యాటర్లకు, బౌలర్లకు మధ్య సమానమైన పోటీ ఉండే అవకాశాలున్నాయి.

స్మార్ట్‌ రీప్లే సిస్టమ్‌

అంపైర్‌ నిర్ణయాలపై మరింత స్పష్టత కోసం ఈసారి ఐపీఎల్‌లో స్మార్ట్‌ రీప్లే సిస్టమ్‌ను బీసీసీఐ అమలుచేయబోతోంది. దీనిప్రకారం టీవీ అంపైర్, హాక్‌ ఐ ఆపరేటర్ల నుంచి వచ్చే ఫీడ్‌ను నేరుగా అందుకుంటాడు. దీనివల్ల గతంలో ఎక్కువ దృశ్యాలను చూసే అవకాశం ఉంటుంది. భిన్న కోణాల్లో విజువల్స్‌ను వీక్షించే ఛాన్స్‌ వస్తుంది. గతంలో టీవీ బ్రాడ్‌కాస్టర్ల నుంచి టీవీ అంపైర్‌కు విజువల్స్‌ వచ్చేవి. దీనివల్ల అంపైర్‌ పరిమితంగానే విజువల్స్‌ చూసేవాడు. కానీ స్మార్ట్‌ రీప్లే సిస్టమ్‌ ద్వారా మైదానంలో నలుమూలలా ఏర్పాటుచేసిన ఎనిమిది హైస్పీడ్ కెమెరాల నుంచి వచ్చే ఫీడ్‌ నేరుగా టీవీ అంపైర్‌కు చేరుతుంది. దీంతో నిర్ణయాల్లో పారదర్శకత పెరగనుంది. అంతేకాక టీవీ అంపైర్, హాక్‌ ఐ ఆపరేటర్ల మధ్య సంభాషణలను కూడా వీక్షకులు లైవ్‌లో వినొచ్చు. అంపైర్‌ ఎలా నిర్ణయం తీసుకున్నాడో కూడా అభిమానులకు తెలుస్తుంది. 

ఆ నిబంధన అలాగే..

వైడ్లు, నోబాల్స్‌కు సమీక్ష కోరే నిబంధనను గతేడాది ఐపీఎల్‌లో ప్రవేశపెట్టారు. ఈ రూల్‌తో కీలక సమయాల్లో జట్లు లబ్ది పొందాయి. అందుకే ఈసారి కూడా ఈ నిబంధన కొనసాగించనున్నారు. దీనికితోడు ప్రతీ జట్టుకు అదనంగా రెండు సమీక్షలు అందుబాటులో ఉంటాయి. నిర్ణయాల్లో మరింత పారదర్శకత కోసం ఈ నిబంధనలు ఉపయోగపడతాయని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఇటీవల ప్రవేశపెట్టిన స్టాప్‌ క్లాక్‌ నిబంధనను మాత్రం ఐపీఎల్‌-17లో అమలుచేయట్లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్‌ జట్టు ఒక ఓవర్‌ అయిన 60 సెకన్లలోపే ఓవర్‌ను మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఈ రూల్‌తో సమయం ఆదా అవుతుందని ఐసీసీ ఉద్దేశం. అయితే ఈ నిబంధన పూర్తిస్థాయిలో ఇంకా అమలుచేయలేదు.   ఈనేపథ్యంలో ఐఎల్‌లో ఈ రూల్‌ను ప్రవేశపెట్టలేదు. 

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని