Hardik Pandya: దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్‌ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. 

Updated : 23 Apr 2024 11:25 IST

ఇంటర్నెట్ డెస్క్: జట్టులో స్టార్ ఆటగాళ్లున్నా ఐపీఎల్‌ 17 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ముంబయి ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు విజయాలే సాధించింది. ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిందే. రాజస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల వైఫల్యాలే జట్టు ఓటమికి కారణమని అతడు పేర్కొన్నాడు. 

‘‘మేం చేజేతులా ప్రారంభంలోనే ఇబ్బందుల్లో పడ్డాం. తిలక్ వర్మ, నేహాల్ వధేరా బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఆరంభంలో వికెట్లు కోల్పోవడంతో కనీసం 180 స్కోరైనా చేస్తామని అనుకోలేదు. చివరి ఓవర్లలో ధాటిగా ఆడలేకపోయాం. ఫలితంగా 10-15 పరుగులు తక్కువగా చేశాం. పవర్‌ ప్లే ఆరంభంలోనే మేం రాజస్థాన్‌పై ఒత్తిడి తెచ్చి వికెట్లు పడగొట్టాల్సింది. కానీ, అలా జరగలేదు. ఆ జట్టు ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడారు. ఫీల్డింగ్‌లోనూ పొరపాట్లు చేశాం. మొత్తం మీద అత్యుత్తమంగా ఆడలేకపోయాం. రాజస్థాన్‌ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఆటగాళ్ల (ముంబయి) వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదు. అందరూ ప్రొఫెషనల్ క్రికెటర్లే. వారు నిర్వర్తించాల్సిన పాత్రలేంటో తెలుసు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆటలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని వచ్చే మ్యాచ్‌ల్లో వాటిని పునరావృతం చేయకూడదు. జట్టు, వ్యక్తిగతంగా లోపాలను అంగీకరించాలి. వాటిని సరిచేసుకుని ముందుకు సాగాలి. నేను ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడానికే ఇష్టపడతాను. ఎల్లప్పుడూ మంచి క్రికెట్ ఆడటం, మా ప్రణాళికలకు కట్టుబడి ఉండటంపై దృష్టి సారిస్తాను’’ అని హార్దిక్ పాండ్య వివరించాడు. 

మ్యాచ్‌ విశేషాలు

  • ఈ మ్యాచ్‌లో మహ్మద్‌ నబీని ఔట్ చేసి యుజ్వేంద్ర ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు చాహలే.  
  • 23 ఏళ్ల కంటే ముందే ఐపీఎల్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆటగాడు యశస్వి జైస్వాల్.
  • ఒక సీజన్‌లో మొదటి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించిన ఐదో జట్టు రాజస్థాన్. ముంబయి (2010), పంజాబ్ (2014), చెన్నై (2019), గుజరాత్ (2022) ముందున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని