Attacking Game: దంచుడే దంచుడు.. ప్రపంచకప్‌ ముంగిట రెచ్చిపోతున్న విదేశీ జట్లు

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) సమీపిస్తున్న కొద్దీ జట్లన్నీ తమ శక్తియుక్తులను పరీక్షించుకుంటున్నాయి. ఈ క్రమంలో వన్డేల్లోనూ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్నిసార్లు విఫలమైనప్పటికీ.. ఎక్కువసార్లు విజయవంతమై అద్భుత ఫలితాలను రాబడుతున్నాయి.

Updated : 16 Sep 2023 13:15 IST

వన్డే ప్రపంచకప్‌నకు (ODI World Cup 2023) ఇంకో మూడు వారాలే సమయం ఉంది. భారత్‌ సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. ఉపఖండపు జట్లు పాకిస్థాన్, శ్రీలంక సైతం కప్పులో తమకు మెరుగైన అవకాశాలుంటాయని ఆశిస్తున్నాయి. ఈ మూడు జట్లు ప్రపంచకప్‌ సన్నద్ధత కోసం ఆసియా కప్‌లో ఆడుతుంటే.. మరోవైపు ట్రోఫీపై కన్నేసిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వన్డే  సిరీస్‌ల్లో తలపడుతున్నాయి. ఈ జట్లన్నీ చాలా దూకుడుగా ఆడుతూ, పరుగుల వరద పారిస్తూ ఉపఖండపు జట్లకు ప్రపంచకప్‌లో గట్టి సవాలు విసిరేలా కనిపిస్తుండటం గమనార్హం.

టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్‌ ప్రవేశ పెట్టిన బజ్‌బాల్‌ పద్ధతి ఒక సంచలనం. టెస్టులను సంప్రదాయ శైలిలో నెమ్మదిగా ఆడటం మాని.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ తరహాలో చాలా దూకుడుగా ఆడటం మొదలుపెట్టి అద్భుత ఫలితాలు రాబట్టింది ఇంగ్లాండ్‌. కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చినా ఇంగ్లాండ్‌ ‘బజ్‌బాల్‌’ విషయంలో వెనక్కి తగ్గలేదు. టెస్టుల్లో నిలకడగా 5 అంతకంటే ఎక్కువ రన్‌రేట్‌తో పరుగులు చేయడం.. రక్షణాత్మక ఫీల్డింగ్‌ పెట్టి ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేయడం.. సాహసోపేత రీతిలో ఇన్నింగ్స్‌లను డిక్లేర్‌ చేయడం.. డ్రా కోసం కాకుండా విజయాల కోసమే ప్రయత్నించడం.. ఇలా ‘బజ్‌బాల్‌’ శైలితో ఇంగ్లాండ్‌ ప్రపంచ క్రికెట్లో ప్రకంపనలు రేపింది.

ఆ జట్టు వన్డేల్లో కూడా ‘బజ్‌బాల్‌’ శైలినే అనుసరిస్తోంది. క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఆ జట్టు బ్యాటర్లు బాదడమే పనిగా పెట్టుకుంటున్నారు. వికెట్లు పడినా తగ్గేదే లే అంటున్నారు. బట్లర్, మలన్, బ్రూక్, బట్లర్, లివింగ్‌స్టన్, మొయిన్‌ అలీ.. ఇలా అందరూ దూకుడైన బ్యాటర్లే కావడం, ఎనిమిదో స్థానంలో ఆడే సామ్‌ కరన్‌ కూడా ధాటిగా ఆడగల సత్తా ఉన్నవాడు కావడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం. దీంతో తరచుగా ఆ జట్టు స్కోర్లు 300 దాటేస్తున్నాయి. 350 స్కోర్లు కొట్టడం కూడా ఇంగ్లాండ్‌కు తేలికగా మారుతోంది. ప్రస్తుత న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 368 పరుగులు చేసింది. అందులో బెన్‌ స్టోక్స్‌ ఏకంగా 182 స్కోరు సాధించాడు. నిజానికి ఆ జట్టు ఊపు చూస్తే 400 స్కోరు చేసేలా కనిపించింది. చివర్లో వికెట్లు పడటంతో స్కోరు తగ్గింది. నాలుగో వన్డేలో స్కోరును 300 దాటించిన ఇంగ్లిష్‌ జట్టు.. అంతకుముందు 34 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 226 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ సైతం ఆ జట్టుకు దీటుగా స్పందిస్తోంది. తొలి వన్డేలో 292 పరుగుల లక్ష్యాన్ని 45.4 ఓవర్లలోనే అలవోకగా ఛేదించేసింది. 

వేటగాడు తిరిగొచ్చాడు... పాత రోజుల్ని గుర్తుకు తెస్తున్న విరాట్ కోహ్లి

మరోవైపు ఆస్ట్రేలియా సైతం ఇంగ్లాండ్‌ తరహాలోనే ఈ మధ్య చాలా దూకుడుగా ఆడుతోంది. అలవోకగా 300, అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధిస్తోంది. ట్రావిస్‌ హెడ్, మిచెల్‌ మార్ష్‌ లాంటి బ్యాటర్లు ఆ జట్టు బ్యాటింగ్‌కు రాకెట్‌ వేగాన్ని అందిస్తున్నారు. వార్నర్‌ కూడా ఫామ్‌ అందుకోవడం ప్లస్‌ అవుతోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారిస్తోంది ఆసీస్‌. సఫారీ జట్టు కూడా అంతే దీటుగా స్పందిస్తోంది. తొలి వన్డేలో ఆసీస్‌ ఏకంగా 392 పరుగులు సాధిస్తే.. రెండో మ్యాచ్‌లో సఫారీ జట్టు 338 పరుగులు చేసింది. మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఏకంగా 416 స్కోరు చేయడం విశేషం. క్లాసెన్‌ 83 బంతుల్లో 174 పరుగులు కొట్టాడు. ఇలా ఉపఖండేతర జట్ల దూకుడు ప్రస్తుతం మామూలుగా లేదు.

ఇక్కడ ఆడగలరా?

ఓవైపు ఆసియా కప్‌లో ఉపఖండ జట్లు పరుగుల కోసం ఎంత శ్రమిస్తున్నాయో తెలిసిందే. 300 స్కోరు చేయడం చాలా కష్టమవుతోంది. 250 లక్ష్యాలను కూడా కాపాడుకుంటున్నారు. కానీ అక్కడేమో స్కోర్లు 350, 400 దాటేస్తున్నాయి. మరి ఈ జట్ల దూకుడును ప్రపంచకప్‌లో ఉపఖండ టీమ్స్‌ తట్టుకోలవా అన్న చర్చ నడుస్తోంది. కానీ తమకు అనుకూలమైన, అలవాటైన పిచ్‌ల మీద ఈ జట్లు చెలరేగిపోతుండొచ్చు కానీ.. భారత్‌లోనూ ఆ దూకుడు చూపించగలవా అన్నది ప్రశ్న. ఈ జట్లలోని చాలామంది ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. భారత పిచ్‌లు కొత్త కాదు. అయినా సరే.. స్పిన్‌ వికెట్లను భారత్, మిగతా ఉపఖండ జట్లు ఉపయోగించుకునే తీరు వేరుగా ఉంటుందని, కాబట్టి విదేశీ జట్లకు ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. దూకుడు మరీ శ్రుతిమించితే అసలుకే మోసం వచ్చి జట్లు కుప్పకూలే ప్రమాదం కూడా ఉంటుందన్నది వాస్తవం. మరి భారత్‌ వేదికగా ఈ జట్ల దూకుడు మంత్రం ఏమాత్రం పారుతుందో చూడాలి.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు