T20 World Cup: ‘మా దేశంలో నెపోటిజం స్థాయి ఇదీ’.. పాక్‌ క్రికెటర్ ఎంపికపై ఫ్యాన్స్ ఫైర్

వరల్డ్ కప్‌ కోసం ప్రకటించిన జట్టుపై  పాకిస్థాన్ ఫ్యాన్స్‌ ఆగ్రహంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఘోరంగా విఫలమవుతున్న ఆజం ఖాన్‌ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు తలెత్తాయి.

Updated : 31 May 2024 13:27 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ వికెట్ కీపర్‌ ఆజం ఖాన్‌పై ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. టీ20 ప్రపంచ కప్‌ ముంగిట.. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఐదు బంతులను ఎదుర్కొని డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇటు కీపింగ్‌లోనూ ఘోరమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు. కనీసం బంతిని పట్టుకొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో ఇలాంటి క్రికెటర్‌ను పొట్టి కప్‌ కోసం ఎంపిక చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. మాజీ కెప్టెన్‌ మొయిన్‌ ఖాన్‌ కుమారుడు కావడం వల్లే ఆజంను ఎంపిక చేశారని కామెంట్లు చేస్తున్నారు. 

‘‘మా దేశంలో బంధు ప్రీతి ఎంత భయకరంగా ఉందో తెలియజేసేందుకు ఆజం ఖాన్ ఎంపికే ఉదాహరణ. ప్రతి విభాగంలో నిబంధనలను పాటించే వారే లేరు. ఇలాంటి ఆటగాళ్లను ఎంపిక చేసిన వారు సిగ్గుపడాలి. ఇదేదో పొరపాటున జరిగింది కాదు. క్రిమినల్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకొని జైలుకు పంపాలి’’

‘‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఆజం ఖాన్ ఆడటం చాలా కష్టం. ద్వైపాక్షిక సిరీసుల్లోనే ఇలా తడబాటుకు గురైతే.. ప్రపంచ కప్‌ వేదికల్లో ఇంకెలా ఆడతాడు?’’

‘‘అతడిని బలవంతంగా జట్టులోకి పంపినట్లు ఉన్నారు. ఇలాంటి ఫిట్‌నెస్‌తో ఎలా ఎంపిక చేశారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న?’’

తొలి కెప్టెన్‌గా బాబర్‌ అజామ్‌ ఘనత

టీ20ల్లో 2,500+ స్కోరు చేసిన తొలి కెప్టెన్‌గా బాబర్‌ అజామ్‌ రికార్డు సృష్టించాడు. సారథిగానే 2,520 రన్స్‌ రాబట్టాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో 22 బంతుల్లో 36 పరుగులు చేశాడు. దీంతో పొట్టి ఫార్మాట్‌లో 4,023 పరుగులు చేసినట్లైంది. అంతర్జాతీయంగా రెండో బ్యాటర్‌గా నిలిచాడు. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (4,037) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్ రోహిత్‌ శర్మ (3,974) వీరిద్దరి తర్వాత ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తే.. వారే టాప్‌లో ఉండేందుకు అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని