Roshibina Devi: భయాలను వెనక్కినెట్టి.. పతకం పట్టి..

ఆటగాళ్లకు సాధన ఎంతో ముఖ్యం. కానీ, రాష్ట్రంలో నెలకొన్న హింస ఆమె సాధనను సజావుగా సాగనివ్వలేదు. పతకం గెలవాలన్న ఆమె పట్టుదలకు అవాంతరాలన్నీ తలొంచాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రాక్టీస్‌ కొనసాగించి ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది.

Updated : 29 Sep 2023 16:50 IST

ఆసియా క్రీడల్లో మెరిసిన మణిపురి అమ్మాయి రోషిబినా

ఒకవైపు ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అనే భయం.. తోటి క్రీడాకారిణులకు వీసా దక్కకపోవడంతో ఆందోళన.. ప్రాక్టీస్‌ లేదన్న టెన్షన్‌! ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా మణిపుర్‌ (Manipur) అమ్మాయి రోషిబినా దేవి (Roshibina Devi) సత్తా చాటింది. హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో (Asian Games 2023) ఉషూ (Wushu) ఈవెంట్లో రజతం గెలిచింది.

ఒకవైపు హింస..మరోవైపు సాధన

మణిపుర్‌లోని బిషన్‌పుర్‌ జిల్లాకు చెందిన రోషిబినా ఓ రైతు కుటుంబం నుంచి వచ్చింది. మైతేయి తెగకు చెందిన ఈ అమ్మాయి.. చిన్నప్పటి నుంచి పోరాటాల మధ్యే పెరిగింది. రోషిబినా కుటుంబం ఉండే ప్రాంతంలోనే కుకీ తెగ ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో గొడవలు సర్వసాధారణంగా ఉండేవి. కానీ, ఇటీవల ఆ గొడవలు కాస్త హింసగా మారిపోవడంతో అందరి కుటుంబాల్లాగే రోషిబినా కుటుంబం వణికిపోయింది. ఇలాంటి స్థితిలోనూ ప్రాక్టీస్‌ కొనసాగించి ఆసియా క్రీడల్లో పాల్గొని పతకం గెలవడం ఆమె పట్టుదలకు నిదర్శనం. 

బాక్సింగ్‌ నుంచి ఉషూకు

మణిపుర్‌లో ఎక్కువమంది ఎంచుకునే క్రీడ బాక్సింగే. అందుకే రోషిబినా కూడా చిన్నప్పుడు ఈ ఆటకే ఆకర్షితురాలైంది. ఎక్కువశాతం బాక్సింగ్‌ రింగ్‌లోనే ఉండేది. అయితే, ఒకసారి ఆమెకు ఉషు పరిచయం అయింది. అక్కడ నుంచి ఆమె ఈ క్రీడను వదల్లేదు. బాక్సింగ్‌ మాదిరే పంచ్‌లు.. కరాటేలోలా కిక్‌లతో మేళవించి ఉండే ఉషూ ఆమెకు బాగా నచ్చేసింది. రైతు కుటుంబమే అయినా.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రోషిబినా ఆ ఆటలో ఎదిగింది. జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఈ మణిపురి అమ్మాయి.. నెమ్మదిగా అంతర్జాతీయ టోర్నీలో మెరిసింది. 2016 ప్రపంచ జూనియర్‌ ఉషూ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో రాణించిన ఆమె.. 2018 జకార్త ఆసియా క్రీడల్లో కాంస్యంతో అదరగొట్టింది.

ఇబ్బందులు ఎదురైనా..

ఈసారి హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లోనూ పతకమే లక్ష్యంగా బరిలో దిగిన రోషిబినాకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఒకవైపు మణిపుర్‌లో హింసాత్మక వాతావరణం ఆమెను బాగా కలవరపెట్టింది. రోషిబినా ఇంటికి దగ్గర్లోనే ఎన్నో అరాచకాలు జరిగాయి. ఆమె ఇల్లు పోలీస్‌ స్టేషన్‌కు సమీపంగానే ఉన్నా.. రక్షణ లేని పరిస్థితి ఉండడంతో రోషిబినా ప్రాక్టీస్‌ కూడా సజావుగా సాగలేదు. ప్రభుత్వం సాయం అందించడంతో ఎలాగో చైనా చేరుకున్న ఆమెకు అక్కడా మరో ఇబ్బంది ఎదురైంది. ఆమెతో ఎక్కువగా సాధన చేసే అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన తోటి క్రీడాకారిణులకు వీసా ఇవ్వడానికి చైనా నిరాకరించింది. దీంతో ముగ్గురు ఉషు క్రీడాకారిణులు భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామం రోషిబినా సాధనకు తీవ్ర ఆటంకం కలిగించింది. కానీ ధైర్యాన్ని కోల్పోకుండా బరిలో దిగిన ఈ మణిపురి అమ్మాయి రజతంతో మెరిసింది. పతకం గెలిచిన తర్వాత తన వాళ్లను తలుచుకుని ఉద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంటూ మణిపుర్‌ అల్లర్లలో బలైన వారికి తన పతకాన్ని అంకితం ఇస్తున్నట్లు తెలిపింది. తాను తన గ్రామానికి కూడా తిరిగి వెళ్లే పరిస్థితులు ఇప్పుడు లేవని.. ఇది ఇంకా బాధ కలిగిస్తోందని రోషిబినా వాపోయింది.

                              -ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని