Rohit Sharma: హార్దిక్‌కు మద్దతుగా రోహిత్‌.. అభిమానులను వారించిన హిట్‌మ్యాన్‌

Rohit Sharma-Hardik Pandya: వాంఖడే స్టేడియంలో హార్దిక్‌ పాండ్యకు వ్యతిరేకంగా కొందరు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో కెప్టెన్‌కు అండగా నిలిచిన రోహిత్‌.. అభిమానులను వారించారు.

Updated : 02 Apr 2024 15:01 IST

ముంబయి: రోహిత్‌ శర్మ (Rohit Sharma) స్థానంలో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)కు ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం వెళ్లిన ప్రతి స్టేడియంలో ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత తప్పట్లేదు. తాజాగా హోం గ్రౌండ్‌ వాంఖడేలో ఆ హేళన మరింత తీవ్రమైంది. మైదానంలో హార్దిక్‌ కదిలిన ప్రతిసారీ గ్యాలరీ నుంచి హిట్‌మ్యాన్‌ అభిమానులు ‘రోహిత్‌.. రోహిత్‌’ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పాండ్యకు మాజీ కెప్టెన్‌ అండగా నిలవడం విశేషం.

టాస్‌కు ముందు మైదానంలో హార్దిక్‌ వార్మప్‌ చేస్తుండగా కొందరు అభిమానులు అతడికి వ్యతిరేకంగా కేకలు పెట్టారు. ఆ తర్వాత టాస్‌కు వస్తున్నప్పుడు కూడా అదే పరిస్థితి కన్పించింది. రోహిత్‌ అభిమానులను చూసి పాండ్య నవ్వుతూ వెళ్లిపోయాడు. మ్యాచ్‌ మధ్యలోనూ గ్యాలరీ నుంచి అభిమానులు గట్టి గట్టిగా నినాదాలు చేయగా.. డీప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌.. అరవడం ఆపాలంటూ అభిమానులకు సైగలు చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘ఇదే హిట్‌మ్యాన్‌ హుందాతనం’అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

నేను ఇంకా బాగా ఆడాల్సింది: ముంబయి ఓటమిపై హార్దిక్‌

హార్దిక్‌ను తప్పించాలి: మనోజ్‌ తివారీ

ఎన్నో విమర్శల నడుమ ముంబయి పగ్గాలు చేపట్టిన హార్దిక్‌కు ఇప్పటి వరకు కలిసిరాలేదు. అతడి నాయకత్వంలో విజయాల ఖాతా తెరవని ఈ జట్టు.. వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. దీంతో ‘కెప్టెన్‌ మార్పు’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పాండ్యను తప్పించి.. ఆ బాధ్యతలను మళ్లీ రోహిత్‌కు అప్పగించాలని మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ అభిప్రాయపడ్డాడు. ‘‘కెప్టెన్‌ మార్పు అనేది చాలా పెద్ద నిర్ణయం. ఈ సీజన్‌లో ముంబయి ఒక్క పాయింట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇది కేవలం దురదృష్టకరం మాత్రమే కాదు. కొత్త నాయకత్వం గొప్పగా లేదు. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ముంబయి యాజమాన్యం వెనుకాడదని అనుకుంటున్నా’’ అని తివారీ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని