Hardik Pandya: నేను ఇంకా బాగా ఆడాల్సింది: ముంబయి ఓటమిపై హార్దిక్‌

Hardik Pandya: రాబోయే మ్యాచ్‌ల్లో జట్టుగా ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలమనే నమ్మకం తమకు ఉందని అన్నాడు ముంబయి కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య. ఇందుకోసం తాము మరింత ధైర్యంగా ఆడాల్సి ఉంటుందన్నాడు.

Published : 02 Apr 2024 09:58 IST

ముంబయి: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ముంబయి రాత ఇంకా మారలేదు. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఘోర పరాభవాన్ని చవిచూసిన ఆ జట్టు.. హ్యాట్రిక్‌ ఓటమిని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌ అనంతరం దీనిపై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) మాట్లాడుతూ.. తమ జట్టు మరింత క్రమశిక్షణతో, ధైర్యంగా ఆడాల్సిందని అన్నాడు.

‘‘మేం కోరుకున్న విధంగా ఆరంభం దక్కలేదు. ఇది కఠినమైన రాత్రి. ఫలితాలు అన్నిసార్లు అనుకున్నట్లు ఉండవు. వ్యక్తిగతంగా ఇక నా నుంచి ఆశ్చర్యకర ప్రదర్శన ఉంటుందని నేను భావించట్లేదు. కానీ, ఓ జట్టుగా రాణించగలమనే నమ్మకం ఉంది. అయితే, దాని కోసం మేం క్రమశిక్షణతో ఆడాల్సి ఉంటుంది. మరింత ధైర్యం ప్రదర్శించాలి’’ అని పాండ్య తెలిపాడు.

హ్యాట్రిక్‌.. వాళ్లకు విజయాల్లో.. వీళ్లకు ఓటముల్లో

‘‘ఒక దశలో మేం 150 లేదా 160 పరుగులు చేసే స్థితిలో ఉన్నాం. కానీ, నా వికెట్‌ కోల్పోయిన తర్వాత మ్యాచ్‌ పరిస్థితి మారిపోయింది. నేను మరింత బాగా ఆడాల్సింది. ఈ ఫలితాన్ని ఊహించలేదు’’ అని ముంబయి కెప్టెన్‌ అన్నాడు. అనంతరం రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మాట్లాడుతూ.. మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించడంలో టాస్‌ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డాడు. 

గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి.. ఆదిలోనే తడబడింది. నాలుగు ఓవర్లకే 20/4తో అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ 21 బంతుల్లో 34 పరుగులు చేయడంతో ముంబయి స్కోరు కనీసం 100 దాటగలిగింది. ఈ మ్యాచ్‌లో 125 పరుగులకు ఆ జట్టు కుప్పకూలగా.. రాజస్థాన్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని