Ambati Rayudu: ఇకనైనా అంబటి రాయుడుపై ట్రోలింగ్‌ ఆపండి: కెవిన్‌ పీటర్సన్

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా నెట్టింట ట్రోలింగ్‌కు గురయ్యాడు. వాటన్నింటిని కొట్టిపడేసి.. రాయుడుకు కెవిన్ పీటర్సన్ మద్దతుగా నిలిచాడు.

Updated : 28 May 2024 17:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 సీజన్‌ విజేతగా కోల్‌కతా నిలిచిన తర్వాత.. ఆర్సీబీని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. ‘ఆరెంజ్‌ క్యాప్‌’ల వల్ల టైటిళ్లు రావని రాయుడు వ్యాఖ్యానించాడు. ఆర్సీబీ వ్యక్తిగతంగా ఆడే క్రికెటర్లపై కాకుండా.. జట్టు కోసం ప్రదర్శన చేసే వారిని ఎంచుకోవాలని సూచించాడు. ఇక ఫైనల్‌ సందర్భంగా హైదరాబాద్‌పై కేకేఆర్‌ గెలిచాక ఆరెంజ్‌ డ్రెస్‌కు బదులు బ్లూ జెర్సీని రాయుడు ధరించాడు.  ‘నేను మంచిగా ఆడిన జట్టును ప్రోత్సహిస్తాను. ఫైనల్‌కు చేరిన రెండు టీమ్‌లకూ మద్దతు ఇస్తా’ అని వ్యాఖ్యానించాడు.  కామెంటేటర్‌గా ఉన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ ‘జోకర్‌’ (సరదాగా ఉండే వ్యక్తివి అంటూ) అని రాయుడిని సంభోదించాడు. సోషల్ మీడియాలో ఆ పదంతో భారత మాజీ క్రికెటర్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. దీంతో కెవిన్ పీటర్సన్ నేరుగా స్పందించాడు. 

‘‘భారత క్రికెటర్లను ట్రోలింగ్‌ చేసే బ్యాచ్ ఇకనైనా దానిని ముగించాలి. ఐపీఎల్ ఫైనల్‌ తర్వాత నేను, అంబటి రాయుడు సరదాగా మాట్లాడుకున్నాం. అయితే, సామాజిక మాధ్యమాల్లో మాత్రం రాయుడిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేయడం బాధాకరం. ప్లీజ్‌.. ఇకనైనా ఆపండి’’ అంటూ పీటర్సన్ పోస్టు పెట్టాడు. 

వారికి అలాంటి అవకాశం ఇవ్వాలి: రాయుడు

‘‘ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన జట్లకు అదనంగా ఇద్దరు లేదా ముగ్గురిని రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలి.  ఈ సీజన్‌లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన కోల్‌కతా, హైదరాబాద్‌కు ఆ అవకాశం ఇవ్వాలి’’ అని అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది మెగా వేలం నేపథ్యంలో రిటెన్షన్ విధానం ఉండనుంది. దీనిపై పీటర్సన్ స్పందిస్తూ.. ‘‘ఏ జట్టుకైనా సమాన అవకాశాలు ఇవ్వాలి. ఒక ఫ్రాంచైజీ లేదా టీమ్‌ను తయారుచేయడం చాలా కష్టం. ఎవరికి వారు ఇష్టానుసారం స్లాట్‌లను కేటాయించడం సరైంది కాదనేది నా అభిప్రాయంం’’ అని పీటర్సన్ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని