Praggnanandhaa: మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్‌ 2పై విజయం.. టాప్‌ - 10లోకి ప్రజ్ఞానంద

క్లాసికల్‌ చెస్‌లో ప్రపంచ నంబరు 2 ఫాబియానో కరువానాను భారత యువ సంచలనం ప్రజ్ఞానంద ఓడించాడు. ఈ విజయంతో అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ (FIDE) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లో స్థానం సంపాదించాడు. 

Published : 02 Jun 2024 14:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద (Praggnanandhaa) మరోసారి సత్తా చాటాడు. తెలివిగా పావులు కదిపి చెస్‌లో ప్రపంచ నంబర్ 2  ఫాబియానో కరువానాను ఓడించాడు. 2024 నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో ఐదో రౌండ్లో తెల్ల పావులతో ప్రజ్ఞానంద బరిలోకి దిగాడు. వరుసగా టాప్‌ ప్లేయర్లను ఓడించిన భారత స్టార్‌ అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ (FIDE) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లోకి దూసుకొచ్చాడు. నాలుగు ర్యాంకులను మెరుగుపర్చుకొని పదో స్థానం సాధించాడు. 

ఐదు సార్లు ప్రపంచ నంబరు వన్‌గా నిలిచిన మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఇదే టోర్నీ మూడో రౌండ్లో ప్రజ్ఞానంద ఓడించాడు. ఈ మ్యాచ్‌ను కేవలం 37 ఎత్తుల్లోనే సొంతం చేసుకున్నాడు. గతంలోనూ ర్యాపిడ్‌/ఎగ్జిబిషన్‌ గేమ్స్‌లో కార్లసన్‌ను ప్రజ్ఞానంద ఓడించిన సందర్భాలు ఉన్నాయి. దశాబ్దకాలంగా క్లాసికల్‌ చెస్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్న అతడిపై ఈసారి ప్రజ్ఞానంద పైచేయి సాధించాడు. నాలుగో రౌండ్లో అమెరికాకు చెందిన హికారు నకమురా చేతిలో ఓడిపోయిన ప్రజ్ఞానంద.. కుంగిపోకుండా తర్వాత రౌండ్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. తాజాగా ప్రపంచ నంబరు 2 ర్యాంకర్‌పై విజయం సాధించి సత్తా చాటాడు.

ఇప్పుడు కెప్టెన్‌ ఎవరో తెలుసు.. ఐపీఎల్‌ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు

ఒకే టోర్నీలో ఇద్దరు ప్రపంచ స్థాయి ఆటగాళ్లను (కార్ల్‌సన్, ఫాబియానో) ప్రజ్ఞానంద ఓడించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం ఈ టోర్నీలో ఐదు రౌండ్లు ముగిసేసరికి 8.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మరో ఐదు రౌండ్లు మిగిలి ఉన్నాయి. తాజాగా ప్రజ్ఞానంద విజయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. యువ సంచలనంపై ప్రశంసలు కురిపిస్తూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా పోస్టు పెట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని