Raina - Shahid Afridi: ఆ పోస్టును రైనా డిలీట్‌ చేయడానికి కారణమదే: షాహిద్‌ అఫ్రిది

వరల్డ్ కప్‌ కోసం షాహిద్‌ అఫ్రిదిని రాయబారిగా ఎంపిక చేసిన తర్వాత సురేశ్ రైనా ఓ ఆసక్తికర పోస్టు పెట్టాడు. దానిని ఆ తర్వాత తొలగించాడు.

Updated : 30 May 2024 16:15 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై భారత క్రికెటర్ సురేశ్‌ రైనా (Suresh Raina) సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే, ఆ తర్వాత దానిని తన ఖాతా నుంచి తొలగించాడు. అలా ఎందుకు చేశాడనేది షాహిద్ అఫ్రిది ఓ యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించాడు. తామిద్దరం మంచి స్నేహితులమని.. ఈ పోస్టుపై అతడితో చర్చించినట్లు అఫ్రిది వెల్లడించాడు.

‘‘సురేశ్‌ రైనా మంచి వ్యక్తి. క్రికెట్‌కు సంబంధించిన చాలా విషయాలను అతడితో చర్చిస్తుంటా. కొన్నిసార్లు మా మధ్య చిన్నపాటి వాగ్వాదమూ జరుగుతుంటుంది. అదంతా అప్పటివరకే. ఆ తర్వాత అంతా మామూలు అయిపోతుంది. సోషల్ మీడియాలో రైనా పెట్టిన పోస్టు చూసిన తర్వాత.. అతడితో మాట్లాడా. సోదరుడిగా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. పోస్టును డిలీట్ చేయడానికి అంగీకరించాడు. ఇప్పుడంతా బాగుంది. పొరపాటును సరిదిద్దుకోవడం వ్యక్తిగతంగా గొప్పగా నిలుస్తుంది’’ అని అఫ్రిది తెలిపాడు. 

ఇంతకీ రైనా ఏం పోస్టు పెట్టాడంటే..?

టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఐసీసీ షాహిద్‌ను రాయబారిగా ప్రకటించింది. దీనిపై సురేశ్‌ రైనా స్పందిస్తూ.. ‘‘నేను ఐసీసీ అంబాసిడర్‌ను కాదు. అయితే మా ఇంట్లో 2011 వరల్డ్‌ కప్‌ ఉంది. మొహలీలో మ్యాచ్‌ గుర్తుంది కదా? తప్పకుండా మీకోసం అలాంటి జ్ఞాపకాలను మళ్లీ తీసుకొస్తాం’’ అని పోస్టు పెట్టాడు. అంతకుముందు అఫ్రిది రిటైర్‌మెంట్‌పైనా ఓ సందర్భంలో రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్‌ సింగ్‌, క్రిస్‌ గేల్‌, ఉసేన్ బోల్ట్‌ను ఇప్పటికే అంబాసిడర్‌లుగా నియమించిన సంగతి తెలిసిందే.

గతంలో రిటైర్‌మెంట్‌పైనా..

‘‘ఐపీఎల్‌ కోసం ఏమైనా రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటావా?’’ అని రైనాను చోప్రా ప్రశ్నించాడు. దానికి భారత మాజీ క్రికెటర్ ఠక్కున స్పందిస్తూ.. ‘‘నేను సురేశ్‌ రైనాను. షాహిద్‌ అఫ్రిదిని కాదు’’ అని వ్యాఖ్యానించాడు. అఫ్రిది క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నానని ప్రకటించిన తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. వాటిని ఉదహరిస్తూ రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని