Punjab Vs Rajasthan: రాజస్థాన్‌.. గత సీజన్‌ పరిస్థితిని తెచ్చుకోవద్దు: టామ్‌ మూడీ కీలక సూచన

ఐపీఎల్ 17వ సీజన్‌ పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇవాళ పంజాబ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.

Updated : 13 Apr 2024 17:33 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో ముల్లాన్‌పుర్ మైదానం వేదికగా పంజాబ్‌తో తలపడేందుకు రాజస్థాన్ సిద్ధమైంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన ఆ జట్టు గుజరాత్‌ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్న ఆ జట్టు మిగతా మ్యాచుల్లో విజయం సాధించాలని.. లేకపోతే 2023 సీజన్‌ ఫలితాలే పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆసీస్‌ మాజీ క్రికెటర్ టామ్‌ మూడీ వ్యాఖ్యానించాడు. అలాంటి ప్రమాదం రాకుండా మెరుగ్గా రాణించాలని సూచించాడు. 

‘‘పంజాబ్‌ జట్టులో శశాంక్‌ గురించే నా ఆలోచనంతా. గత కొన్నేళ్లుగా అతడి ఆటను చూస్తున్నా. ఈసారి మాత్రం ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్నాడు. గతంలో హైదరాబాద్‌ జట్టుకూ ఆడాడు. అక్కడ గొప్ప ప్రదర్శన చేయలేదు. ఇప్పుడు మాత్రం అదరగొట్టేస్తున్నాడు. రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో శశాంక్‌ ఆటను చూడాలని ఉంది. సంజూ శాంసన్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఒక ఓటమిని చవిచూసింది. ఇలాంటప్పుడు ఓ విషయాన్ని గుర్తుకుతెస్తున్నా. గతేడాది కూడా రాజస్థాన్‌ వరుసగా విజయాలు సాధించి మంచి ఊపు మీదుంది. ఆ తర్వాత ఓటములతో చివరికి ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జోరును కొనసాగించాలి. పంజాబ్ ఓటమి బాధలో ఉంది. తప్పకుండా పుంజుకొని పంచ్‌ ఇవ్వడానికి ఎదురుచూస్తోంది. అర్ష్‌దీప్‌ కొత్త బంతితో స్వింగ్‌ అద్భుతంగా రాబడుతున్నాడు. అతడితో రాజస్థాన్‌కు ఇబ్బందులు తప్పవు’’ అని టామ్‌ మూడీ వ్యాఖ్యానించాడు.

ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశమంటే...?: గిల్‌క్రిస్ట్‌

రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్, దిల్లీ సారథి రిషభ్‌ పంత్, ముంబయి ఓపెనర్ ఇషాన్ కిషన్‌ టీ20 ప్రపంచకప్‌ వికెట్‌ కీపర్ల రేసులో ముందున్నారు. కేఎల్ రాహుల్‌ ఉన్నప్పటికీ.. అతడు పూర్తిస్థాయి స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్‌ను పరిగణించే అవకాశాలు తక్కువ. దీంతో పై ముగ్గురిలో ఎవరిని తీసుకొనేందుకు సెలక్టర్లు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానంగా ఆసీస్‌ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ స్పందించాడు. ‘‘రిషభ్‌ పంత్ అందరికంటే ముందున్నాడు. సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్‌ కూడా మంచి ఫామ్‌తోనే పరుగులు చేస్తున్నారు. కేవలం ఒక్కరిని మాత్రమే తీసుకోవాలంటే పంత్‌ వైపే నేను మొగ్గు చూపుతా. జితేశ్ శర్మ కూడా ఉన్నప్పటికీ సీనియర్లనే ఎంచుకోవడం ఉత్తమం. పంత్‌ తర్వాత సంజూ జట్టులో ఉండటం బెటర్’’ అని గిల్‌క్రిస్ట్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని