Rajasthan vs Delhi: దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ విజయం

ఐపీఎల్‌ 2024లో భాగంగా దిల్లీతో జరిగిన పోరులో రాజస్థాన్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Updated : 29 Mar 2024 00:40 IST

జైపుర్‌: ఐపీఎల్‌ (IPL) 17వ సీజన్‌లో రాజస్థాన్‌ (Rajasthan) వరుసగా రెండో విజయం సాధించింది. దిల్లీ (Delhi)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (49), స్టబ్స్‌ (44*) చెలరేగి ఆడినప్పటికీ మిగతా వారు విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో బర్గర్‌, చాహల్‌ తలో రెండు వికెట్లు తీశారు.

తొలుత వార్నర్‌.. తర్వాత స్టబ్స్‌..

186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన దిల్లీ ఓపెనర్లు వార్నర్‌, మార్ష్‌ (23: 12 బంతుల్లో) తొలి ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే తీశారు. అయితే రెండో ఓవర్లలో మూడు ఫోర్లు బాది బర్గర్‌కు మార్ష్‌ చుక్కలు చూపాడు. మూడో ఓవర్లోనూ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు మూడు ఫోర్లు కొట్టడంతో ఒక్కసారిగా దిల్లీ శిబిరంలో ఊపు వచ్చింది. అయితే నాలుగో ఓవర్లో బర్గర్‌ రెండు వికెట్లు తీసి దిల్లీకి షాక్‌ ఇచ్చాడు. దూకుడుగా ఆడుతున్న మార్ష్‌ను, రిక్కీ భుయ్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన పంత్‌ (28: 26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌)తో జత కట్టిన వార్నర్‌ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. ఐదో ఓవర్లో రెండు సిక్స్‌లు, ఆరో ఓవర్లో ఫోర్‌, సిక్స్‌ బాదడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి 59 పరుగులతో నిలిచింది. పంత్‌ సైతం దూకుడుగా ఆడడంతో 10 ఓవర్లు ముగిసే సరికి దిల్లీ 2 వికెట్ల నష్టానికి 89 పరుగులతో నిలిచింది.

అయితే 97 పరుగుల వద్ద వార్నర్‌, 105 పరుగుల వద్ద పంత్‌ ఔట్‌ అయ్యారు. వీరు ఔటైన అనంతరం స్కోర్‌ ఒక్కసారిగా నెమ్మదించింది. 15.3 ఓవర్ల వద్ద అభిషేక్‌ (9) వెనుదిరిగాడు. దీంతో 16 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులతో నిలిచింది. ఆ సమయంలో దిల్లీ విజయానికి 24 బంతుల్లో 60 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌ (15*: 13 బంతుల్లో) ఉన్నారు. దిల్లీ భారీ తేడాతో ఓడిపోతుందని అంతా భావించారు. అయితే అశ్విన్‌ వేసిన 17వ ఓవర్లో స్టబ్స్‌ ఒక్క సారిగా చెలరేగిపోయాడు. రెండు సిక్స్‌లు బాదడంతో ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో 9 పరుగులు, 19 ఓవర్లో 15 పరుగులు రాబట్టారు. దీంతో చివరి ఓవర్లో విజయ లక్ష్యం 17 పరుగులుగా మారింది. అయితే అవేశ్‌ ఖాన్‌ చివరి ఓవర్‌లో మాయ చేశాడు. అద్భుతంగా బౌలింగ్‌ వేసి కేవలం 4 పరుగులు మాత్రమే రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (84: 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) విశ్వరూపం ప్రదర్శించాడు. అశ్విన్‌ (29), ధ్రువ్‌ జురెల్‌ (20) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌, అన్రిచ్‌ నోర్జే, అక్షర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని