Rajasthan vs Lucknow: పూరన్‌, కేఎల్‌ రాహుల్‌ పోరాటం వృథా.. రాజస్థాన్‌దే విజయం

ఐపీఎల్‌ 17లో భాగంగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 20 పరుగుల తేడాతో గెలుపొందింది

Updated : 24 Mar 2024 20:56 IST

జైపుర్‌: ఐపీఎల్‌-17లో భాగంగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. అర్ధశతకం చేసిన సంజూ శాంసన్‌ (82*) మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. లక్ష్య ఛేదనకు దిగిన లఖ్‌నవూ ప్రారంభం నుంచే తీవ్ర ఒత్తిడిలో కొనసాగింది. తొలి ఓవర్‌ చివరి బంతికే  ఓపెనర్‌ డికాక్‌ (4) బర్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్‌డౌన్‌ వచ్చిన పడిక్కల్‌ (0) పరుగులేమీ చేయకుండానే బౌల్ట్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే ఆయుష్‌ బదోనీ (1) బర్గర్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికి జట్టు స్కోరు 11 పరుగులు మాత్రమే. తీవ్ర కష్టాల్లోకి వెళ్లిన జట్టును ఆదుకునేందుకు దీపక్‌ హుడా (26)తో కలిసి కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (58; 44 బంతుల్లో 4×4,2×6) తీవ్రంగా శ్రమించాడు.

క్రీజులో నిలదొక్కుకుంటున్న ఈ జోడీని చాహల్‌ విడగొట్టాడు. ధ్రువ్‌ జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి హుడా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పూరన్‌ (64*; 41 బంతుల్లో 4×4, 4×6), రాహుల్‌తో కలిసి తీవ్రంగా పోరాడాడు. అయితే, జట్టు స్కోరు 145 పరుగుల వద్ద రాహుల్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి మళ్లీ ధ్రువ్‌ చేతికే చిక్కిపోయాడు. చివర్లో వచ్చిన స్టాయినిస్‌ (3), కృనాల్‌ పాండ్య (3) రాణించకపోవడంతో లఖ్‌నవూకు ఓటమి తప్పలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో బౌల్ట్‌ 2 వికెట్లు తీయగా, బర్గర్‌, అశ్విన్‌, చాహల్‌, సందీప్‌ శర్మ తలో వికెట్ పడగొట్టారు. 

అదరగొట్టిన కెప్టెన్‌ సంజూ

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. సంజు శాంసన్ (82*; 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రియాన్‌ పరాగ్ (43; 29 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), జోస్ బట్లర్ (11; 9 బంతుల్లో 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ధ్రువ్‌ జురెల్ (20*) పరుగులు చేయగా.. పవర్‌ హిట్టర్‌ హెట్‌మయర్‌ (5) నిరాశపర్చాడు. లఖ్‌నవూ బౌలర్లలో నవీనుల్‌ హక్‌ 2, రవి బిష్ణోయ్‌, మోసిన్‌ ఖాన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని