IND vs SL: భారత్‌కు ఇలాంటి విజయాలు కావాలన్న రవిశాస్త్రి.. ఫిక్సింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చిన షోయబ్‌ అక్తర్!

Published : 13 Sep 2023 14:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో శ్రీలంకపై భారత్‌ కష్టపడి గెలిచింది . పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు ఓ మోస్తరు స్కోరే (213) చేయగలిగారు. అయితే, దానినే కాపాడుకుని మరీ టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ విజయం సాధించడంపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. టీమ్‌ఇండియా ఆటగాళ్లను అభినందనలతో ముంచెత్తాడు. మరోవైపు పాక్‌ ఫైనల్‌కు రాకుండా భారత్ - శ్రీలంక మ్యాచ్‌ను ఫిక్స్‌ చేశారని తమ దేశంలో వచ్చిన ఆరోపణలను షోయబ్ అక్తర్ కొట్టిపడేశాడు. 

వారికీ క్రెడిట్‌ ఇవ్వాలి: భారత మాజీ ప్రధాన కోచ్

‘‘భారత్ - శ్రీలంక జట్ల మధ్య అద్భుతమైన మ్యాచ్‌ జరిగింది. ఇందులో శ్రీలంక ఓడిపోయినా సరే ఆ టీమ్‌కూ క్రెడిట్ ఇవ్వాలి. భారత్ 80/0తో ఉన్నప్పటి నుంచి 213 పరుగులకు ఆలౌట్‌ చేయడమే కాకుండా.. బ్యాటింగ్‌లోనూ చివరి వరకు పోరాడింది. యువ ఆటగాడు దునిత్ వెల్లలాగె ఇటు బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ రాణించాడు. తన అనుభవానికి మించి ఉత్తమ ప్రదర్శన చేశాడు. అయితే, భారత్‌కు ఇలాంటి మ్యాచ్‌లు కావాలి. ఇలాంటి విజయాలు అవసరం. పోరాడి గెలిస్తే వచ్చే మజా భలేగా ఉంటుంది. క్లిష్టమైన పిచ్‌పై విజయం సాధించడం సాధారణ విషయం కాదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ టీమ్‌ఇండియా అదరగొట్టేసింది. సమష్టి కృషితో సాధించిన గెలుపు. తప్పకుండా ఈ విజయం ఫైనల్‌లో భారత్‌కు సానుకూలంగా మారుతుంది’’ అని తెలిపాడు. 


ఫిక్స్ అయిందన్న వ్యాఖ్యలను కొట్టిపడేసిన అక్తర్‌

ఆసియా కప్ ఫైనల్‌కు తమ జట్టు రాకుండా అడ్డుకునేందుకే భారత్‌ చేతిలో శ్రీలంక ఓడిపోయిందని పాక్‌ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు. అయితే, పాక్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్ మాత్రం అలాంటి వ్యాఖ్యలను కొట్టిపడేశాడు. ఫిక్స్‌ చేసిందని మీమ్స్‌, మెసేజ్‌లు చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

‘‘ఎందుకు ఇలా వారు (పాక్ అభిమానులు) చేస్తున్నారో అర్థం కావడం లేదు. శ్రీలంక చేతిలో కావాలనే భారత్ ఓడిపోతుందనే విధంగా మీమ్స్‌, మెసేజ్‌లు వచ్చాయి. ఇదంతా తప్పని నిరూపించగలను. శ్రీలంక అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. వెల్లలాగె, అసలంక ఉత్తమ ప్రదర్శనతో భారత్‌ను కట్టడి చేశారు. ఓ 20 ఏళ్ల కుర్రాడు (వెల్లలాగె) 43 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండటంతోపాటు ఐదు వికెట్లు తీశాడు. విజయం కోసం శ్రీలంక తీవ్రంగా పోరాడింది. మరోవైపు భారత్‌ తరఫున కుల్‌దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీసి తన జట్టును గెలిపించాడు. రెండుజట్ల మధ్య జరిగిన పోరు అద్భుతంగా ఉంది. పాకిస్థాన్‌ జట్టు ఆటగాళ్లు మాత్రం పోటీనివ్వలేకపోయారు. మన ఫాస్ట్‌బౌలర్లు సరిగ్గా ఆడలేదు. అలాంటప్పుడు ఇలాంటి ఫిక్సింగ్‌ మాటలు ఎలా చెప్పగలం..? అయితే, తప్పకుండా పాక్‌ పుంజుకుంటుందనే ఆశాభావం ఉంది’ అని అక్తర్‌ తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని